స్టార్టప్‌లకు ఇదొక ‘జెమ్‌’ | Gemm was formed by the central government two years ago | Sakshi
Sakshi News home page

స్టార్టప్‌లకు ఇదొక ‘జెమ్‌’

Published Wed, May 29 2019 4:33 AM | Last Updated on Wed, May 29 2019 4:41 AM

Gemm was formed by the central government two years ago - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించి ఏర్పాటు చేసిన ‘ప్రభుత్వ ఈ మార్కెట్‌ ప్లేస్‌ ‘జీఈఎం/జెమ్‌’లో చోటు కోసం వినియోగ సేవల ఆధారిత ఇంటర్నెట్‌ స్టార్టప్‌లు రెంటోమోజో, అర్బన్‌క్లాప్‌ తదితర సంస్థలు ఇప్పుడు క్యూ కడుతున్నాయి. తమ సేవలు, ఉత్పత్తులను మరిన్ని వర్గాలకు చేరువ చేసేందుకు జెమ్‌ తమకు ఉపయోగపడుతుందన్నది వాటి భావన. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలను జెమ్‌ ద్వారా చేరుకునేందుకు అవకాశం ఉండడం వీటిని ఆకర్షిస్తోంది. అందుకే జెమ్‌లో చోటు కోసం ఈ కంపెనీలు ఇప్పటికే పలు మార్లు చర్చలు కూడా జరిపాయి. ఇవి ఫలిస్తే ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలను తమ క్లయింట్ల జాబితాలోకి చేర్చుకునే అవకాశం వీటికి లభించనుంది.

అన్నింటికీ ఒకటే...  
జెమ్‌ను రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర ప్రభుత్వ స్వతంత్ర యంత్రాంగాలు తమకు కావాల్సిన సరుకులు, సేవలను కొనుగోలు చేసుకునేందుకు ఏకీకృత మార్కెట్‌ ప్లేస్‌గా జెమ్‌ను తీసుకొచ్చింది. అన్ని రకాల సేవలకు ఒకే ఉమ్మడి వేదికగా జెమ్‌ నిలుస్తుంది. ‘‘ఓ ప్రైవేటు కంపెనీగా జెమ్‌తో కలసి పనిచేయాలనుకుంటున్నాం. ఇది సాధ్యమైతే స్వల్ప కాలంలో పెద్ద విజయాన్నే సాధించొచ్చు’’ అని అర్బన్‌ క్లాప్‌ సీఈవో అభిరాజ్‌సింగ్‌ బాల్‌ పేర్కొనడం గమనార్హం. ఇప్పటికే జెమ్‌ అధికారులతో పలు సార్లు చర్చలు జరిపిన బాల్‌... అర్బన్‌ క్లాప్‌ తన సేవలను జెమ్‌పై లిస్ట్‌ చేసే ప్రక్రియలో ఉన్నట్టు చెప్పారు.

పూర్వపు ఎన్‌డీఏ ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిగా ఉన్న సురేష్‌ ప్రభు గత డిసెంబర్‌లో జెమ్‌ ద్వారా ప్రభుత్వ మార్కెట్‌ను చేరుకునేందుకు ప్రైవేటు కంపెనీలను ఆహ్వానించడం కీలక మలుపుగా చెప్పుకోవాలి. ‘‘జెమ్‌ద్వారా ఉన్న భారీ అవకాశాల పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. అయితే, ఇంకా అన్వేషణ దశలోనే ఉన్నాం. ఇరు పార్టీలకు గొప్ప విలువ చేకూరే అవకాశాలున్నాయి’’ అని ఆన్‌లైన్‌ వేదికగా ఫర్నిచర్‌ను అద్దెకిచ్చే సంస్థ రెంటోమోజో సీఈవో గీతాన్షు బమానియా తెలిపారు. తమ కస్టమర్ల సంఖ్యను మరింత విస్తృతం చేసుకోవాలన్న ప్రయత్నాల్లో ఉన్న కన్జ్యూమర్‌ ఇంటర్నెట్‌ కంపెనీలు ఇప్పుడు జెమ్‌ వైపు ఆశగా చూస్తున్నాయి.   

ప్రభుత్వానికి ఆదా...
ప్రభుత్వ కొనుగోళ్లలో సమర్థతను తీసుకురావడం, కొనుగోలు వ్యయాలను తగ్గించడం వంటి లక్ష్యాలతో ఎన్నో సంపద్రింపుల తర్వాత జెమ్‌ను కేంద్రం ప్రవేశపెట్టగా, అనుకున్న ఫలితాలను ఇస్తోందని నాటి సంప్రదింపుల్లో పాలు పంచుకున్న ఓ పరిశ్రమ నిపుణుడు చెప్పడం గమనార్హం. ముఖ్యంగా ప్రభుత్వ వ్యయాలను తగ్గించడంలో భాగంగా ఎలక్ట్రానిక్‌ వస్తువులు, వాహనాలను కొనుగోలు చేయడానికి బదులుగా వాటిని రెంటోమోజో వంటి సంస్థల నుంచి అద్దెకు తీసుకోవాలన్నది ఆలోచన. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వస్తువులు, సేవలను స్థిర రేటు విధానంలో ‘డైరెక్టర్‌ జనరల్‌ ఫర్‌ సప్లయ్స్‌ అండ్‌ డిస్పోజల్‌ (డీజీఎస్‌అండ్‌డీ) ద్వారా కొనుగోలు చేసేవి. దీన్ని 2017లో మూసేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement