ఆరనీకుమా ఈ ‘దీపం’..
దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలకు కటకట
అర్ధాకలితో అర్చకులు
ఆరునెలలుగా అందని గౌరవభృతి
ఖమ్మం:సకల సంకల్పాలు నెరవేరాలని దేవుడి ఆశీస్సులను అందరికీ అందించే గ్రామీణ అర్చకుల పరిస్థితి దుర్భరంగా మారింది. ఆరునెలలుగా వారు గౌరవభృతి కోసం ఎదురుచూస్తున్నారు. అర్ధాకలితో అలమటిస్తూ ప్రభుత్వ కరుణ కటాక్షాల కోసం నిరీక్షిస్తున్నారు. జిల్లాలోని 135 సీ కేటగిరి దేవాలయాలకు దీపం పథకం కింద దీప ధూప నైవేద్యాలతోపాటు పూజలు నిర్వహించిన అర్చకులకు గౌరవభృతిగా నెలకు రూ.2,500 గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం అందిస్తోంది. తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని దేవాలయాలకు కేవలం ఒక్క నెల మాత్రమే ఈ గౌరవభృతిని అందజేశారు. విధానపరమైన నిర్ణయం తీసుకుని మరింత మెరుగైన గౌరవభృతి కల్పిస్తారని ఆశించిన అర్చకులకు ప్రభుత్వం నిరాశే మిగిల్చింది. ఆరు నెలలుగా జిల్లాలోని అర్చకులకు గౌరవభృతి అందని దయనీయ స్థితి నెలకొంది. సాధారణంగా ఎటువంటి ఆదాయం, స్థిరాస్తులు, మాన్యం భూములు లేని దేవాలయాలకే ఈ తరహా గౌరవభృతి అందిస్తారు. ప్రభుత్వం ఇచ్చే గౌరవభృతి, స్థానిక ప్రజల ఆదరణతోనే ఆయా గ్రామాల్లోని దేవాలయాల్లో దీప ధూప నైవేద్యాలు నడుస్తున్నాయి. సాధారణ రోజుల్లో ఈ మొత్తం ఆసరా అవుతుండగా.. ఏదైనా పండుగ పబ్బం, ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు అర్చకులు గ్రామపెద్దలను ఆశ్రయించాల్సి వస్తోంది.
ఇటు తమను తాము పోషించుకుంటూ దేవుడికి ధూప దీప నైవేద్యాలు పెట్టడానికి కొన్ని దేవాలయాల అర్చకులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ గౌరవభృతి కేవలం గ్రామీణప్రాంతాల్లో వెలిసిన దేవాలయాలు, కనీసం 25 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయాలకు మాత్రమే ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లాలో ఉన్న 135 దేవాలయాల్లో అనేక ఆలయాలు ఆర్థిక పరిపుష్టి లేక కొట్టుమిట్టాడుతున్నాయి. గ్రామంలో పెద్దల సహకారంతో అర్చకులు దేవుడికి నైవేద్యం పెడుతూ గుళ్లో దీపం కొండెక్కకుండా చూస్తున్నారు. గ్రామ పెద్దల ఆదరణతో ఒక పూట తిన్నామన్న భావన కల్పిస్తూ కాలం గడుపుతున్నారు. ఇంత దయనీయ పరిస్థితిలో ఉన్నా తమ గౌరవభృతి పెంచకపోగా, ఇప్పటికీ ప్రభుత్వం వేతనాలను మంజూరు చేయడంలేదని అర్చకులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉన్న ఈ తరహా దేవాలయాలకు దీప ధూప నైవేద్యాలు, అర్చకుల గౌరవభృతి ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినా అవి దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయికి చేరలేదు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.2,500ల్లో దేవునికి ఉదయం, సాయంత్రం దీపం, ప్రసాదం (పడిసరం) నివేదించడానికి రూ.1000, అర్చకుడికి రూ.1500 చొప్పున విభజిస్తూ గౌరవభృతి అందిస్తున్నారు. జిల్లాలోని 135 దేవాలయాల్లో నెలకు రూ.3,37,500 ఆయా ఆలయాల అర్చకుల బ్యాంకు ఖాతాలో జమ చేయాల్సి ఉంది. ఇవి గత జూన్ నుంచి అర్చకుల ఖాతాలోకి రాకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో అర్చకులకు గౌరవభృతి రూపంలో దాదాపు రూ.20 లక్షలు ప్రభుత్వం బకాయి పడినట్లయింది. ప్రజలందరి యోగక్షేమాలు ఆశించే తమను ప్రభుత్వం ఇప్పటికైనా కరుణించి వేతన బకాయిలను చెల్లించాలని అర్చకులు మొరపెట్టుకుంటున్నారు.