economic aid
-
పాక్‌కు సాయం ఆపండి
ఇస్లామాబాద్: అమెరికా అందిస్తున్న భారీ ఆర్థిక సాయాన్ని మానవ హక్కుల ఉల్లంఘనకు పాకిస్తాన్ వినియోగిస్తోందని యూఎస్ కాంగ్రెస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పాక్‌లో స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగి రాజ్యాంగబద్ధమైన రీతిలో ప్రభుత్వం ఏర్పాటయ్యేదాకా ఆ దేశానికి ఎలాంటి ఆర్థిక సాయమూ అందించొద్దని అధ్యక్షుడు జో బైడెన్‌కు విజ్ఞప్తి చేశారు. ఇలాన్ ఒమర్‌తో పాటు మరో 10 మంది కాంగ్రెస్ సభ్యులు ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి అంటోనీ బ్లింకెన్‌కు లేఖ రాశారు. దైవ దూషణ చట్టాన్ని మరింత కఠినతరం చేయడం తదితర చర్యలకు పాక్ పాల్పడుతున్న వైనాన్ని అందులో ప్రస్తావించారు. ‘‘ఇవన్నీ పాక్‌లోని మతపరమైన మైనారిటీలను మరింతగా అణచివేసేందుకు తీసుకుంటున్న చర్యలే. ఎందుకంటే దైవదూషణ బిల్లును పాక్ పార్లమెంటు ఆమోదించిన కొద్ది రోజులకే మతోన్మాద మూకలు చర్చిలను ధ్వంసం చేయడంతో పాటు క్రైస్తవుల ఇళ్లకు నిప్పు పెట్టాయి’’ అంటూ వారు ఆందోళన వెలిబుచ్చారు. -
ఉక్రెయిన్‌కు అమెరికా 375 కోట్ల డాలర్ల సాయం
వాషింగ్టన్: రష్యా దండయాత్రతో సతమతమవుతున్న ఉక్రెయిన్‌కు అమెరికా మరోసారి భారీ సాయం ప్రకటించింది. ఉక్రెయిన్‌కు 375 కోట్ల డాలర్ల మిలటరీ సాయాన్ని అందిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి టోని బ్లింకెన్ శుక్రవారం వెల్లడించారు. అమెరికా రక్షణ శాఖ నుంచి వెను వెంటనే 285 కోట్ల డాలర్ల మిలటరీ సాయం అందుతుందని చెప్పారు. విదేశాంగ శాఖ నుంచి అందే 22.5 కోట్ల డాలర్లు ఉక్రెయిన్ మిలటరీ ఆధునీకరణకు, దీర్ఘకాలంలో ఆ దేశం సాయుధ సంపత్తి పెంచుకోవడానికి కేటాయిస్తున్నామని చెప్పారు. ఈ సారి అందించే సాయంతో ఇప్పటివరకు అమెరికా ఉక్రెయిన్ చేసిన సాయం 2 వేల కోట్లకు పైగా డాలర్లకు చేరుకుంది. అమెరికా ఈ స్థాయిలో ఏ దేశానికి ఇప్పటివరకు సాయం అందించలేదు. ఉక్రెయిన్‌కు తొలిసారిగా 50 ఎం2–ఏ2 బ్రాడ్లీ సాయుధ వాహనాలను అందిస్తోంది. ఈ సాయుధ వాహనాల్లో పదాతిదళ బెటాలియన్‌కు పూర్తి స్థాయి రక్షణ కవచాలు , యాంటీ ట్యాంకు క్షిపణులు, 2,50,000 రౌండ్ల 25ఎంఎం మారణాయుధాలు ఉంటాయని పెంటగాన్ వెల్లడించింది. అంతేకాకుండా 100ఎం–113 సాయుధ సిబ్బందిని తీసుకువెళ్లే వాహనాలు, 50 మైన్–రెసిస్టెంట్స్, మెరుపుదాడుల్ని ఎదుర్కొనే వాహనాలు కూడా ఉంటాయని వివరించింది. -
వారి ఆవేదన ప్రభుత్వానికి పట్టదు!
న్యూఢిల్లీ: వలస కూలీల వెతలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మండిపడ్డారు. వలస కూలీల ఆర్తనాదాలు దేశంలోని అందరికీ వినిపిస్తున్నా.. ప్రభుత్వానికి మాత్రం వినిపించడం లేదని విమర్శించారు. లాక్‌డౌన్‌తో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నవారికి తక్షణమే ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రతీ కుటుంబానికి రూ. 7500 చొప్పున రానున్న ఆరు నెలల పాటు అందించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ‘స్పీక్ అప్ ఇండియా’ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించింది. అందులో భాగంగా ఒక వీడియో సందేశాన్ని సోనియా పార్టీ సోషల్ మీడియా వేదికలపై గురువారం విడుదల చేశారు. దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, అయినా, లాక్‌డౌన్‌తో జీవనోపాధి కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవడం లేదని సోనియా పేర్కొన్నారు. ‘స్వాతంత్య్రం తరువాత ఈ స్థాయిలో వేదనాభరిత పరిస్థితులు ఎన్నడూ ఎదురుకాలేదు. వేలాది మంది వలస కూలీలు, కార్మికులు, మహిళలు, చిన్నపిల్లలు స్వస్థలాలకు వందలాది కిలోమీటర్లు మండుటెండలో, వట్టి కాళ్లతో, ఆహారం, ఔషధాలు, రవాణా సదుపాయాలు లేకుండా నడిచి వెళ్తున్న విషాధ దృశ్యాలు కలచివేస్తున్నాయి. వారి బాధ, వారి వేదన అందరికీ అర్థమవుతోంది. ప్రభుత్వానికి తప్ప’ అని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. -
హోంగార్డుకు ఆర్థిక సాయం
విజయనగరం టౌన్ : జిల్లా పోలీసు శాఖలో హోంగార్డుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన కోరాడ అప్పారావుకు ఎస్పీ జి. పాలరాజు రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయల చెక్‌ను అందజేశారు. శుక్రవారం స్థానిక పోలీస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ పాలరాజు మాట్లాడుతూ, హోంగార్డులు పదవీ విరమణ చేసినా, మరణించినా వారి కుటుంబానికి హోంగార్డుల ఒక్కరోజు అలవెన్స్‌ను అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో హోమ్గార్డ్స్ ఇన్చార్జి ఆర్ఎస్సై మురళీధర్, ఆఫీస్ సూపరింటెండెంట్ బి.చంద్రశేఖర్, జూనియర్ సహాయకులు పాల్గొన్నారు. -
కాకతీయల కాలంలోనే ‘ధూపదీప నైవేద్యం’
సాక్షి, హైదరాబాద్: ధూపదీప నైవేద్యం పేరుతో ప్రభుత్వం ఇప్పుడు చిన్న దేవాలయాలకు ఆర్థిక సాయం చేస్తున్నట్లుగానే.. ఆనాడు కాకతీయుల కాలంలో చిన్న చిన్న దేవాలయాలకు సాయం అందేదని వెల్లడైంది. కేవలం ధూపదీప నైవేద్యాలకే కాకుండా ఆలయాలకు నగలు, నగదు, భూమి ఇలా ఎన్నో ఇచ్చేవారు. తాజాగా ఈ విషయాలు తెలిపే కాకతీయుల కాలం నాటి ఓ అరుదైన శాసనం వెలుగు చూసింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి చెరువుగట్టుపై ఆలయ శిథిలాల వద్ద కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కట్టా శ్రీనివాసు.. పొతగాని సత్యనారాయణ, రాధాకృష్ణమూర్తిల సాయంతో శాసనాన్ని గుర్తించారు. 7 అడుగుల 4 ఫల కల రాతిస్తంభంపై శాసనం చెక్కి ఉంది. ఓవైపు ఢమరుకం, త్రిశూలం, మరోవైపు పైన సూర్యచంద్రులు, కింద వరాహం గుర్తులున్నాయి. తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు శ్రీరామోజు హరగోపాల్ విశ్లేషిస్తూ ప్రతాపరుద్రుడి సేనాధిపతి రుద్రసేనాని మనవడు లేదా తర్వాతి తరం పసాయిత గణపతిరెడ్డి వేయించిందని తెలిపారు. ఎలకుర్తితో పాటు ముదిగొండ చాళుక్యులు ఏలిన ప్రాంతాన్ని వీరు పాలించి ఉంటారని అంచనా వేస్తున్నామన్నారు. నేలకొండపల్లి చెరువుగట్టు మీద ఉన్న పోలకమ్మ గుడికి భూమి, పంటను దానం ఇస్తూ వేయించినట్లు గా శాసనంపై ఉంది. ‘బొల్ల సముద్రం (చెరువు) వెనక ఇరు కార్తెల పంట, రెండు మర్తరుల భూమి (దాదాపు 3 ఎకరాలు) శక సం.1162, శార్వది సం వైశాఖ శుద్ధ తదియ గురువారం అనగా క్రీ.శ. 1240 మార్చి 26న ఇచ్చిన దాన శాసనం’ముందుగా సాధారణ తెలుగులో మొదలై తర్వాత శ్లోకాలతో వివరించి ఉంది. -
ఒంటరి స్త్రీలకూ ‘ఆసరా’!
నేడు అసెంబ్లీలో సీఎం ప్రకటించే అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఒంటరి స్త్రీలకు కూడా ‘ఆసరా’పథకం కింద ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం శాసనసభలో విధానపరమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎటువంటి ఆదరణకు నోచుకోని జోగినులు, విడాకులు పొందిన వారు, పెళ్లికాని మహిళలు.. ఒంటరి స్త్రీల కేటగిరీలోకి వస్తారు. ఇటువంటి వారికి ఆసరా పథకాన్ని వర్తింపజేయాలని ఎంతో కాలంగా డిమాండ్ ఉన్నందున, గత కొన్ని నెలలుగా కసరత్తు చేసిన అనంతరం ప్రభుత్వం సాను కూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 31 జిల్లాల నుంచి ఇప్పటికే సేకరించిన సమాచారం మేరకు ఒంటరి స్త్రీలు సుమారు 4లక్షల మంది వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. వీరందరికీ నెలకు రూ.వెయ్యి చొప్పున ఆర్థిక సాయం అందిస్తే, ప్రస్తుతం ఆసరా పథకానికి వెచ్చిస్తున్న రూ.394కోట్లకు తోడు మరో రూ.40కోట్ల భారం పడనుందని అధికారులు లెక్కలు తేల్చారు. -
నేపాల్‌కు వంద కోట్ల డాలర్ల ఆర్థిక సాయం
నేపాల్ పర్యటన సందర్భంగా ప్రకటించిన సుష్మా స్వరాజ్ కఠ్మాండూ: పెను భూకంపంతో అతలాకుతలమైన నేపాల్ పునర్నిర్మాణానికి భారత ప్రభుత్వం వంద కోట్ల డాలర్ల భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. నేపాలీల కన్నీళ్లు తుడిచేందుకు నేపాల్ ప్రభుత్వానికి తాము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేసింది. నేపాల్ రాజధాని కఠ్మాండూలో గురువారం జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ నేపాల్స్ రీకన్స్ట్రక్షన్ సదస్సు సందర్భంగా భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఈ మేరకు ప్రకటన చేశారు. నేపాల్ పునర్నిర్మాణానికి నిధులు రాబట్టేందుకు ఆ దేశ ప్రభుత్వం ఈ సదస్సును ఏర్పాటు చేసింది. ఈ సదస్సుకు భారత ప్రభుత్వం తరఫున సుష్మాస్వరాజ్ హాజరయ్యారు. ఈ సదస్సులో సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ.. వంద కోట్ల డాలర్లలో నాలుగో వంతు మొత్తాన్ని గ్రాంట్‌గా అందిస్తామన్నారు. ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడేలా వచ్చే ఐదేళ్లలో మరో వంద కోట్ల డాలర్లను అందజేయనున్నామని, దీంతో ఈ సాయం రెండు వందల కోట్ల డాలర్లకు చేరుతుందని చెప్పారు. ఈ మొత్తంలో 40 శాతాన్ని గ్రాంట్‌గా అందిచనున్నామని చెప్పారు. -
‘రెక్కలు’ తొడిగేందుకు చేయూత
పాతబస్తీ మహిళ పైలట్ కోర్సు పూర్తిచేసేందుకు రూ. 35.50 లక్షల ఆర్థిక సాయం అందజేసిన ప్రభుత్వం నిధుల మంజూరీ లేఖను ఫాతిమాకు అందించిన సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: పైలట్ శిక్షణ పొందేందుకు ఆర్థిక సాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆశ్రయించిన పాతబస్తీకి చెందిన సయీదా సల్వా ఫాతిమాకు ప్రభుత్వం ఆపన్నహస్తం అందించింది. సంబంధిత కోర్సు ఫీజు కోసం రూ. 35.50 లక్షల ఆర్థిక సాయం చేసింది. అంబేద్కర్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన ఫాతిమా...పైలట్ కావాలన్న పట్టుదలతో ఆ కోర్సును ఎంపిక చేసుకుంది. అయితే ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం పొందాలంటే మల్టీ ఇంజిన్ రేటింగ్ కోర్సు, పైలట్స్ టైప్ రేటింగ్ ట్రైనింగ్ కోర్సు చేయటం తప్పనిసరి. కానీ ఆమె ఆకాంక్షకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారాయి. ఫాతిమా తండ్రి బేకరీలో, భర్త ప్రైవేటు కంపెనీలో పని చేస్తూ చాలీచాలని ఆదాయం పొందుతున్నారు. దీంతో లక్షల్లో ఫీజు చెల్లించి ఈ కోర్సు పూర్తి చేయటం ఫాతిమాకు అసాధ్యంగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ సాయమే తనకు దిక్కు అని భావించిన ఫాతిమా...గత వారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును కలసి తనకు ఆర్థిక సాయం చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించింది. ఆమె అభ్యర్థనను మానవతా దృక్పథంతో పరిశీలించాలంటూ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్‌లు సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం ఆదేశాలతో విచారణ చేపట్టిన మైనారిటీ విభాగం అధికారులు... ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం పొందేందుకు ఈ కోర్సు తప్పనిసరని, ఫాతిమా కుటుంబ ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉందని ధ్రువీకరించారు. వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్ ఫాతిమా పైలట్ కోర్సుకు అవసరమైన ఫీజును చెల్లించాలని ఆదేశాలు జారీ చేయడంతోపాటు మంగళవారం ఉదయం తన క్యాంప్ ఆఫీసులో రూ. 35.50 లక్షల మంజూరీ లేఖను ఫాతిమాకు అందించారు. తన కోరికను మన్నించి ఆర్థిక సాయం చేసినందుకు సీఎంకు ఫాతిమా కృతజ్ఞతలు తెలిపింది. ఫాతిమా అడ్మిషన్ తీసుకునే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏవియేషన్ అకాడమీకి ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేయనుంది. కొత్త రాష్ట్రంలో పాతబస్తీ నుంచి పైలట్ శిక్షణ పొందుతున్న మొదటి మహిళ ఫాతిమానే కావడం విశేషం.