Dyspepsia
-
హెల్త్‌టిప్స్
ఎసిడిటీ, అజీర్తితో బాధపడేవారు పరగడుపున టీ స్పూన్ అల్లం రసంలో ఐదారు చుక్కల తులసి రసం లేదా చిటికెడు మెంతిపొడి కలిపి తీసుకుంటుంటే ఎసిడిటీ, అజీర్తి తగ్గుతాయి.కడుపులో తిప్పుతున్నట్టు, వాంతి అయ్యేట్టుగా అనిపిస్తుంటే నోట్లో 3-4 లవంగాలు వేసుకుని నమిలితే సమస్య తగ్గుతుంది. ఒక గ్లాసు నీటిలో రెండు టీ స్పూన్లు ఉసిరి పొడి కలుపుకొని ప్రతిరోజూ తీసుకుంటే ఎసిడిటీ సమస్య క్రమంగా తగ్గుతుంది.చలికాలంలో తరచుగా జలుబు వేధిస్తుంటుంది. జలుబు తీవ్రమై గాలి పీల్చడానికి కష్టంగా ఉంటే, ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో రెండు వెల్లుల్లి రెబ్బలను చిదిమి వేసుకుని ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఇలా రెండు రోజులు చేస్తే ఉపశమనం ఉంటుంది. -
మొటిమలకు చెక్..
బ్యూటిప్స్ ముఖంపై ఏ భాగంలో ఈ మొటిమలు ఎందుకు వస్తాయో తెలిస్తే వాటి నుంచి ఎవరైనా సత్వర ఉపశమనం పొందొచ్చు.. అదెలా అనుకుంటున్నారా..? అయితే ఇలా తెలుసుకోండి. నుదురు మీద: టీనేజ్ వారి నుంచి వయసు పైమళ్లిన వారి వరకు చాలామందికి నుదుటి మీద మొటిమలు వస్తుంటాయి. వీటికి ముఖ్య కారణాలు అజీర్తి, డీహైడ్రేషన్. దాని కోసం రోజుకు వీలైనన్ని ఎక్కువ గ్లాసుల నీరు తీసుకుంటే సరి. అజీర్తి చేయకుండా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు టైమ్‌కు తినేయాలి. టీ జోన్: టీనేజర్లకు ఎక్కువ మొటిమలు అయ్యేది ఈ టీ జోన్లోనే. అంటే ముక్కు, నుదురు భాగాల్లో. ఇక్కడ మొటిమలు అవుతున్నాయంటే కారణం కాలేయ సంబంధిత సమస్య ఉందని అర్థం. అందుకు కొవ్వు పదార్థాలు, జిగురు పదార్థాలు ఆహారంలో లేకుండా చూసుకోవాలి. బుగ్గలపై: ఎంతో అందంగా ఉండే బుగ్గలపై మొటిమలు వస్తుంటాయి. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన అంశం. పొగ తాగటం, కాలుష్యపూరిత వాతావరణంలో తిరగడం మూలాన బుగ్గలపై మురికి ఏర్పడి అవి మొటిమలు ఏర్పడటానికి కారణమవుతుంది. అలాగే ఈ మధ్య స్మార్ట్ఫోన్లతో ఎక్కువగా మాట్లాడటం వల్ల వాటిపై ఉండే దుమ్ము, ధూళి ముఖ చర్మానికి తగిలి మొటిమలు అవుతున్నాయి ఎంతోమందికి. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే బయటికి వెళ్లినప్పుడు ముఖానికి ప్రొటెక్టివ్ లోషన్ రాసుకోవడం, ఫోన్‌ను యాంటీ బ్యాక్టీరియల్ లోషన్‌తో రోజూ తుడవడం చేయాలి. పిల్లో కవర్లను తరచూ శుభ్రం చేసుకోవడం కూడా ముఖ్యం. నోటి చుట్టూ: దంత సమస్యలున్నవారికి ఈ ప్రాంతాల్లో ప్రభావం చూపుతుంది. దాని కోసం షుగరీ ఫుడ్స్, సోడా లాంటివి తీసుకోవడం మానేయాలి. అలాగే రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకుంటూ కాఫీ, టీలు తాగడం తగ్గించాలి. చెవి భాగం: ఇక్కడ మొటిమలు అవుతున్నాయంటే శరీరం డీహైడ్రేట్ అవడంతో పాటు కిడ్నీ పనితీరులో సమస్య ఉందని అర్థం. అంతే కాకుండా ఆహారంలో