నిజాయితీకి బలిపీఠం..
డీవైఎస్పీ కల్లప్ప ఆత్మహత్య సంఘటన మరవక ముందే మరో డీవైఎస్పీ గణపతి బలవనర్మణానికి పాల్పడటంతో సిద్దు సర్కార్ సంకట స్థితిలో పడింది. రాజకీయ ఒత్తిళ్లతోనే నిజాయితీ అధికారులు బలవతున్నారని విపక్షాలు ధ్వజమెత్తున్నాయి. మొన్నటికి మొన్న ఐఏఎస్ అధికారి డీకే రవి ఆత్మహత్య, నిన్న డీవైఎస్పీ కల్లప్ప, నేడు గణపతి ఆత్మహత్య వ్యవహారం ఉన్నతాధికారుల్లో ఆందోళన నెలకొంది. విపరీతమైన రాజకీయ జోక్యంతో ఎలా విధులు నిర్వహించాలని అధికారులు మదనపడుతున్నారు.
సాక్షి, బెంగళూరు : నిజాయితీ, కార్యదక్షత కలిగిన ఐఏఎస్ అధికారిగా పేరున్న డీ.కే రవి గత ఏడాది మార్చిలో బెంగళూరులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. నిర్మాణ రంగంలోని ఓ సంస్థ పన్నులు ఎగ్గొట్టిన విషయానికి సంబంధించి నివేదిక తయారు చేస్తుండగా ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. సదరు నిర్మాణ రంగంలోని సంస్థలో కొంత మంది అమాత్యులకు కూడా ‘షేర్’ ఉండటంతో వారి ఒత్తిళ్ల వల్ల డీ.కే రవి బలవన్మరణానికి పాల్పడ్డారని సమాచారం. మొన్నటికి మొన్న కూడ్లగి డీ.ఎస్పీ అనుపమా షణై కూడా రాజకీయ ఒత్తిళ్లను తట్టుకోలేక ఉద్యోగానికి రాజీనామా చేశారు. లిక్కర్ మాఫియాపై ఉక్కుపాదం
మోపినందుకు తనపై హోంశాఖలోని ఉన్నతాధికారులతో పాటు మాజీ మంత్రి పరమేశ్వర్‌నాయక్ ఒత్తిళ్లు తెచ్చారని, వాటిని తట్టుకోలేకనే ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు బహిరంగంగా పేర్కొన్నారు. ఉన్నతాధికారులతో పాటు మాజీ హోంశాఖ మంత్రి, ప్రస్తుత బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి కే.జే జార్జ్ తన చావుకు కారణమని ఆత్మహత్య చేసుకోక ముందు మంగళూరు ఐజీ కార్యాలయంలో పనిచేస్తున్న డీవైఎస్పీ గణపతి ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ డీఎస్పీ కల్లప్ప ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో సైతం ఓ ఎస్పీ ఒత్తిళ్లు కూడా కారణమనే వాదన వినిపిస్తోంది.
వారిపై చర్యలేవి...
ఉగ్రవాదిని తుదముట్టించడానికి వెళ్లిన ఎస్ఐ మల్లికార్జున బండే సదరు ‘ఆపరేషన్’లో పాల్గొన్న హోంశాఖలోని ఐపీఎస్ అధికారి తూటాకు బలైనట్లు ఆ శాఖలోని సిబ్బందే చెబుతున్నారు. సదరు ఐపీఎస్ అధికారిపై ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. తాను చెప్పినట్లు వినటం లేదన్న కక్షతోనే సదరు ఉన్నతాధికారి నిజాయితీ అధికారిగా పేరొందిన మల్లికార్జున బండేను పొట్టన పెట్టుకున్నట్లు ఆయన సహచర ఉద్యోగులు చెబుతున్నారు. కేవలం హోంశాఖలోని అధికారులకే కాకుండా ఐఏఎస్ అధికారులు కూడా తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న విషయాలు ఇటీవల బయటపడ్డాయి.
ముఖ్యంగా సిద్ధరామయ్య ఆప్తుడిగా పేరొందిన కే.మరిగౌడ ఓ తహశీల్దార్ పోస్టింగ్ విషయంలో ఏకంగా మైసూరు కలెక్టర్ శిఖపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో ఆమె మరిగౌడపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినాఎటువంటి చర్యలూ తీసుకోవక పోవడం గమనార్హం. ఇలా వరుసగా రాష్ట్రంలో ఉన్నతాధికారులు ఒత్తిళ్లతో పనిచేస్తుండటం వల్ల పాలన అగమ్యగోచరంగా తయారైందన్న వాదన వినిపిస్తోంది.
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.....
ఆత్మహత్యకు పాల్పడిన గణపతి అంత్యక్రియలు ఆయన స్వస్థలం సోమవారపేట తాలూకా రంగసముద్రలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. భార్య పావని ఇద్దరు కుమారులు, కుటుంబ సభ్యులు,రాజకీయనాయకులు, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
గుమాస్తాగా పనిచేయాల్సి వస్తోంది...
‘మంగళూరు చర్చ్ పై దాడి జరిగినప్పుడు నన్ను అన్యాయంగా సస్పెండ్‌చేశారు. యశ్వంత్‌పుర ఎన్కౌంటర్ విషయంలో కూడా అలాగే జరిగింది. ఓ రౌడీని విధిలేని పరిస్థితుల్లో ఎన్కౌంటర్ చేశాను. ఇందుకు నన్ను సస్పెండ్‌చేశారు. ఈ రెండింటి విషయంలో చాలా కాలంగా నాపై ఉన్న శాఖపరమైన విచారణల నుంచి నేను క్లీన్చిట్ పొందాను. ఎప్పుడో రావాల్సిన డీఎస్పీ ప్రమోషన్ మూడు నెలల ముందు వచ్చింది. అలస్యంగా ప్రమోషన్ రావడానికి మంత్రి కే.జేజార్జ్, ఉన్నతాధికారులు కారణం. చాలా చోట్ల డీఎస్పీ పోస్టులు ఖాళీగా ఉన్నా నాకు ఐజీ కార్యాలయంలో డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ నేను గుమాస్తాగా ఒత్తిడితో పనిచేయాల్సి వస్తోంది.’ అని చనిపోవడానికి ముందు గణపతి తనకు స్నేహితుడైన ఓ లాయర్ వద్ద చెప్పుకుని బాధపడినట్లు తెలిసింది.
రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళనలు: ఇదిలా ఉండగా గణపతి ఆత్మహత్య నేపథ్యంలో రాష్ర్టంలోని వివిధ ప్రాంతాల్లో బీజేపీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాయి. మడికెర, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ధర్నాలు, రాస్తారోకో నిర్వహించారు.