ఎన్‌ఎస్‌ఈఎల్‌పై కేసుల యోచన లేదు: ఐఐఎఫ్ఎల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్వెస్టర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (ఎన్ఎస్ఈఎల్)పై ఎటువంటి క్రిమినల్ కేసులు పెట్టే ఉద్దేశ్యం లేదని, కాని ఖాతాదారులకు రావాల్సిన బకాయిలను తొందరగా వచ్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు బ్రోకింగ్ సంస్థ ఇండియా ఇన్ఫోలైన్ ప్రకటించింది. క్రిమినల్ కేసులు పెట్టడం వలన సమస్య మరింత జటిలమై చెల్లింపులు ఆలస్యం అవుతాయన్న అభిప్రాయాన్ని ఐఐఎఫ్ఎల్ ప్రెసిడెంట్ ఇ.ప్రశాంత్ ప్రభాకరన్ వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌లో ఐఐఎఫ్ఎల్ ఎన్సీడీ ఇష్యూ వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం సందర్భంగా కలిసిన విలేకరులతో మాట్లాడారు. ఎన్ఎస్ఈఎల్ రూ.5,600 కోట్లు చెల్లింపుల చేయలేక చేతులు ఎత్తేయడంతో జూలై 31న ట్రేడింగ్‌ను సస్పెండ్ చేశారు.
ఇందులో ఐఐఎఫ్ఎల్కి చెందిన దాదాపు 1,400 మంది ఖాతాదారులకు రూ.325 కోట్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు కేవలం రూ.20 కోట్లు మాత్రమే చెల్లింపులు జరగ్గా ఇంకా రూ.305 కోట్లు రావాల్సి ఉందని అన్నారు.ఎన్సీడీపై 12 శాతం వడ్డీ: మూడవ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్సీడీ) ఇష్యూ ద్వారా రూ.1,050 కోట్లు సమీకరించనున్నట్లు ఐఐఎఫ్ఎల్ ప్రకటించింది. సెప్టెంబర్ 17న ప్రారంభమయ్యే ఈ ఇష్యూపై సంవత్సరానికి గరిష్టంగా 12 శాతం వార్షిక వడ్డీని కంపెనీ ఆఫర్ చేస్తోంది. స్పాట్ ఎక్స్ఛేంజీపై ప్రభుత్వానికి ఈడీ నివేదిక : కాగా ఆర్థిక చట్టాలను ఉల్లంఘనకు సంబంధించి నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్)పై రూపొందించిన నివేదిక(స్టేటస్ రిపోర్ట్)ను ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) ఆర్థిక శాఖకు అందజేసింది.