ఉప్పుశాతాన్ని ఎక్కువ తీసుకున్నా ఈ ఇబ్బంది వస్తుంది. దాని కోసం వీలైనన్ని గ్లాసుల నీళ్లు తాగాలి. అలాగే తలస్నానం చేసేప్పుడు కండీషనర్‌ను, నూనెను సరిగ్గా శుభ్రం చేసుకోకపోయినా చెవి భాగం దగ్గర మొటిమలు వస్తాయి. చుబుకం(చిన్) కింది భాగం: ఈ ప్రాంతంలో మొటిమలు అవుతున్నాయంటే చిన్న ప్రేగులో ఏదో సమస్య తలెత్తిందని గుర్తించాలి. అలాగే హార్మోన్ల అస్థిరత కారణంగా కూడా మొటిమలు వస్తుంటాయి. అంతేకాకుండా బోర్ కొట్టినప్పుడు, ఏదో ఆలోచిస్తున్నప్పుడు, అలసిపోయినప్పుడు చాలా మంది చుబుకం కింద చేతులు పెట్టుకొని కూర్చుంటారు. అలా చేయడం వల్ల చేతి వేళ్లలో ఉండే ఆయిల్ చిన్భాగంలోకి వెళ్లి మొటిమలు తయారవుతాయి. -
మావాడు తిననే తినడు...
చిన్నపిల్లలు అంటే పాలు తాగే పిల్లల దగ్గర్నుంచి పదీ, పన్నెండేళ్ల పిల్లల వరకూ వస్తారు. చంటిపిల్లలు పాలు తాగేసి, మళ్లీ కక్కినా పెద్దలు అంతగా బాధపడరు. ఎందుకంటే పిల్లలు అలా పాలు కక్కడం సాధారణమేననీ, ఇది మరీ అదేపనిగా జరుగుతుంటే ఆందోళన పడాలని అనుభవజ్ఞానంతో వారు చెబుతుంటారు. కానీ ఘనాహారం తీసుకుంటూ అది జీర్ణం కాకపోతేనే సమస్య. అయితే చాలామంది పిల్లల తల్లిదండ్రులది ఒకటే ఫిర్యాదు. అది... వాళ్ల చిన్నారి సరిగా ఆహారం తీసుకోడనీ, చాలా అరకొరగా తింటుంటాడని. ఈ నేపథ్యంలో ‘పిల్లలకు జీర్ణ సమస్య’ అనేది ఒకింత సంక్లిష్టమైన అంశం. అందుకే పిల్లల్లో ఆహారం జీర్ణం కాకపోతే వచ్చే సమస్యలూ, వాటి నివారణ అంశాలను తెలుసుకుందాం. పిల్లల్లో ఆహారం జీర్ణం కాకపోవడం, తిన్న తర్వాత ఆహారం పైకి తన్నడం వంటి లక్షణాలు పెద్దలతో పోలిస్తే చాలా తక్కువ. అయితే కొందరు పిల్లల్లోనూ పెద్దలలో కనిపించేలాంటి అజీర్తి సమస్యలు కనిపిస్తుంటాయి. దీని వల్ల పిల్లలూ బాధపడుతుంటారు. పెద్దల్లో కనిపించే గ్యాస్ పైకి తన్నడం, ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, ఒక్కోసారి జీర్ణం కాని ఆహారం మెతుకులు గొంతులోకి రావడం వంటి సమస్యను ‘జీఈఆర్డీ’ (గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్)గా పేర్కొంటారు. ఇదే సమస్యతో పిల్లలకూ, పెద్దలకూ ఒకేలాంటి లక్షణాలు కనిపిస్తున్నా పిల్లలలో వైద్యచికిత్స విషయంలోనూ లేదా ఈ సమస్యను అధిగమించడానికి అనుసరించాల్సిన ప్రక్రియలోనూ తేడా ఉంటుంది. పిల్లలలో అజీర్తికి కారణాలు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు సరిగా తినడం లేదనీ, అవసరమైన మేరకు ఆహారం తీసుకోవడం లేదనే అపోహతో వారి పొట్ట సామర్థ్యానికి మించి ఆహారాన్ని బలవంతంగా కూరుతుంటారు. దాంతో వారి పొట్టలలో ఖాళీ స్థలమే లేకుండా పోతుంది. ఇది పిల్లల్లో అజీర్తికి ఒక కారణమవుతుంది. రాత్రి వేళల్లో పిల్లలు ఆడీ ఆడీ అలసిపోయి వచ్చాక అన్నం తినిపిస్తారు తల్లిదండ్రులు. అంతగా అలసిపోవడంతో పిల్లలు తిన్న వెంటనే పడుకోవడం వల్ల కూడా తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణం కాదు. దాంతో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ సమయానికి పిల్లలు తగినంత ఆహారం తీసుకోలేరు. ఫలితంగా పిల్లలు సరిగా అన్నం తినడం లేదంటూ మళ్లీ తల్లిదండ్రుల ఫిర్యాదులు మొదలైపోతాయి. ఎలాంటి ఆహారాన్నైనా జీర్ణం చేసుకోగల సామర్థ్యం సాధారణంగా పిల్లలకు ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకొని తల్లిదండ్రులు అవసరానికి మించిన కొవ్వుపదార్థాలు, తీపిపదార్థాల్ని వాళ్లకు పెట్టడం వల్ల అజీర్తి సమస్యతో పాటు, పిల్లల్లో స్థూలకాయానికీ ఇది కారణం కావచ్చు. ఇక కొన్నిసార్లు పిల్లలకు ఏదైనా చిరుతిండ్లుగానీ, జంక్‌ఫుడ్ గానీ పెట్టాక అసలు భోజనం పెడతారు. అప్పుడు కూడా పిల్లల్లో అజీర్తి సమస్య ఎదురయ్యే అవకాశాలుంటాయి. పిల్లల అజీర్తి సమస్యల లక్షణాలు పిల్లలలో అజీర్తి సమస్యలు ఎదురైనప్పుడు... పక్కమీదికి ఒరగగానే వారికి వాంతులు కావడంతో పాటు మరికొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి. అవి... బరువు తగ్గడం అన్నం తినడానికి గట్టిగా నిరాకరిస్తూ ఉండటం ఆహారం తిన్న తర్వాత తీవ్రంగా దగ్గు రావడం గొంతుల నుంచి పిల్లికూతలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లల్లో కాస్తంత భిన్నంగా కనిపించే ఈ అజీర్తి లక్షణాలను గుర్తించినప్పుడు వారికి కొన్ని పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. పిల్లలకు చికిత్స పద్ధతులు... సాధారణంగా పిల్లల్లో అజీర్తి సమస్యను గమనించినప్పుడు కొందరు డాక్టర్లు వారికి సంప్రదాయ చికిత్స ప్రక్రియ అయిన ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ (పీపీఐ) మందులను రాస్తూ ఉంటారు. పెద్దలకూ, పిల్లలకూ ఒకేలా చికిత్స చేస్తుంటారు. కానీ పిల్లలకు సంప్రదాయ చికిత్సకు బదులుగా వారికి అవసరమైన చికిత్స చేయాల్సి ఉంటుందని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రీషియన్స్ పేర్కొంటోంది. పిల్లల విషయంలో పెద్ద పెద్ద చికిత్సలకు బదులు చిన్న చిన్న సూచనల ద్వారానే సమస్యలను దూరం చేయవచ్చని తెలియజేస్తోంది. ఆ జాగ్రత్తలివే... కాస్తంత పెద్ద పిల్లల విషయానికి వస్తే... వారు కెఫీన్ పాళ్లు ఎక్కువగా ఉండే చాక్లెట్లు, కూల్‌డ్రింక్స్ వంటి పదార్థాలను ఎక్కువగా తీసుకోకుండా చూడాలి.మసాలాలతో కూడిన ఆహారాలను ఎక్కువగా తీసుకోకుండా చూడాలి. పిల్లలు అధిక మోతాదులో చక్కెర తినకుండా చూడాలి. దానిలో భాగంగా వాళ్లకు ఏదో ఒకటి నములుతూ ఉండే అలవాటు ఉంటే... చక్కెర లేని చ్యూయింగ్ గమ్ నమిలేలా జాగ్రత్త తీసుకోవాలి. పిల్లలకు అనేక రకాల పోషకాలు అందేలా చూడాలి. కాయగూరలు, ఆకుకూరలనే రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉండేలా అనేక రూపాల్లో (వేర్వేరు రెసిపీలుగా) వండి తినిపిస్తూ ఉండాలి. ఒకేరకమైన ఆహారం తినడాన్ని పిల్లలు అంతగా ఇష్టపడరు కాబట్టి... పోషకాలు పుష్కలంగా ఉండే అవే పదార్థాలను వేర్వేరు రీతుల్లో వండటం వల్ల పిల్లలు ఆసక్తికరంగా తింటారు. వాళ్లకు ఆరోగ్యమూ సమకూరుతుంది. అంతేగానీ పిల్లలకు పెద్దల రీతిలో పీపీఐ మందులు వాడటం, వాటితోనూ గుణం కనిపించకపోతే పెద్దలకోసం వాడే ప్రక్రియలను ఉపయోగించడం సరికాదు.