e-commerce platform
-
దేశీ ఎల్రక్టానిక్ కంపెనీలకు మెరుగైన రేటింగ్స్
న్యూఢిల్లీ: బ్రాండ్ల ఆమోదయోగ్యతకు సంబంధించి గ్లోబల్ కంపెనీలకు దీటుగా దేశీ ఎల్రక్టానిక్స్ కంపెనీలు ఉంటున్నాయి. లావా, క్యూబో వంటి సంస్థలకు మెరుగైన రేటింగ్స్ లభిస్తున్నాయి. మార్కెట్ అనాలిసిస్ సంస్థ టెక్ఆర్క్ డిసెంబరులో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ–కామర్స్ ప్లాట్‌ఫాంలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో 35 ఉత్పత్తుల కేటగిరీలవ్యాప్తంగా 25 బ్రాండ్లపై దీన్ని నిర్వహించారు. ‘రియల్మీ, రెడ్మీ వంటి గ్లోబల్ బ్రాండ్స్‌కి ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో 4.3 రేటింగ్ ఉన్నట్లు మా విశ్లేషణలో వెల్లడైంది. వాటితో పోలిస్తే పరిశ్రమ ప్రమాణాలకు దాదాపు సమానస్థాయిలో లావా మొదలైన సంస్థలకు 4.2 రేటింగ్ ఉంది‘ అని నివేదిక పేర్కొంది. లావాకు 90.2 శాతం మంది అత్యధిక రేటింగ్స్ (4, 5 స్థాయిలో) ఇవ్వగా, గ్లోబల్ బ్రాండ్స్‌కి వచి్చన 4, 5 స్థాయి రేటింగ్స్ 75.8 శాతమే ఉన్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కేటగిరీలో హీరో గ్రూప్ సంస్థ క్యూబో ఏకంగా పరిశ్రమ సగటు 4 రేటింగ్స్‌ను కూడా దాటేసి 4.1 రేటింగ్స్ దక్కించుకుంది. అయితే, అంతర్జాతీయ సంస్థలకు అత్యధిక స్థాయిలో 4, 5 రేటింగ్స్ ఉన్నాయి. వేరబుల్ కేటగిరీల్లో మాత్రం రియల్మీ, రెడ్మీ, ఒప్పో, వన్‌ప్లస్ నార్డ్ వంటి అంతర్జాతీయ బ్రాండ్స్‌తో పోలిస్తే భారతీయ బ్రాండ్స్‌కి పరిశ్రమ బెంచ్‌మార్క్ కన్నా తక్కువ రేటింగ్స్ ఉన్నాయి. పరిశ్రమ బెంచ్‌మార్క్ రేటింగ్స్ 4.2గా ఉండగా .. భారతీయ బ్రాండ్స్ అయిన నాయిస్, బోల్ట్ ఆడియోకి 4.1, ఆ తర్వాత బోట్..పీట్రాన్కు 4.0 రేటింగ్స్ లభించాయి. మివి, గిజ్మోర్, నంబర్‌కి సగటున 3.9 రేటింగ్ ఉంది. యాపిల్, శాంసంగ్‌ల టార్గెట్ యూజర్ల సెగ్మెంట్ భిన్నమైనది కావడంతో వాటిని ఈ అధ్యయనంలో పరిగణనలోకి తీసుకోలేదు. -
ఈ-కామర్స్ సంస్థలకు షాక్: ఫేక్ రివ్యూస్‌కు చెక్
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఉత్పత్తులు, సర్వీసులను కొనుగోలు చేసేలా వినియోగదారులను తప్పుదోవ పట్టించేటువంటి రివ్యూలను... ఈ-కామర్స్ సైట్లలో కట్టడి చేయడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అడ్వర్టైజింగ్ ప్రమాణాల మండలితో (ఏఎస్సీఐ) కలిసి ఈ-కామర్స్ కంపెనీలు, సంబంధిత వర్గాలతో వినియోగదారుల వ్యవహారాల శాఖ శుక్రవారం వర్చువల్ సమావేశం నిర్వహించనుంది. నకిలీ, తప్పుదోవ పట్టించే రివ్యూల ప్రభావాలు, అలాంటి వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఇందులో చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనాలంటూ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తదితర ఈ–కామర్స్ దిగ్గజాలతో పాటు వినియోగదారుల ఫోరమ్‌లు, లాయర్లు, ఫిక్కీ, సీఐఐ వంటి పరిశ్రమ వర్గాలకు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ లేఖలు రాశారు. యూరోపియన్ యూనియన్‌లో 223 బడా వెబ్సైట్లలో ఆన్లైన్ రివ్యూలపై