జీర్ణం... జీర్ణం... వాతాపి జీర్ణం! | digest digest digest | Sakshi
Sakshi News home page

జీర్ణం... జీర్ణం... వాతాపి జీర్ణం!

Published Sat, May 9 2015 2:47 AM | Last Updated on Sun, Sep 3 2017 1:40 AM

జీర్ణం... జీర్ణం... వాతాపి జీర్ణం!

జీర్ణం... జీర్ణం... వాతాపి జీర్ణం!

‘తింటే ఆయానం - తినకుంటే నీరసం’ అనే సరదా మాట అందరం వినేదే. ‘పొట్ట రాయిలా ఉంది, ఛాతీ మీద ఏదో బరువు పెట్టినట్టుంది’ అనే మాట కొందరు అనేదే వీటన్నింటికీ కారణం... అజీర్తి. తిన్నది జీర్ణం కాకపోవడం అనే సమస్య చూడటానికి చాలా చిన్నగా అనిపించినా తీవ్రంగా బాధిస్తుంది. కడుపులో ఏదో బరువును మోస్తున్న ఫీలింగ్‌ను కలిగిస్తుంది. ‘అజీర్తి సమస్యపై అవగాహన కల్పించి, దాని లక్షణాలూ, ఆ సమస్యకు కారణాలూ, దానికి పరిష్కారాలను సూచించడం కోసమే ఈ కథనం.
 
అజీర్తిని నిర్వచించడానికి ప్రత్యేకంగా లక్షణాలంటూ ఉండవు. ఇది ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపిస్తుండవచ్చు. కొందరిలో ఇది కడుపులో ఇబ్బంది(అబ్డామినల్ డిస్‌కంఫర్ట్)తో వ్యక్తమవుతుంది. మరికొందరిలో ఛాతీలో నొప్పితో దడ పుట్టిస్తుంది. సాధారణంగా అవి అజీర్తికి చెందినవే అని గుర్తించడానికి ఒక సూచన కూడా ఉంది. దాదాపు అజీర్తికి చెందిన లక్షణాలన్నీ తిన్నవెంటనే కనిపిస్తుంటాయి. చాలామందిలో తమ జీవితకాలంలోని ఏదో ఒక దశలో ఈ అజీర్తి సమస్యను అనుభవిస్తారు. కానీ కొందరిలో ఇది నిత్యం ఉంటుంది.
 అజీర్తికి కారణాలు: మన నోటి నుంచి అన్నకోశం వరకు ఉన్న పైప్‌ను ఈసోఫేగస్ అంటారు. ఈ ఈసోఫేగస్‌తో పాటు అన్నకోశంలోని లోపలి పొరలు చాలా సున్నితంగా కండర నిర్మితమైన గోడలతో ఉంటాయి. వీటిలోంచి మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి అవసరమైన స్రావాలు (డెజైస్టివ్ జ్యూసెస్) వెలువడుతుంటాయి.

ఈ స్రావాలు యాసిడ్ (ఆమ్ల) గుణాలను కలిగి ఉంటాయి. అవి పొట్టలో ఊరి మనం తిన్న ఆహారంపై పని చేసి, దాన్ని మరింత చిన్నవైన అంశాలుగా మార్చివేస్తాయి. మనం తిన్నవి ఎంత సూక్ష్మమైన అంశాలుగా విడిపోతాయంటే మనం తాగిన నీళ్లతో కలిసి... మన పేగులు పీల్చుకునేందుకు వీలుగా ద్రవరూపంలోకి మారేంతగా అవి మారిపోతాయి. ఈ ప్రక్రియనే జీర్ణప్రక్రియ అని/అరగడం అని మనం వ్యవహరిస్తుంటాం. ఏదైనా కారణాల వల్ల మన అన్నకోశంలో పగుళ్లూ, చీలికలూ ఏర్పడితే మన కడుపులో స్రవించే యాసిడ్ ఆ గాయాలను మరింతగా నొప్పి, వాపు, మంట (ఇన్‌ఫ్లమేషన్) కలిగేలా చేస్తుంది.
 
కడుపులోని లోపలి పొరకు గాయాలవ్వడానికి కారణాలు


 కొవ్వుతో జారుడుగా ఉండేవి లేదా మసాలాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం.  అతిగా ఆల్కహాల్ తాగడం  పొగతాగే అలవాటు  కొన్ని రకాలైన మందులు (ఉదాహరణకు ఆస్పిరిన్, నొప్పినివారణ మందులు (నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులు).  మనలోని తీవ్రమైన ఒత్తిడి, యాంగ్జైటీ వంటి అంశాలు కూడా జీర్ణప్రక్రియపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి.  కొంతమంది గర్భంతో ఉన్నప్పుడు జీర్ణసమస్యలు ఎదురవుతాయి  స్థూలకాయుల్లో అజీర్ణ సమస్య ఉంటే అది జీవితాన్ని మరింత దుర్భరం చేస్తుంది. వారి కడుపులో స్రవించే యాసిడ్ పైకి అంటే ఈసోఫేగస్‌లోకి తన్నేలా చేస్తుంది. అందుకే కొందరిలో ఆమ్ల గుణమైన పులుపు రుచి నోట్లో తెలుస్తుంది. అందుకే చాలామంది పుల్లతేన్పులనే మాటను తమ వాడుక భాషలో పులితేన్పులుగా వాడుతుంటారు.

లక్షణాలు: అజీర్తితో బాధపడేవారిలో తరచూ కనిపించే లక్షణం ఛాతీలో నొప్పి. దీని వల్ల కొందరు తమకు గుండెపోటు వచ్చిందేమో అని అపోహపడి మరింత ఆందోళనకు గురయ్యే సందర్భాలూ ఉన్నాయి. మనం తిన్న ఆహారాన్ని అన్నకోశం (కడుపు-స్టమక్)లోకి తీసుకెళ్లే పైప్ ఛాతీలోనుంచి వెళ్తుంది. చాలామందిలో కడుపు పూర్తిగా నిండిపోగానే పొట్టకు పైభాగాన, ఛాతీలో నొప్పి వస్తుంటుంది. ఈ నొప్పి కొన్ని సందర్భాల్లో చాలా తక్కువ (మైల్డ్) నుంచి చాలా తీవ్రంగా (సివియర్‌గా) ఉండవచ్చు. ఒక్కోసారి కొంత కొంత వ్యవధి తర్వాత మళ్లీ మళ్లీ రావచ్చు.

డాక్టర్‌ను కలవాల్సిందెప్పుడు? చాలామంది ఈ అజీర్తి సమస్యను తమకు తామే పరిష్కరించుకుం టుంటారు. ఇలా అనిపించగానే యాంటాసిడ్ మాత్ర తీసుకుంటుంటారు. దాంతో అది తగ్గిపోతుంది. మళ్లీ ఎప్పటికోగానీ కనిపించదు. అయితే ఈ అజీర్తి సమస్య రెండువారాలకు పైగా తగ్గకుండా అదేపనిగా కనిపిస్తూ ఉంటే మాత్రం తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.

ఇక మరికొందరిలో అజీర్తి తీవ్రతను కొన్ని లక్షణాలు బలంగా వ్యక్తీకరిస్తాయి. ఉదాహరణకు...  జిగురుగా ఉండి, మలం నల్లరంగులో విసర్జితమైనప్పుడు  అది అసాధారణమైన వాసనతో ఉన్నప్పుడు  మింగడంలో ఇబ్బంది ఏర్పడినప్పుడు  వాంతి అయి... అందులో రక్తపు ఆనవాళ్లు కనిపించినప్పుడు  ఎలాంటి కారణాలు లేకుండా బరువు తగ్గుతున్నప్పుడు యాభైఐదేళ్లు దాటినవారిలో నిత్యం అజీర్తి సమస్య కనిపిస్తున్నప్పుడు డాక్టర్‌ను తప్పక కలవాలి.

నివారణ, పరిష్కారం: కొన్ని సాధారణ ప్రక్రియలతో, మామూలు లోకజ్ఞానంతోనే మన అజీర్తి సమస్యను మనమే నివారించుకోవచ్చు.
  ఆహారాన్ని త్వర త్వరగా తినవద్దు. మెల్లమెల్లగా ఎక్కువసేపు నములుతూ తినండి.  రాత్రి భోజనం నిద్రపోవడానికి కనీసం రెండు గంటల ముందుగా చేయండి.  మీ శరీరపు పైభాగాన్ని కాస్త ఎత్తుగా ఉండేలా చూడండి. దీనికోసం తలగడను ఉపయోగించుకోవచ్చు. అలాగే మీ రెండు కాళ్లను కూడా తలగడను పెట్టుకుని అవి మీ శరీరం కంటే కాస్త ఎత్తున ఉండేలా చూసుకోండి. దీనివల్ల కడుపులో స్రవించిన గ్యాస్ట్రిక్ యాసిడ్ స్రావాలు ఈసోఫేగస్‌లోకి ప్రవేశించ డాన్ని నివారించవచ్చు.  పొగతాగే అలవాటు ఉంటే తక్షణం మానేయండి ఆల్కహాల్ తీసుకునే అలవాటును మానేయండి  స్థూలకాయం ఉన్నవారు తమ బరువును తగ్గించుకోవాలి దైనందిన జీవితంలో ఒత్తిడిని వీలైనంతగా నివారించుకోండి  అజీర్తి సమస్యను తగ్గించుకోడానికి మెడికల్ షాపుల్లో ఉండే యాంటాసిడ్ మాత్రలు వాడవచ్చు. కానీ అవి వాడుతున్నా... రెండు వారాలకు మించి అజీర్తి తగ్గకుంటే మాత్రం డాక్టర్‌ను సంప్రదించాలి.     
 
 
డాక్టర్ నవీన్ పోలవరపు
కన్సల్టెంట్ మెడికల్ గాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ హెపటాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement