అందుకే ప్రచారానికి వెళ్లడం లేదు: కేసీఆర్
హైదరాబాద్: జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఈ-క్యాంపెయిన్ ద్వారా ప్రచారం చేయనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అభ్యర్థులు కొత్తవారేమీ కాదని, బాగా ఆలోచించి ఓటు వేయాలని జంట నగరాల ప్రజలకు పిలుపునిచ్చారు. సరైన అభ్యర్థికి ఓటు వేస్తే అభివృద్ధి ఫలాలు అందుతాయని అన్నారు. గురువారం మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
'గ్రేటర్ ఎన్నికల్లో నేను ప్రచారం చేస్తే ట్రాఫిక్ అంతరాయం కలిగి ప్రజలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఈ ప్రచారానికి నేను దూరంగా ఉండి, ఈ-క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టాను. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, మజ్లిస్, బీజేపీ పార్టీలు రంగంలో ఉన్నాయి. వీళ్లలో ఎవరూ కొత్తవారు కారు. ప్రజలు ఓటు వేసేముందు ఆలోచించి ఓటు వేయాలి. పండ్లచెట్టు పెడితే పండ్లు, ముళ్ల చెట్టు పెడితే ముళ్లు వస్తాయి. ఏ చెట్టు పెట్టాలో ఆలోచించి పెడితేనే అభివృద్ధి, ఫలితాలు వస్తాయి.
జంటనగరాల్లో ఉండే మేథావులు, విజ్ఞులు ఏ పార్టీని గెలిపిస్తే మంచిదో ఆలోచించి మరీ ఓటేయాలని కోరుతున్నాను. ఒకవైపు కోడెదూడ, మరోవైపు దున్నపోతు ఉంటే బండి సక్రమంగా వెళ్లదు. జీహెచ్ఎంసీ దాదాపు 40 ఏళ్లపాటు కాంగ్రెస్, 15 ఏళ్ల పాటు టీడీపీ అధీనంలో ఉంది. మధ్యలో కొన్నాళ్ల పాటు మజ్లిస్ పాలనలో ఉంది. పాలన ఎలా జరిగిందో ఏంటో అందరికీ తెలుసు. విద్యుత్తు విషయంలో 35 ఏళ్లు గోసపోయాం. ఈ రెండు పార్టీల పాలన సమయంలో కన్వర్టర్లు, జనరేటర్లు, ఇన్వర్టర్లు చూశాం. కానీ ఇప్పుడు అవి అమ్మే షాపులు కూడా మూతపడ్డాయి. కొన్నవాళ్లు కూడా స్థలం దండగయ్యిందని భావిస్తున్నారు. తెలంగాణ అంధకారంలో మునిగిపోతుందని అందరూ అన్నారు. కానీ ఐదారు నెలల్లోనే అద్భుతమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం. జంటనగరాల్లో రెప్పపాటు కూడా సరఫరాకు అంతరాయం ఉండటం లేదు. ఈ పార్టీలు రాష్ట్రంలో అధికారంలో ఉన్నా, జీహెచ్ఎంసీలో అధికారంలో ఉన్నా.. ఏంజరిగిందో గుర్తుంచుకోవాలి.
పరిశుభ్రమైన మంచినీరు ఎంతమందికి అందుతోంది.. దానికి ఎవరు బాధ్యులు? మూసీ మురికికూపంగా మారింది. హుస్సేన్‌సాగర్ కాలుష్య కాసారంగా మారడానికి బాధ్యులెవరో ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు పోటీలో ఉన్నవాళ్లు ఎవరూ స్వర్గం లోంచో, ఆకాశం నుంచో దిగి రాలేదు. వాళ్ల హయాంలో జరిగిన భూకబ్జాలు, నాలాల కబ్జాలు అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్లీ అవే పార్టీలు వచ్చి తాము ఏదో చేస్తామని చెబుతున్నారు. ఒక ఎన్నికల్లో ఓటు వేయదలచుకున్నప్పుడు నాయకులు, పార్టీల నిబద్ధతను పరిగణనలోకి తీసుకోవాలి' అని కేసీఆర్ అన్నారు.
రాష్ట్రంలో ఉండే ప్రతి ఇంటికీ నల్లా ఇచ్చి, కృష్ణా గోదావరి నుంచి మంచి నీళ్లు అందిస్తాం. ఇక మీరు నీళ్లు కొనుక్కోవాల్సిన అవసరం ఉండదని, అలా అందించకపోతే.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓట్లు అడగదని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో అనేక విషయాలు ఉండాల్సిన స్థాయిలో లేవని మండిపడ్డారు. స్వచ్ఛ హైదరాబాద్ తీసుకుంటే.. గవర్నర్, సీఎం, సీఎస్ సహా అందరు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు కలిసి వారం రోజుల పాటు గల్లీగల్లీ శుభ్రం చేసిన విషయం మీరంతా చూశారని గుర్తుచేశారు. పౌరసేవలు అందడం మీ తీర్పు మీదనే ఆధారపడి ఉందని విజ్ఞప్తి చేశారు. గతంలో హైదరాబాద్‌లో ప్రాంతాలన్నీ పూలతోటల్లా ఉండేవని, అనేక బ్రహ్మాండమైన చెరువులు, కొలనులు ఉండేవని, ఇవన్నీ ఎవరి హయాంలో మాయమయ్యాయో ప్రజలు ఓటు వేసేముందు గమనించాలని తెలిపారు.
కోటికి పైగా జనాభా ఉండే జంట నగరాల్లో జీహెచ్ఎంసీ నిర్వహించే కూరగాయలు, మాంసాహార మార్కెట్లు కేవలం ఏడు మాత్రమే ఉన్నాయని.. కనీసం 200 మార్కెట్లు ఏర్పాటు చేయడానికి తాము చర్యలు తీసుకున్నామని అన్నారు. కనీసం 400-500 పబ్లిక్ టాయిలెట్లు ఉండాల్సి రాగా, ఇప్పుడున్నవి కేవలం 150-200 మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు. అవి కూడా చాలావరకు ఉపయోగం లేవన్నారు. వెంటనే 250 టాయిలెట్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. శ్మశాన వాటికలు, దహనవాటికలు లేవని ప్రజలు బాధలు వ్యక్తం చేస్తున్నారని, ఆ ఏర్పాట్లు కూడా చేయాలని మున్సిపల్ శాఖకు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలిచ్చామని అన్నారు. డంపింగ్ యార్డులు కూడా సక్రమంగా లేవని, ఇప్పుడు కొత్త డంపింగ్ యార్డుల ఏర్పాటుకు స్థలాలు గుర్తించామని అన్నారు.
ఆస్పత్రులకు వచ్చే పేషెంట్ల అటెండెంట్ల కోసం నైట్ షెల్టర్లు కట్టిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాళ్లు కడుతున్నామన్నారు. 3,800 సిటీ బస్సులు తిరుగుతున్నాయని, వీటికోసం బస్ బేలు కూడా ఉండాల్సిన పద్ధతిలో లేవని తెలిపారు. అధునాతన బస్‌బేలు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన అన్నారు. మిషన్ కాకతీయ కింద 169 చెరువులను జంటనగరాల పరిధిలో బాగు చేయిస్తామని చెప్పారు. ఎంజీబీఎస్, జూబ్లీ బస్ స్టేషన్లు కాకుండా మరో నాలుగు బస్ స్టేషన్లు కట్టిస్తామని.. అలాగే రెండు కొత్త రైల్వే టెర్మినళ్లను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉందని సీఎం తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయంలో రెండో రన్‌వేను కూడా జీఎంఆర్ సంస్థ ఏర్పాటు చేస్తుందని అన్నారు. భారతదేశంలో ఏ నగరానికీ లేని హంగులు హైదరాబాద్‌కు ఉన్నాయని, మాస్టర్ ప్లాన్ ప్రకారం శాస్త్రీయ పద్ధతిలో భవిష్యత్ హైదరాబాద్‌ను రూపొందిస్తామని చెప్పారు.