జరిగిన సమీక్ష వివరాలను వాటిలో ప్రస్తావించారు. స్క్రీనింగ్ ఫలితాల ప్రకారం దాదాపు 55 శాతం వెబ్సైట్లు ఈయూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు తేలింది. దేశీయంగా ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగే కొద్దీ ఆన్లైన్ కొనుగోళ్లు కూడా పెరుగుతున్నాయని సింగ్ తెలిపారు. అయితే, ఈ-కామర్స్ సైట్లలో కనిపించే నకిలీ రివ్యూల వల్ల వినియోగదారులు పలు సందర్భాల్లో నష్టపోవాల్సి వస్తోందని సింగ్ వివరించారు. -
యూట్యూబ్ చేతికి సిమ్‌సిమ్ యాప్
న్యూఢిల్లీ: వీడియో షేరింగ్ వెబ్సైట్ యూట్యూబ్ తాజాగా భారత్‌కు చెందిన వీడియో ఈ–కామర్స్ ప్లాట్‌ఫాం సిమ్‌సిమ్ యాప్‌ను కొనుగోలు చేసింది. దేశీయంగా చిన్న వ్యాపార సంస్థలు, రిటైలర్లను కొత్త కస్టమర్లకు చేరువ చేసేందుకు ఈ డీల్ తోడ్పడగలదని యూట్యూబ్ మాతృసంస్థ గూగుల్ తెలిపింది. అయితే, ఇందుకోసం ఎంత వెచ్చిస్తున్నదీ మాత్రం వెల్లడించలేదు. మరికొన్ని వారాల్లో కొనుగోలు లావాదేవీ పూర్తి కాగలదని సంస్థ తెలిపింది. సిమ్‌సిమ్ యాప్‌లో ఎటువంటి మార్పులు ఉండవని, ఇకపైనా స్వతంత్రంగానే కార్యకలాపాలు కొనసాగిస్తుందని గూగుల్ పేర్కొంది. సిమ్‌సిమ్ ఆఫర్లను యూట్యూబ్ వీక్షకులకు ఏ విధంగా చూపవచ్చన్న దానిపై కసరత్తు చేస్తున్నామని తెలిపింది. స్థానిక వ్యాపార సంస్థలు, ప్రభావితం చేసేవారు, కస్టమర్లను సిమ్‌సిమ్ అనుసంధానిస్తుంది. స్థానిక వ్యాపార సంస్థల ఉత్పత్తుల గురించి క్రియేటర్లు ..ఇందులో వీడియో రివ్యూలు ఉంచుతారు. వీక్షకులు ఆయా ఉత్పత్తులను నేరుగా యాప్ నుంచే కొనుగోలు చేయవచ్చు. ఇందులోని వీడియోలు ప్రస్తుతం హిందీ, తమిళం, బెంగాలీ భాషల్లో ఉంటున్నాయి. యూజర్లు ఆన్లైన్లో సులభతరంగా కొనుగోళ్లు చేసేందుకు, విక్రేతలు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు సిమ్సిమ్ను ప్రారంభించినట్లు సంస్థ సహ వ్యవస్థాపకులు అమిత్ బగారియా, కునాల్ సూరి, సౌరభ్ వశిష్ట ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. -
ఇక ఆ వెబ్సైట్లోనూ పెట్రోల్ దొరుకుతుంది
ఇక త్వరలోనే ప్రతి పెట్రోలియం ఉత్పత్తులు ఈ-కామర్స్ వెబ్సైట్లలోనూ లభ్యం కానున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి అనుమతులు లభించాయని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. తాను ఈ ఆలోచనను తెరపైకి తీసుకొచ్చినప్పుడు అందరూ తనని అనుమానస్పదంగా చూశారని, కానీ ప్రస్తుతం ఇది అమల్లోకి రాబోతున్నట్టు చెప్పారు. న్యూఢిల్లీలో నేటి నుంచి ప్రారంభమైన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ ఆలోచనను ఏప్రిల్ 21నే శ్రీనగర్‌లో జరిగిన పార్లమెంట్ సభ్యుల సంప్రదింపుల సంఘంలో ప్రధాన్ మొదటిసారి తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలను పెంచడానికి ఇంధనాన్ని హోమ్ డెలివరీ కూడా చేయాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ చూస్తోంది. హోమ్ డెలివరీతో బంకుల వద్ద భారీ ఎత్తున్న క్యూలను నిర్మూలించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. రెండు నెలల్లో డీజిల్‌ను ఇంటి వద్దకే డెలివరీ చేయడాన్ని లాంచ్ చేస్తామని గత నెలలో ఆయిల్ మార్కెటింగ్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చెప్పింది. ప్రస్తుతం పెట్రోలియం, ఎక్స్‌ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నుంచి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆమోదం పొందాల్సి ఉంది. రోజువారీ దేశవ్యాప్తంగా లక్ష రిటైల్ అవుట్లెట్లకు 40 మిలియన్ వినియోగదారులు వస్తున్నారు. -
లక్ష మార్క్ దాటేసిన అమెజాన్
ముంబై : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో తన ప్లాట్ ఫామ్ పై లక్ష అమ్మకందారుల మైలురాయిని చేధించింది. యేటికేటికి 250 శాతం అమ్మకందారుల వృద్ధిని నమోదుచేసుకుంటూ.. వ్యాపారాల్లో దూసుకెళ్తోంది. అమెజాన్ భారత్ లో అడుగుపెట్టిన మూడేళ్లలో వివిధ వ్యాపార అవసరాలను తీర్చేందుకు అమ్మకందారుల తరుఫున పనిచేస్తూ.. ఆన్ లైన్ లో తమ బిజినెస్ లు పెంచుకునేందుకు సహకరిస్తోందని అమెజాన్ ఇండియా జనరల్ మేనేజర్, సెల్లర్ సర్వీసుల డైరెక్టర్ గోపాల్ పిల్లై పేర్కొన్నారు. దీంతో తమ ప్లాట్ ఫామ్ పై ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో లక్ష అమ్మకందారులకు పైగా కలిగి ఉన్నామని ఆయన వెల్లడించారు. 2013 జూన్ లో అమెజాన్ భారత్ లో ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ లోకి ప్రవేశించింది. విస్తృతమైన విద్య, నైపుణ్యమైన ప్రోగ్రామ్ లు చేపట్టడం, అమ్మకందారుల తరుఫున ఉత్పత్తులకు అమెజాన్.ఇన్ ప్యాకింగ్, షిప్స్, డెలివరీ నిర్వహించడం, రిటర్న్ లను నిర్వహించడం, ఇతర సర్వీసులను అమెజాన్ అందిస్తోంది. ఒక్క భారత్ లోనే కాక, ప్రపంచవ్యాప్తంగా.. అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ప్రోగ్రామ్ ద్వారా 3040 లక్షల యాక్టివ్ కస్టమర్లను అమెజాన్ కలిగి ఉన్నట్టు పిల్లై తెలిపారు. గ్లోబల్ సెల్లింగ్ ప్రోగ్రామ్ కింద 8వేల అమ్మకందారులు ప్రపంచవ్యాప్తంగా ఉండే దుకాణదారులకు, తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్టు పేర్కొన్నారు. అమెజాన్ తన ప్లాట్ ఫామ్ అమ్మకందారులకు రూ.5లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు సెక్యూర్డ్, అన్ సెక్యూర్డ్ రుణాలను అందిస్తోంది. -
ఈ నెల 27 నుంచి టాటా ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్
ముంబై: టాటా గ్రూప్‌కు చెందిన టాటా యునిస్టోర్ తన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్, టాటా క్లిక్‌ను ఈ నెల 27న ప్రారంభిస్తోంది. వెబ్సైట్, మొబైల్ యాప్‌ల ద్వారా టాటా క్లిక్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని టాటా యునిస్టోర్ తెలిపింది. ఈ ప్లాట్‌ఫామ్ ప్రారంభోత్సవం సందర్భంగా దుస్తులు, ఎలక్ట్రానిక్స్, పాదరక్షల కేటగిరిల్లో వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్లనిస్తున్నామని పేర్కొంది. రానున్న నెలల్లో మరిన్ని కేటగిరీలకు, బ్రాండ్లకు విస్తరిస్తామని వివరించింది. గత కొన్నేళ్లుగా భారత్‌లో ఈ కామర్స్ జోరుగా పెరుగుతోంది.