ఎంసెట్-2 కేసులో మరో ఇద్దరు అరెస్టు
- తాజా అరెస్టులతో 55కు చేరిన నిందితుల సంఖ్య
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2 కుంభకోణంలో మరో ఇద్దరు నిందితులను సీఐడీ అరెస్టు చేసింది. దీంతో నిందితుల సంఖ్య 55కు చేరింది. ఇప్పటి వరకు అరెస్టయిన వారిలో 14 రాష్ట్రాలకు చెందిన వారు ఉండటంతో సీఐడీ లోతుగా ఆరా తీస్తోంది. ప్రధాన సూత్రధారిగా గుర్తించిన పప్పుయాదవ్ కోసం సీఐడీ తీవ్రంగా గాలిస్తోంది. అతను ఢిల్లీ, యూపీ రాష్ట్రాలలో తలదాచుకున్నట్లు గుర్తించిన సీఐడీ... ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. శనివారం అరెస్టు చేసిన ఇద్దరు నిందితులు కూడా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలనే నిర్వహిస్తున్నారు.
ఇందులో విశాఖపట్నంకు చెందిన పెద్దాడ దామోదర్‌రావు అలియాస్ రామకృష్ణ హైదరాబాద్ సైనిక్‌పురిలో కన్సల్టెన్సీగా వ్యవహరిస్తున్నాడు. ఆదిలాబాద్‌కు చెందిన మరో నిందితుడు దీకొండ రమేశ్‌కుమార్ హిమాయత్‌నగర్‌లో ఉంటున్నాడు. వీరిద్దరూ కలసి 52 మంది విద్యార్థులను పుణేలోని శిక్షణ శిబిరానికి తరలించి తర్ఫీదు ఇచ్చారు. కాగా వీరు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన డబ్బులో రూ.64 లక్షలు రికవరీ చేసినట్లు సీఐడీ ఐజీ సౌమ్యామిశ్రా తెలిపారు.
కన్వీనర్ సీట్ల తర్వాతే యాజమాన్య సీట్ల భర్తీ
సాక్షి, హైదరాబాద్: మెడికల్ అడ్మిషన్లలో మొదట ప్రభుత్వ సీట్లు, కన్వీనర్ కోటా సీట్లు భర్తీ అయ్యాకే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని యాజమాన్య సీట్లను భర్తీ చేయాలని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శనివారం లేఖ రాశారు.