పిల్లలకు ఒక పట్టాన ఆహారం జీర్ణం కాని పరిస్థితులు అదే పనిగా చాలా కాలం కొనసాగితే తప్పనిసరిగా డాక్టర్‌కు చూపించాలి. పిల్లలకు అందుబాటులో చాక్లెట్లు, క్యాండీలు, జంక్‌ఫుడ్స్‌కు బదులుగా బాదంపప్పు, వాల్నట్స్ వంటి పోషకాహారాలు అందేలా ఉంచండి{ఫిజ్‌లో కోలా డ్రింక్స్, కూల్‌డ్రింక్స్ వంటి వాటికి బదులు మజ్జిగ, మిల్క్ షేక్స్ వంటి ఆరోగ్యకరమైన ద్రవాహారాలను పిల్లలకు అందుబాటులో ఉంచండి. డాక్టర్ సేతుబాబు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ - హెపటాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
జీర్ణం... జీర్ణం... వాతాపి జీర్ణం!
‘తింటే ఆయానం - తినకుంటే నీరసం’ అనే సరదా మాట అందరం వినేదే. ‘పొట్ట రాయిలా ఉంది, ఛాతీ మీద ఏదో బరువు పెట్టినట్టుంది’ అనే మాట కొందరు అనేదే వీటన్నింటికీ కారణం... అజీర్తి. తిన్నది జీర్ణం కాకపోవడం అనే సమస్య చూడటానికి చాలా చిన్నగా అనిపించినా తీవ్రంగా బాధిస్తుంది. కడుపులో ఏదో బరువును మోస్తున్న ఫీలింగ్‌ను కలిగిస్తుంది. ‘అజీర్తి సమస్యపై అవగాహన కల్పించి, దాని లక్షణాలూ, ఆ సమస్యకు కారణాలూ, దానికి పరిష్కారాలను సూచించడం కోసమే ఈ కథనం. అజీర్తిని నిర్వచించడానికి ప్రత్యేకంగా లక్షణాలంటూ ఉండవు. ఇది ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపిస్తుండవచ్చు. కొందరిలో ఇది కడుపులో ఇబ్బంది(అబ్డామినల్ డిస్కంఫర్ట్)తో వ్యక్తమవుతుంది. మరికొందరిలో ఛాతీలో నొప్పితో దడ పుట్టిస్తుంది. సాధారణంగా అవి అజీర్తికి చెందినవే అని గుర్తించడానికి ఒక సూచన కూడా ఉంది. దాదాపు అజీర్తికి చెందిన లక్షణాలన్నీ తిన్నవెంటనే కనిపిస్తుంటాయి. చాలామందిలో తమ జీవితకాలంలోని ఏదో ఒక దశలో ఈ అజీర్తి సమస్యను అనుభవిస్తారు. కానీ కొందరిలో ఇది నిత్యం ఉంటుంది. అజీర్తికి కారణాలు: మన నోటి నుంచి అన్నకోశం వరకు ఉన్న పైప్‌ను ఈసోఫేగస్ అంటారు. ఈ ఈసోఫేగస్తో పాటు అన్నకోశంలోని లోపలి పొరలు చాలా సున్నితంగా కండర నిర్మితమైన గోడలతో ఉంటాయి. వీటిలోంచి మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి అవసరమైన స్రావాలు (డెజైస్టివ్ జ్యూసెస్) వెలువడుతుంటాయి. ఈ స్రావాలు యాసిడ్ (ఆమ్ల) గుణాలను కలిగి ఉంటాయి. అవి పొట్టలో ఊరి మనం తిన్న ఆహారంపై పని చేసి, దాన్ని మరింత చిన్నవైన అంశాలుగా మార్చివేస్తాయి. మనం తిన్నవి ఎంత సూక్ష్మమైన అంశాలుగా విడిపోతాయంటే మనం తాగిన నీళ్లతో కలిసి... మన పేగులు పీల్చుకునేందుకు వీలుగా ద్రవరూపంలోకి మారేంతగా అవి మారిపోతాయి. ఈ ప్రక్రియనే జీర్ణప్రక్రియ అని/అరగడం అని మనం వ్యవహరిస్తుంటాం. ఏదైనా కారణాల వల్ల మన అన్నకోశంలో పగుళ్లూ, చీలికలూ ఏర్పడితే మన కడుపులో స్రవించే యాసిడ్ ఆ గాయాలను మరింతగా నొప్పి, వాపు, మంట (ఇన్ఫ్లమేషన్) కలిగేలా చేస్తుంది. కడుపులోని లోపలి పొరకు గాయాలవ్వడానికి కారణాలు కొవ్వుతో జారుడుగా ఉండేవి లేదా మసాలాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం. అతిగా ఆల్కహాల్ తాగడం పొగతాగే అలవాటు కొన్ని రకాలైన మందులు (ఉదాహరణకు ఆస్పిరిన్, నొప్పినివారణ మందులు (నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు). మనలోని తీవ్రమైన ఒత్తిడి, యాంగ్జైటీ వంటి అంశాలు కూడా జీర్ణప్రక్రియపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. కొంతమంది గర్భంతో ఉన్నప్పుడు జీర్ణసమస్యలు ఎదురవుతాయి స్థూలకాయుల్లో అజీర్ణ సమస్య ఉంటే అది జీవితాన్ని మరింత దుర్భరం చేస్తుంది. వారి కడుపులో స్రవించే యాసిడ్ పైకి అంటే ఈసోఫేగస్‌లోకి తన్నేలా చేస్తుంది. అందుకే కొందరిలో ఆమ్ల గుణమైన పులుపు రుచి నోట్లో తెలుస్తుంది. అందుకే చాలామంది పుల్లతేన్పులనే మాటను తమ వాడుక భాషలో పులితేన్పులుగా వాడుతుంటారు. లక్షణాలు: అజీర్తితో బాధపడేవారిలో తరచూ కనిపించే లక్షణం ఛాతీలో నొప్పి. దీని వల్ల కొందరు తమకు గుండెపోటు వచ్చిందేమో అని అపోహపడి మరింత ఆందోళనకు గురయ్యే సందర్భాలూ ఉన్నాయి. మనం తిన్న ఆహారాన్ని అన్నకోశం (కడుపు-స్టమక్)లోకి తీసుకెళ్లే పైప్ ఛాతీలోనుంచి వెళ్తుంది. చాలామందిలో కడుపు పూర్తిగా నిండిపోగానే పొట్టకు పైభాగాన, ఛాతీలో నొప్పి వస్తుంటుంది. ఈ నొప్పి కొన్ని సందర్భాల్లో చాలా తక్కువ (మైల్డ్) నుంచి చాలా తీవ్రంగా (సివియర్‌గా) ఉండవచ్చు. ఒక్కోసారి కొంత కొంత వ్యవధి తర్వాత మళ్లీ మళ్లీ రావచ్చు. డాక్టర్‌ను కలవాల్సిందెప్పుడు? చాలామంది ఈ అజీర్తి సమస్యను తమకు తామే పరిష్కరించుకుం టుంటారు. ఇలా అనిపించగానే యాంటాసిడ్ మాత్ర తీసుకుంటుంటారు. దాంతో అది తగ్గిపోతుంది. మళ్లీ ఎప్పటికోగానీ కనిపించదు. అయితే ఈ అజీర్తి సమస్య రెండువారాలకు పైగా తగ్గకుండా అదేపనిగా కనిపిస్తూ ఉంటే మాత్రం తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే. ఇక మరికొందరిలో అజీర్తి తీవ్రతను కొన్ని లక్షణాలు బలంగా వ్యక్తీకరిస్తాయి. ఉదాహరణకు... జిగురుగా ఉండి, మలం నల్లరంగులో విసర్జితమైనప్పుడు అది అసాధారణమైన వాసనతో ఉన్నప్పుడు మింగడంలో ఇబ్బంది ఏర్పడినప్పుడు వాంతి అయి... అందులో రక్తపు ఆనవాళ్లు కనిపించినప్పుడు ఎలాంటి కారణాలు లేకుండా బరువు తగ్గుతున్నప్పుడు యాభైఐదేళ్లు దాటినవారిలో నిత్యం అజీర్తి సమస్య కనిపిస్తున్నప్పుడు డాక్టర్‌ను తప్పక కలవాలి. నివారణ, పరిష్కారం: కొన్ని సాధారణ ప్రక్రియలతో, మామూలు లోకజ్ఞానంతోనే మన అజీర్తి సమస్యను మనమే నివారించుకోవచ్చు. ఆహారాన్ని త్వర త్వరగా తినవద్దు. మెల్లమెల్లగా ఎక్కువసేపు నములుతూ తినండి. రాత్రి భోజనం నిద్రపోవడానికి కనీసం రెండు గంటల ముందుగా చేయండి. మీ శరీరపు పైభాగాన్ని కాస్త ఎత్తుగా ఉండేలా చూడండి. దీనికోసం తలగడను ఉపయోగించుకోవచ్చు. అలాగే మీ రెండు కాళ్లను కూడా తలగడను పెట్టుకుని అవి మీ శరీరం కంటే కాస్త ఎత్తున ఉండేలా చూసుకోండి. దీనివల్ల కడుపులో స్రవించిన గ్యాస్ట్రిక్ యాసిడ్ స్రావాలు ఈసోఫేగస్‌లోకి ప్రవేశించ డాన్ని నివారించవచ్చు. పొగతాగే అలవాటు ఉంటే తక్షణం మానేయండి ఆల్కహాల్ తీసుకునే అలవాటును మానేయండి స్థూలకాయం ఉన్నవారు తమ బరువును తగ్గించుకోవాలి దైనందిన జీవితంలో ఒత్తిడిని వీలైనంతగా నివారించుకోండి అజీర్తి సమస్యను తగ్గించుకోడానికి మెడికల్ షాపుల్లో ఉండే యాంటాసిడ్ మాత్రలు వాడవచ్చు. కానీ అవి వాడుతున్నా... రెండు వారాలకు మించి అజీర్తి తగ్గకుంటే మాత్రం డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్ నవీన్ పోలవరపు కన్సల్టెంట్ మెడికల్ గాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ హెపటాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్ -
సీఎం కార్మికుల పనివేళలు మార్చాలి
గోదావరిఖని(కరీంనగర్) : ఆర్జీ-1 ఏరియా పరిధి జీడీకే-11 గనిలో కంటిన్యూయస్ మైనర్(సీఎం) యంత్రంపై పనిచేస్తున్న కార్మికులను రెండో షిఫ్టు సమయం మార్పు చేయాలని గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు కోరారు. ఈమేరకు గనిమేనేజర్ రవీందర్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఆరు సంవత్సరాల నుంచి కంటిన్యూయస్ మైనర్ సెక్షన్లో రెండో షిఫ్టు రాత్రి 12 గంటల వరకు విధులను నిర్వహించాల్సి వస్తోందని, దీంతో కార్మికులు అజీర్తి, అల్సర్, నిద్రపట్టకపోవడం లాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తోందని పేర్కొన్నారు. అంతేకాకుండా తరుచూ ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. కంపెనీలో పనిచేసే ప్రతీ కార్మికుడు ఆరోగ్యంగా ఉండాలని ఓవైపు యాజమాన్యం కోరుకుంటూనే మరోవైపు అందుకు విరుద్ధంగా పని చేయిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అమలుచేస్తున్న సాయంత్రం 4 నుంచి రాత్రి 12 గంటల వరకు రెండో షిఫ్టును రద్దు చేసి పాతపద్ధతిలో సాయంత్రం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు పనివేళలు మార్చాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో హెచ్ఎంఎస్ ఉపాధ్యక్షుడు జంగ కనుకయ్య, గని ఫిట్ సెక్రటరీ మోదుల సంపత్, టీబీజీకేఎస్ ఆర్జీ-1 వైస్ ప్రెసిడెంట్ ఆరెళ్లి పోషం, ఫిట్ సెక్రటరీ గుమ్మడి లింగయ్య, నాయకులు ఎం.పద్మారావు, ఆరె శ్రీనివాస్, రేండ్ల రవీందర్, ఆరెపల్లి రాజమౌళి, పి.శ్రీనివాస్, జి.పెంటయ్య, యు.బుచ్చయ్య, రాజేశ్వర్‌రావు, ఒ.చంద్రయ్య, పి.రమేశ్, ఎం.వెంకటస్వామి పాల్గొన్నారు.