E market
-
ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ నుంచి రూ.60 కోట్ల జెండాలు
న్యూఢిల్లీ: గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్ (జెమ్) ద్వారా జూలై 1 నుంచి ఆగస్ట్ 15 మధ్య 2.36 కోట్ల జెండాలను వివిధ ప్రభుత్వ విభాగాలు, రాష్ట్రాలు కొనుగోలు చేశాయి. వీటి విలువ రూ.60 కోట్లు. ప్రభుత్వ సంస్థలు 4,159 మంది విక్రేతల నుంచి ఈ జెండాలను అందుకున్నాయి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈ స్థాయిలో కొనుగోళ్లు జరిగాయి. ప్రభుత్వ సంస్థల కోసం పారదర్శక ప్రొక్యూర్మెంట్ వ్యవస్థ ఉండాలన్న లక్ష్యంతో జెమ్ వేదికను 2016 ఆగస్ట్ 9న కేంద్ర వాణిజ్య శాఖ ప్రారంభించింది. కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్త, స్థానిక సంస్థలు తమకు కావాల్సిన ఉత్పత్తులను జెమ్ ద్వారా పొందవచ్చు. -
ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్‌పై 300కి పైగా సహకార సంఘాలు!
న్యూఢిల్లీ: ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మార్కెట్‌ప్లేస్ (ఆన్లైన్ క్రయ, విక్రయ వేదిక/ఈ కామర్స్) ‘జెమ్’ పోర్టల్‌లో 300 వరకు కోఆపరేటివ్ సొసైటీలు (సహకార సంఘాలు) నమోదైనట్టు కేంద్ర హోంశాఖ, సహకార శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. జెమ్ పోర్టల్‌లో సంస్థల నమోదు ప్రక్రియను మంత్రి వర్చువల్‌గా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. అమూల్, ఇఫ్కో, క్రిబ్కో, నాఫెడ్, సారస్వత్ కోఆపరేటివ్ బ్యాంకు తదితర సంస్థలు కొనుగోలుదారులుగా జెమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నాయని చెబుతూ.. విక్రేతలుగానూ నమోదు చేసుకోవాలని మంత్రి సూచించారు. కోఆపరేటివ్ సొసైటీలు సైతం జెమ్ ద్వారా తమకు కావాల్సిన వస్తు, సేవలను కొనుగోలు చేసుకునేందుకు కేంద్ర కేబినెట్ ఈ ఏడాది జూన్‌లో అనుమతించింది. అంతకుముందు ఈ అవకాశం లేదు. తొలిదశలో రూ.100 కోట్ల టర్నోవర్/డిపాజిట్లు ఉన్న సొసైటీలను అనుమతించారు. దీంతో 589 సంస్థలకు అర్హత ఉందని గుర్తించగా, 300కు పైన ఇప్పటివరకు నమోదు చేసుకున్నాయి. మంత్రి ప్రారంభంతో.. మొదటి రోజే సుమారు రూ.25 కోట్ల విలువైన ఆర్డర్లు నమోదైనట్టు అంచనా. దేశవ్యాప్తంగా 8.5 లక్షల సహకార సంఘాలు ఉంటే, వీటి పరిధిలో 29 కోట్ల మంది భాగస్వాములుగా ఉన్నారు. జెమ్‌పై కోఆపరేటివ్‌ల నమోదు అర్హతలను మరింత సరళీకరించనున్నట్టు మంత్రి అమిత్‌షా తెలిపారు. కాగా, సహకార సంఘాల్లో సంస్కరణలు అవసరమని మంత్రి అమిత్‌షా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. -
స్టార్టప్‌లకు ఇదొక ‘జెమ్’
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించి ఏర్పాటు చేసిన ‘ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ ‘జీఈఎం/జెమ్’లో చోటు కోసం వినియోగ సేవల ఆధారిత ఇంటర్నెట్ స్టార్టప్‌లు రెంటోమోజో, అర్బన్‌క్లాప్ తదితర సంస్థలు ఇప్పుడు క్యూ కడుతున్నాయి. తమ సేవలు, ఉత్పత్తులను మరిన్ని వర్గాలకు చేరువ చేసేందుకు జెమ్ తమకు ఉపయోగపడుతుందన్నది వాటి భావన. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలను జెమ్ ద్వారా చేరుకునేందుకు అవకాశం ఉండడం వీటిని ఆకర్షిస్తోంది. అందుకే జెమ్‌లో చోటు కోసం ఈ కంపెనీలు ఇప్పటికే పలు మార్లు చర్చలు కూడా జరిపాయి. ఇవి ఫలిస్తే ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలను తమ క్లయింట్ల జాబితాలోకి చేర్చుకునే అవకాశం వీటికి లభించనుంది. అన్నింటికీ ఒకటే... జెమ్‌ను రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర ప్రభుత్వ స్వతంత్ర యంత్రాంగాలు తమకు కావాల్సిన సరుకులు, సేవలను కొనుగోలు చేసుకునేందుకు ఏకీకృత మార్కెట్ ప్లేస్‌గా జెమ్‌ను తీసుకొచ్చింది. అన్ని రకాల సేవలకు ఒకే ఉమ్మడి వేదికగా జెమ్ నిలుస్తుంది. ‘‘ఓ ప్రైవేటు కంపెనీగా జెమ్‌తో కలసి పనిచేయాలనుకుంటున్నాం. ఇది సాధ్యమైతే స్వల్ప కాలంలో పెద్ద విజయాన్నే సాధించొచ్చు’’ అని అర్బన్ క్లాప్ సీఈవో అభిరాజ్‌సింగ్ బాల్ పేర్కొనడం గమనార్హం. ఇప్పటికే జెమ్ అధికారులతో పలు సార్లు చర్చలు జరిపిన బాల్... అర్బన్ క్లాప్ తన సేవలను జెమ్‌పై లిస్ట్ చేసే ప్రక్రియలో ఉన్నట్టు చెప్పారు. పూర్వపు ఎన్డీఏ ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిగా ఉన్న సురేష్ ప్రభు గత డిసెంబర్లో జెమ్ ద్వారా ప్రభుత్వ మార్కెట్‌ను చేరుకునేందుకు ప్రైవేటు కంపెనీలను ఆహ్వానించడం కీలక మలుపుగా చెప్పుకోవాలి. ‘‘జెమ్‌ద్వారా ఉన్న భారీ అవకాశాల పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. అయితే, ఇంకా అన్వేషణ దశలోనే ఉన్నాం. ఇరు పార్టీలకు గొప్ప విలువ చేకూరే అవకాశాలున్నాయి’’ అని ఆన్లైన్ వేదికగా ఫర్నిచర్‌ను అద్దెకిచ్చే సంస్థ రెంటోమోజో సీఈవో గీతాన్షు బమానియా తెలిపారు. తమ కస్టమర్ల సంఖ్యను మరింత విస్తృతం చేసుకోవాలన్న ప్రయత్నాల్లో ఉన్న కన్జ్యూమర్ ఇంటర్నెట్ కంపెనీలు ఇప్పుడు జెమ్ వైపు ఆశగా చూస్తున్నాయి. ప్రభుత్వానికి ఆదా... ప్రభుత్వ కొనుగోళ్లలో సమర్థతను తీసుకురావడం, కొనుగోలు వ్యయాలను తగ్గించడం వంటి లక్ష్యాలతో ఎన్నో సంపద్రింపుల తర్వాత జెమ్‌ను కేంద్రం ప్రవేశపెట్టగా, అనుకున్న ఫలితాలను ఇస్తోందని నాటి సంప్రదింపుల్లో పాలు పంచుకున్న ఓ పరిశ్రమ నిపుణుడు చెప్పడం గమనార్హం. ముఖ్యంగా ప్రభుత్వ వ్యయాలను తగ్గించడంలో భాగంగా ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాలను కొనుగోలు చేయడానికి బదులుగా వాటిని రెంటోమోజో వంటి సంస్థల నుంచి అద్దెకు తీసుకోవాలన్నది ఆలోచన. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వస్తువులు, సేవలను స్థిర రేటు విధానంలో ‘డైరెక్టర్ జనరల్ ఫర్ సప్లయ్స్ అండ్ డిస్పోజల్ (డీజీఎస్‌అండ్‌డీ) ద్వారా కొనుగోలు చేసేవి. దీన్ని 2017లో మూసేశారు. -
’ప్రాంతీయ’ స్టార్టప్స్‌పై గురి
బెంగళూరు: వెంచర్ క్యాపిటల్ సంస్థలు తాజాగా ప్రాంతీయ భాషల్లో ఈ–కామర్స్ సేవలందించే స్టార్టప్స్‌పై ఆసక్తి చూపుతున్నాయి. కొత్తగా ఈ–కామర్స్ మార్కెట్‌కు పరిచయం కాబోయే 10 కోట్ల ఇంటర్నెట్ యూజర్స్‌కి ముందుగా చేరువయ్యే సత్తా గల సంస్థలపై ఇవి దృష్టి సారిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి బడా ఆన్లైన్ పోర్టల్స్‌లో షాపింగ్ చేయాలంటే బెరుగ్గా ఉండే కొత్త కస్టమర్లు.. ఈ తరహా ప్రాంతీయ పోర్టల్స్వైపు మళ్లుతుండటమే ఇందుకు కారణం. బుల్బుల్, సిమ్‌సిమ్, డబ్ల్యూమాల్, మాల్91, డీల్‌షేర్ వంటి సంస్థలు ఈ కోవకి చెందినవే. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనే కాకుండా ప్రథమ శ్రేణి నగరాల్లో ఉండే వ్యాపారులు, గృహిణులు, ఇతరత్రా కొనుగోలుదారుల్లో చాలా మందికి ఇంగ్లీష్ మాధ్యమంలో ఉండే పోర్టల్స్ ద్వారా ఆర్డర్ చేయాలంటే.. కష్టంగా ఉంటోందని సిమ్ సిమ్ సహ వ్యవస్థాపకుడు అమిత్ బగారియా పేర్కొన్నారు. దీంతో వారు ఆఫ్‌లైన్ స్టోర్స్ లేదా షాపింగ్ మాల్స్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో అటువంటి వారిని ఆన్లైన్ వైపు మళ్లించడానికి ప్రాంతీయ భాషల్లో పోర్టల్స్ ఉపయోగపడగలవని బగారియా పేర్కొన్నారు. ప్రోత్సాహకాలతో ఆకట్టుకునే ప్రయత్నాలు.. నయా ఈ–కామర్స్ సంస్థలు వివిధ రకాల ప్రోత్సాహకాలతో కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందుకోసం యూజర్ల సోషల్ షాపింగ్ ధోరణులపై ఆధారపడుతున్నాయి. ఉదాహరణకు జైపూర్‌కి చెందిన డీల్‌షేర్ సంస్థ విషయం తీసుకుంటే.. యూజరు తనకి వచ్చిన ఆఫర్‌ను స్నేహితులు, కుటుంబ సభ్యులు మొదలైన వారికి షేర్ చేసిన దాన్ని బట్టి, సదరు డీల్ విక్రయాలను బట్టి ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఎంత ఎక్కువ మందిని కొనుగోలు చేసేలా ప్రోత్సహించగలిగితే.. అంత ఎక్కువగా రివార్డ్ పాయింట్లు దక్కించుకోవచ్చు. అలాగే డబ్ల్యూమాల్ అయితే.. తమ కస్టమర్స్‌కు ప్రతి రోజూ డీల్స్‌ను వాట్సాప్ ద్వారా పంపిస్తుంది. వీటిని వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియా సైట్స్‌లో ప్రమోట్ చేయడాన్ని బట్టి రివార్డ్ పాయింట్లు ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా వంటి పెద్ద పోర్టల్స్‌లో ఉండే ఎక్స్‌క్లూజివ్ స్మార్ట్‌ఫోన్స్, భారీ ఉపకరణాలు, ఇతరత్రా బ్రాండెడ్ ఉత్పత్తులు కాకుండా.. ఈ కొత్త తరహా ఈకామర్స్ సంస్థలు అన్‌బ్రాండెడ్ ఫ్యాషన్, గృహోపకరణాలు, సౌందర్య సాధనాలు మొదలైన ఉత్పత్తులకు సంబంధించిన డీల్స్ ఆఫర్ చేస్తున్నాయి. నిధుల సమీకరణ.. వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్ల ఆసక్తి కనపరుస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతీయ ఈ–కామర్స్ సంస్థలు జోరుగా నిధుల సమీకరణ కొనసాగిస్తున్నాయి. న్యూయార్క్‌కు చెందిన హెడ్జ్ ఫండ్ ఫాల్కన్ ఎడ్జ్, మ్యాట్రిక్స్ పార్ట్నర్స్ ఇండియా నుంచి డీల్‌షేర్ 2–3 మిలియన్ డాలర్ల సమీకరణ కోసం చర్చలు జరుపుతోంది. ఇక సైఫ్ పార్ట్నర్స్ నుంచి డబ్ల్యూమాల్ సుమారు 1–2 మిలియన్ డాలర్లు దక్కించుకునే అవకాశం ఉంది. అటు వీడియో ఆధారిత కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన బుల్బుల్కి సెకోయా క్యాపిటల్ దన్నుగా ఉంటోంది. ఇక, మాల్91 సంస్థ కూడా బీనెక్ట్స్ నుంచి సుమారు రూ. 5–7 కోట్లు సమీకరిస్తున్నట్లు సమాచారం. ఈ స్టార్టప్ సంస్థలన్నీ కూడా ఇంకా తమ ఉత్పత్తులను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తూ బీటా స్టేజ్‌లోనే ఉన్నప్పటికీ.. ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తుండటం గమనార్హం. 2018 ఆఖరు నాటికి భారత్‌లో 46.2 కోట్ల ఇంటర్నెట్ యూజర్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో తరచూ లావాదేవీలు జరిపే 8 కోట్ల మంది పైగా యూజర్లపై దిగ్గజ ఇంటర్నెట్ కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో నయా ప్రాంతీయ భాషల ఈ–కామర్స్ సంస్థల రాకతో మరింత మంది యూజర్లు ఆన్లైన్ షాపింగ్ వైపు మళ్లే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
ఆన్లైన్ కొనుగోళ్లకు ప్రత్యేక సంస్థ
కేంద్ర కేబినెట్ ఆమోదం న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలు వస్తువులు, సేవలు కొనుగోలు చేయడానికి వేదికగా పనిచేస్తున్న ‘గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్’ (జీఈఎం) పోర్టల్‌ను నిర్వహించడానికి ఎలాంటి లాభాపేక్ష లేని ప్రత్యేక సంస్థ(ఎస్పీవీ)ని ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయించింది. బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు, పీఎస్‌యూలు, స్వతంత్ర ప్రతిపత్తి గల కంపెనీలు, స్థానిక సంస్థలు తమకు అవసరమైన వస్తువులు, సేవలను ఆన్లైన్లో పూర్తి పారదర్శకంగా సేకరించడానికి జీఈఎం ఎస్పీవీ తోడ్పడుతుంది. అలాగే ప్రస్తుతం వాణిజ్య శాఖ పరిధిలో నడుస్తున్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ సప్లైస్ అండ్ డిస్పోజల్ని అక్టోబర్ 31 నాటికి రద్దుచేయాలని కూడా నిర్ణయించింది. కేబినెట్ ఇతర నిర్ణయాలు ► 11 కేంద్ర ప్రభుత్వ సంస్థలను స్టాక్ మార్కెట్లలో నమోదుచేయడానికి ఆమోదం లభించిం ది. వీటిలో రైల్వే శాఖ అధీనంలోని 5 సంస్థలు కూడా ఉన్నాయి. ► పామాయిల్ సాగు ఆర్థిక సాయానికి ఉన్న గరిష్ట భూ పరిమితి నిబంధనను కేంద్రం సడలించింది. రైతులు, కార్పొరేట్లను ఈ రంగంలోకి ఆకర్షించి దేశీయంగా పామాయిల్ దిగుబడి పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 25 హెక్టార్లకు పైగా పామాయిల్ సాగుచేసే వారికీ రాయితీలు, ఆర్థిక సాయం అందుతాయి. -
నిమ్మ రైతులకు శుభవార్త
త్వరలో పొదలకూరు యార్డులో ఈ – మార్కెట్ ఏర్పాటు దేశ మార్కెట్‌ను అనుసరించి ధరల ప్రదర్శన నిమ్మ రైతులు నష్టపోకుండా కేంద్రం చర్యలు పొదలకూరు: స్థానిక ప్రభుత్వ నిమ్మ మార్కెట్ యార్డులో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులకు ప్రయోజనం చేకూర్చే ఈ–మార్కెట్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు యార్డులో బయ్యర్లు, సేల్స్ అనే రెండు విధాల్లో వ్యాపారం నిర్వహిస్తున్నారు. బయ్యర్లకు రైతులు నేరుగా కాయలను తోలితే వారు ఢిల్లీ మార్కెట్‌ను అనుసరించి ధరలను అందజేస్తుంటారు. అలాగే సేల్స్ వ్యాపారులు రైతుల పంపించే కాయలను వేలంపాట ద్వారా బయ్యర్లకు అమ్ముతుంటారు. ఇందుగాను రైతుల నుంచి కమిషన్ వసూలు చేస్తారు. ఈ వ్యవహారం రైతు, వ్యాపారుల మధ్య ఉన్న సత్సంబంధాలు, నమ్మకంపై జరిగిపోతుంది. కాయలను మార్కెట్‌కు తోలే రైతులు దుకాణానికి రాకుండానే వ్యాపారులు ధరలను నిర్ణయిస్తుంటారు. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రభుత్వ మార్కెట్లలో రైతులకు మెరుగైన సేవలను అందించడంతో పాటు ధరల విషయంలో నష్టపోకుండా చూసేందుకు ఈ–మార్కెటింగ్‌ను తీసుకువచ్చింది. దేశంలోని 21 మార్కెట్ యార్డ్‌లలో ఈ–మార్కెటింగ్ విధానాన్ని పైలెట్ ప్రాజెక్ట్ కింద అమలు చేసింది. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో రాష్ట్రాలతో సంప్రదించి దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా రెండో విడతగా దేశంలోని 200 మార్కెట్ యార్డ్‌లలో ఈ–మార్కెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 12 ప్రాంతాల్లో ఈ–మార్కెట్ సౌకర్యాన్ని ప్రవేశపెడుతుండగా అందులో పొదలకూరు నిమ్మమార్కెట్ యార్డు ఉండడం విశేషం. ఇందుకోసం యార్డును అసిస్టెంట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అడ్వైయిజర్(కేంద్ర ప్రభుత్వ అధికారి) ఎం జవహర్ పరిశీలించారు. సెప్టంబరు చివరి నాటికి యార్డులో ఈ–ట్రేడింగ్ ద్వారా నిమ్మకాయలను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మార్కెటింగ్‌శాఖ అధికారులు తెలిపారు. ఈ–మార్కెట్ సౌకర్యాలు ఈ–మార్కెట్ విధానంలో రైతు తన మొబైల్ నుంచే కాయల ధరలను పరిశీలించేందుకు వీలుకలుగుతుంది. దేశ మార్కెట్‌ను అనుసరించి యార్డ్‌లో నిత్యం ధరలను ప్రదర్శిస్తారు. యార్డుకు వచ్చే కాయల వివరాలను ముందుగా వ్యాపారులు ఆన్లైన్లో ఉంచడం జరుగుతుంది. ఆ తర్వాత కాయల ధరలను నిర్ణయిస్తారు. బయటి మార్కెట్, స్థానిక మార్కెట్ ధరలను తెలుసుకునేందుకు వీలుకలుగుతుంది. వ్యాపారులు నిర్ణయించిన ధరలతో పనిలేకుండా ఆన్లైన్లో ధరలను చూసుకుని రైతులు తమ కాయలకు ధర నిర్ణయించుకోవచ్చు. ఈ–మార్కెట్ ప్రయోజనం: ఎం.శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ కార్యదర్శి ఈ–మార్కెట్‌తో రైతులకు ప్రయోజనం. పొదలకూరు యార్డులోని రైతుల విశ్రాంతి గదిలో రూ.30లక్షలతో ఈ–మార్కెట్‌ను ఏర్పాటు చేయనున్నారు. రైతుల విశ్రాంతి గదులను ఈ–మార్కెట్ పైన నిర్మిస్తాం. -
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రైతుల ఆందోళన
వరంగల్: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు ముందు పత్తి రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. ఈ-మార్కెట్ విధానం వల్ల పత్తి ధర తగ్గుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈ-మార్కెట్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు మూకుమ్మడిగా కార్యాలయం ముట్టడించి కార్యాలయంలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు.