బెంగళూరు: వెంచర్ క్యాపిటల్ సంస్థలు తాజాగా ప్రాంతీయ భాషల్లో ఈ–కామర్స్ సేవలందించే స్టార్టప్స్‌పై ఆసక్తి చూపుతున్నాయి. కొత్తగా ఈ–కామర్స్ మార్కెట్‌కు పరిచయం కాబోయే 10 కోట్ల ఇంటర్నెట్ యూజర్స్‌కి ముందుగా చేరువయ్యే సత్తా గల సంస్థలపై ఇవి దృష్టి సారిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి బడా ఆన్‌లైన్ పోర్టల్స్‌లో షాపింగ్ చేయాలంటే బెరుగ్గా ఉండే కొత్త కస్టమర్లు.. ఈ తరహా ప్రాంతీయ పోర్టల్స్‌వైపు మళ్లుతుండటమే ఇందుకు కారణం. బుల్‌బుల్, సిమ్‌సిమ్, డబ్ల్యూమాల్, మాల్91, డీల్‌షేర్ వంటి సంస్థలు ఈ కోవకి చెందినవే. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనే కాకుండా ప్రథమ శ్రేణి నగరాల్లో ఉండే వ్యాపారులు, గృహిణులు, ఇతరత్రా కొనుగోలుదారుల్లో చాలా మందికి ఇంగ్లీష్ మాధ్యమంలో ఉండే పోర్టల్స్ ద్వారా ఆర్డర్ చేయాలంటే.. కష్టంగా ఉంటోందని సిమ్ సిమ్ సహ వ్యవస్థాపకుడు అమిత్ బగారియా పేర్కొన్నారు. దీంతో వారు ఆఫ్‌లైన్ స్టోర్స్ లేదా షాపింగ్ మాల్స్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో అటువంటి వారిని ఆన్‌లైన్ వైపు మళ్లించడానికి ప్రాంతీయ భాషల్లో పోర్టల్స్ ఉపయోగపడగలవని బగారియా పేర్కొన్నారు.
ప్రోత్సాహకాలతో ఆకట్టుకునే ప్రయత్నాలు..
నయా ఈ–కామర్స్ సంస్థలు వివిధ రకాల ప్రోత్సాహకాలతో కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందుకోసం యూజర్ల సోషల్ షాపింగ్ ధోరణులపై ఆధారపడుతున్నాయి. ఉదాహరణకు జైపూర్‌కి చెందిన డీల్‌షేర్ సంస్థ విషయం తీసుకుంటే.. యూజరు తనకి వచ్చిన ఆఫర్‌ను స్నేహితులు, కుటుంబ సభ్యులు మొదలైన వారికి షేర్ చేసిన దాన్ని బట్టి, సదరు డీల్ విక్రయాలను బట్టి ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఎంత ఎక్కువ మందిని కొనుగోలు చేసేలా ప్రోత్సహించగలిగితే.. అంత ఎక్కువగా రివార్డ్ పాయింట్లు దక్కించుకోవచ్చు. అలాగే డబ్ల్యూమాల్ అయితే.. తమ కస్టమర్స్‌కు ప్రతి రోజూ డీల్స్‌ను వాట్సాప్ ద్వారా పంపిస్తుంది. వీటిని వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియా సైట్స్‌లో ప్రమోట్ చేయడాన్ని బట్టి రివార్డ్ పాయింట్లు ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా వంటి పెద్ద పోర్టల్స్‌లో ఉండే ఎక్స్‌క్లూజివ్ స్మార్ట్‌ఫోన్స్, భారీ ఉపకరణాలు, ఇతరత్రా బ్రాండెడ్ ఉత్పత్తులు కాకుండా.. ఈ కొత్త తరహా ఈకామర్స్ సంస్థలు అన్‌బ్రాండెడ్ ఫ్యాషన్, గృహోపకరణాలు, సౌందర్య సాధనాలు మొదలైన ఉత్పత్తులకు సంబంధించిన డీల్స్ ఆఫర్ చేస్తున్నాయి.
నిధుల సమీకరణ..
వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్ల ఆసక్తి కనపరుస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతీయ ఈ–కామర్స్ సంస్థలు జోరుగా నిధుల సమీకరణ కొనసాగిస్తున్నాయి. న్యూయార్క్‌కు చెందిన హెడ్జ్ ఫండ్ ఫాల్కన్ ఎడ్జ్, మ్యాట్రిక్స్ పార్ట్‌నర్స్ ఇండియా నుంచి డీల్‌షేర్ 2–3 మిలియన్ డాలర్ల సమీకరణ కోసం చర్చలు జరుపుతోంది. ఇక సైఫ్ పార్ట్‌నర్స్ నుంచి డబ్ల్యూమాల్ సుమారు 1–2 మిలియన్ డాలర్లు దక్కించుకునే అవకాశం ఉంది. అటు వీడియో ఆధారిత కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన బుల్‌బుల్‌కి సెకోయా క్యాపిటల్ దన్నుగా ఉంటోంది. ఇక, మాల్91 సంస్థ కూడా బీనెక్ట్స్ నుంచి సుమారు రూ. 5–7 కోట్లు సమీకరిస్తున్నట్లు సమాచారం. ఈ స్టార్టప్ సంస్థలన్నీ కూడా ఇంకా తమ ఉత్పత్తులను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తూ బీటా స్టేజ్‌లోనే ఉన్నప్పటికీ.. ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తుండటం గమనార్హం. 2018 ఆఖరు నాటికి భారత్‌లో 46.2 కోట్ల ఇంటర్నెట్ యూజర్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో తరచూ లావాదేవీలు జరిపే 8 కోట్ల మంది పైగా యూజర్లపై దిగ్గజ ఇంటర్నెట్ కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో నయా ప్రాంతీయ భాషల ఈ–కామర్స్ సంస్థల రాకతో మరింత మంది యూజర్లు ఆన్‌లైన్ షాపింగ్ వైపు మళ్లే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
’ప్రాంతీయ’ స్టార్టప్స్‌పై గురి
Published Wed, Mar 13 2019 12:03 AM | Last Updated on Wed, Mar 13 2019 12:03 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment