ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లభ్యమైన కాకతీయుల కాలం నాటి శిలాశాసనం
సాక్షి, హైదరాబాద్: ధూపదీప నైవేద్యం పేరుతో ప్రభుత్వం ఇప్పుడు చిన్న దేవాలయాలకు ఆర్థిక సాయం చేస్తున్నట్లుగానే.. ఆనాడు కాకతీయుల కాలంలో చిన్న చిన్న దేవాలయాలకు సాయం అందేదని వెల్లడైంది. కేవలం ధూపదీప నైవేద్యాలకే కాకుండా ఆలయాలకు నగలు, నగదు, భూమి ఇలా ఎన్నో ఇచ్చేవారు. తాజాగా ఈ విషయాలు తెలిపే కాకతీయుల కాలం నాటి ఓ అరుదైన శాసనం వెలుగు చూసింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి చెరువుగట్టుపై ఆలయ శిథిలాల వద్ద కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కట్టా శ్రీనివాసు.. పొతగాని సత్యనారాయణ, రాధాకృష్ణమూర్తిల సాయంతో శాసనాన్ని గుర్తించారు. 7 అడుగుల 4 ఫల కల రాతిస్తంభంపై శాసనం చెక్కి ఉంది.
ఓవైపు ఢమరుకం, త్రిశూలం, మరోవైపు పైన సూర్యచంద్రులు, కింద వరాహం గుర్తులున్నాయి. తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు శ్రీరామోజు హరగోపాల్ విశ్లేషిస్తూ ప్రతాపరుద్రుడి సేనాధిపతి రుద్రసేనాని మనవడు లేదా తర్వాతి తరం పసాయిత గణపతిరెడ్డి వేయించిందని తెలిపారు. ఎలకుర్తితో పాటు ముదిగొండ చాళుక్యులు ఏలిన ప్రాంతాన్ని వీరు పాలించి ఉంటారని అంచనా వేస్తున్నామన్నారు. నేలకొండపల్లి చెరువుగట్టు మీద ఉన్న పోలకమ్మ గుడికి భూమి, పంటను దానం ఇస్తూ వేయించినట్లు గా శాసనంపై ఉంది. ‘బొల్ల సముద్రం (చెరువు) వెనక ఇరు కార్తెల పంట, రెండు మర్తరుల భూమి (దాదాపు 3 ఎకరాలు) శక సం.1162, శార్వది సం వైశాఖ శుద్ధ తదియ గురువారం అనగా క్రీ.శ. 1240 మార్చి 26న ఇచ్చిన దాన శాసనం’ముందుగా సాధారణ తెలుగులో మొదలై తర్వాత శ్లోకాలతో వివరించి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment