IND VS ENG 2nd Test: అరుదైన క్లబ్‌లో చేరిన జైస్వాల్‌ | IND VS ENG 2nd Test: Yashasvi Jaiswal Is The 16th Indian To Reach Test Hundred With A Six | Sakshi
Sakshi News home page

IND VS ENG 2nd Test: అరుదైన క్లబ్‌లో చేరిన జైస్వాల్‌

Published Fri, Feb 2 2024 8:02 PM | Last Updated on Fri, Feb 2 2024 8:12 PM

IND VS ENG 2nd Test: Yashasvi Jaiswal Is The 16th Indian To Reach Test Hundred With A Six - Sakshi

వైజాగ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారీ సెంచరీ (179) చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్న టీమిండియా భవిష్యత్ తార, యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో సిక్సర్‌ కొట్టి సెంచరీ పూర్తి చేసిన జైస్వాల్‌.. భారత్‌ తరఫున టెస్ట్‌ల్లో సిక్సర్‌తో సెంచరీ మార్కును అందుకున్న 16వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.

సిక్సర్‌తో సెంచరీ మార్కును తొలుత పాలీ ఉమ్రిగర్‌ అందుకోగా.. అత్యధిక సార్లు ఈ ఫీట్‌ను సాధించిన రికార్డు సచిన్‌ టెండూల్కర్‌ ఖాతాలో ఉంది. సచిన్‌ ఏకంగా ఆరు సార్లు సిక్సర్‌తో సెంచరీ మార్కును అందుకున్నాడు. సచిన్‌ తర్వాత ప్రస్తుత టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అత్యధికంగా మూడు సార్లు ఇలా సెంచరీ మార్కును తాకాడు. మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌, కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌ తలో రెండు సార్లు సిక్సర్‌ కొట్టి సెంచరీ పూర్తి చేశారు.

విశేషమేమిటంటే హర్భజన్‌ సింగ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ లాంటి ఫుల్‌టైమ్‌ బౌలర్లు కూడా సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేశారు. వీరిద్దరూ తలో సారి ఇలా సెంచరీ మార్కును అందుకున్నారు. ఈ జాబితాలో పైపేర్కొన్న వారు కాకుండా కపిల్‌ దేవ్‌, మొహమ్మద్‌ అజారుద్దీన్‌, రాహల్‌ ద్రవిడ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, ఎంఎస్‌ ధోని, పుజారా ఉన్నారు. సిక్సర్‌తో సెంచరీ మార్కును ఓసారి తాకిన సెహ్వాగ్‌.. డబుల్‌ సెంచరీ, ట్రిపుల్‌ సెంచరీ మార్కును కూడా సిక్సర్‌తో చేరుకుని చరిత్రపుటల్లోకెక్కాడు. 

ఇదిలా ఉంటే, ఐదు మ్యచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (14), శుభ్‌మన్‌ గిల్‌ (34), శ్రేయస్‌ అయ్యర్‌ (27)‌, రజత్‌ పాటిదార్‌ (32), అక్షర్‌ పటేల్‌ (27), శ్రీకర్‌ భరత్‌ (17) తక్కువ స్కోర్లకే ఔటైనా యశస్వి కెరీర్‌ అత్యుత్తమ ఇన్నింగ్స్‌ ఆడి టీమిండియా గౌరవప్రదమైన స్కోర్‌ సాధించేలా చేశాడు. యశస్వితో పాటు అశ్విన్‌ (5) క్రీజ్‌లో ఉన్నాడు.

ఇంగ్లండ్‌ బౌలర్లలో అరంగేట్రం బౌలర్‌ షోయబ్‌ బషీర్‌, రెహాన్‌ అహ్మద్‌ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఆండర్సన్‌, టామ్‌ హార్ట్లీ తలో వికెట్‌ దక్కించకున్నారు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విజయం​ సాధించిన విషయం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement