Kakatiya period
-
ముళ్లపొదల్లో కాకతీయ శిల్పాలు
సాక్షి, హైదరాబాద్: కాకతీయ కాలానికి చెందిన అరుదైన వీరభద్రుడి విగ్రహం ఇది. నాగర్‌కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉమామహేశ్వర దేవాలయం సమీపంలో ఇలా ఎన్నో విగ్రహాలు మట్టిపాలై ఉన్నాయి. వీటిని చరిత్ర పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గుర్తించారు. ఉమామహేశ్వర దేవాలయంలో 1320లో వేయించిన ప్రతాపరుద్రుని శాసనం, 14వ శతాబ్దినాటి శిల్ప సోదరులు పెద శరభయ్య, చిన శరభయ్యలు దేవాలయంలోని పార్వతి, చెన్నకేశవ, మహిషాసుర మర్ధిని, వీరభద్ర, నందికేశ్వరుల విగ్రహాలను చెక్కారని, వాటిని సదానంద స్వామి అనే వ్యక్తి ప్రతిష్టించారని రాసి ఉందన్నారు. కొన్ని విగ్రహాలు ఆలయ మండపంలో ఉండగా, గల్లంతైన వీరభద్ర, నంది విగ్రహాలు ఈ ముళ్లపొదల్లో కనిపించాయన్నారు. -
రాజుకు మంచి జరగాలంటూ దేవుడికి భూ దానం
సాక్షి, హైదరాబాద్: రాజులకు మేలు కలగాలని దేవాలయాలకు మాణ్యం దానం చేయటం కాకతీయుల కాలంలో ప్రాచుర్యంలో ఉండేది. దీన్ని మరోసారి రూఢీ చేస్తూ ఓ శాసనం వెలుగుచూసింది. రుద్రదేవుని హయాంలో దేవాలయానికి భూమిని దానం చేసిన సందర్భంలో వేయించిన అరుదైన శాసనం గుంటూరు జిల్లాలో కనిపించింది. గుంటూరు పట్టణం సమీపంలోని పుట్టాలగూడెం శివార్లలో ఉన్న పురాతన శిథిల ఆలయం సమీపంలో చెట్ల పొదల్లో పడి ఉన్న శాసనాన్ని ఇటీవల విశ్రాంత పురావస్తు అధికారి ఈమని శివనాగిరెడ్డి, సిద్దిపేటకు చెందిన ఔత్సాహిక చరిత్ర పరిశోధకులు అహోబిలం కరుణాకర్‌లు విడివిడిగా గుర్తించారు. శాసనంలోని వివరాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం ప్రతినిధి శ్రీరామోజు హరగోపాల్ వెల్లడించారు. ‘శక సంవత్సరం 1210, విరోధినామ సం. పౌష్య శుద్ధ విదియనాడు, మకర సంక్రాంతి పుణ్యకాలమపుడు కాకతీయ మహారాజు రుద్రదేవుని మహా గజ సాహిణి దాదిదాసణి రుద్రదేవ మహారాజుకు ధర్మంగా.. ’అంటూ ఈ శాసనం సాగింది. శాసనంలో నాటి వరి వంగడాల పేర్లు కూడా ఉండటం విశేషం. రుద్రదేవుని ఆస్థానంలో గజ సైన్యంలోని ఓ విభాగానికి పెద్దగా ఉన్న సాహిణి గన్నమ నాయకుని పుత్రుడు ఈ శాసనాన్ని వేయించినట్లు పేర్కొన్నారు. ఇక్కడి పాటిగడ్డలో శాతవాహన కాలం నాటి టెర్రకోట మట్టిపూసలు, నగిషీలు చెక్కిన కుండ పెంకులు, పలుపు పూత మట్టి పెళ్లెం ముక్క, కొమ్ము చెంబు ముక్కలు లాంటివి కూడా లభించాయని తెలిపారు. నిజానికి ఆ శాసనం చెక్కిన రాయి బౌద్ధ సంప్రదాయంలోని ఆయక స్తంభమని, దానిపైనే శాసనం చెక్కినట్లు గుర్తించామని వెల్లడించారు. -
కాచబోయిండు.. మల్లెబోయిండు!
సాక్షి ప్రతినిధి, వరంగల్: కాకతీయుల కాలం నాటి అరుదైన శాసనం వెలుగులోకి వచ్చింది. సంస్కృత, తెలుగు భాషలో ఉన్న ఈ శాసనం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుడితండాలో ఉన్న రాజరాజేశ్వర ఆలయంలో వెలుగుచూసింది. జిల్లాకు చెందిన ఔత్సాహిక పరిశోధకుడు అరవింద్ ఆర్యా ఈ శాసనాన్ని గుర్తించారు. ఈ శాసనం గణపతిదేవుడి కాలానికి చెందినదిగా ప్రాథమికంగా గుర్తించారు. ఆధారాలివే.. ఆలయ మండపంలోని స్తంభంపై ఓ వైపు సంస్కృతం, మరోవైపు తెలుగులిపి ఉంది. సంస్కృతంలో 18 , తెలుగులో 4 పంక్తులు ఉన్నాయి. ఈ శాసనాన్ని పరిశీలిస్తే కాకతీయుల కాలం నాటిది అనేందుకు ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న పాకాల శాసనంలో ఉన్నట్లే ఇందులోని 12, 13 పంక్తుల్లో ‘అస్మాద్యన్నహి రాజగజకేసరి విభ్రమం గణపత్యవనీంద్రస్యా’అని ఉంది. ఈ శాసనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల గ్రామ దేవాలయ స్తంభం మీద గుర్తించిన కాకతీయుల శాసనానికి నకలుగా ఉంది. 14వ పంక్తి నుంచి 18వ పంక్తి వరకు ఉన్న 5 పంక్తులు గుండాల, పాలంపేట, హన్మకొండ, పరకాల, ఘన్‌పూర్‌లోని శాసనాలకు ప్రతిలా ఉన్నాయి (వరంగల్ జిల్లా శాసన సంపుటి–శాసనాల సంఖ్యలు 78, 79, 80, 81, 82). ఈ గుడితండాతో పాటు మిగిలిన 5 చోట్ల కూడా ఇదే శాసన భాగం ఉండటం ఇది కాకతీయుల కాలం నాటిదని నిర్ధారిస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే చరిత్రకారులు గుర్తించిన పాకాల శాసనంలోని 160వ పంక్తిలో, 200వ పంక్తిలో గుడితండా దేవాలయానికి తూర్పున ఉన్న చెరువును ‘మౌద్గల్య తీర్థ’మంటారని ఉంది. 175, 176, 18, 188, 208వ పంక్తులలో రామనాథదేవర ప్రస్తావన ఉంది. ఇందుకు తగ్గట్లే శాసనంలో మొదటివైపు దేవాలయ దైవం రామనాథున్ని సంస్కృతంలో స్తుతిస్తూ శ్లోకాలున్నాయి. గుడితండా శాసనం రెండోవైపు రామనాథదేవరకు కాపులైన కాచబోయడు, మల్లెబోయలిద్దరు (కాచబోయిండు మల్లెబోయిండు రామనా) అరువణం (పాల గుండిగ, గిన్నె), దీపాలకు నేయి పోస్తున్నారని ఉంది. గుండాల, పాలంపేట, హన్మకొండ, పరకాల, ఘణపూర్ శాసనాల్లో ఉన్నట్లే ఈ శాసనంలో కూడా సంవత్సర, మాస, దినాలు పేర్కొనలేదు. లిపిలో ‘త’అక్షరం కొత్తగా కనిపించింది. గుడితండా శాసనంలో గణపతిదేవుడిని ‘రాజగజకేసరి’గా పేర్కొన్నారు. దీంతో ఇది గణపతిదేవుడి కాలంలో వేయించినట్లు భావిస్తున్నారు. ఆలయ విశేషాలు.. . రాజరాజేశ్వరాలయం త్రికూటాలయమైనా ప్రస్తుతం రెండు దేవాలయాలు మిగిలాయి. మూడో గుడికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించట్లేదు. రాజరాజేశ్వరాలయానికి గర్భగుడి, అంతరాలయాలున్నాయి. అంతరాలయ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు, వారికి ఇరువైపుల చామర గ్రాహులున్నారు. గర్భగుడి ద్వారానికి ఇరువైపులా పెద్ద కలశాలు చెక్కి ఉన్నాయి. ద్వారం ముందు సోపానశిల పెద్దదిగా ఉంది. అంతరాళంలో వినాయకుడి విగ్రహం ఉంది. మూడువైపుల విస్తరించి అర్థ మండపం, రంగమండపాలతో, 16 స్తంభాలతో ఆలయాన్ని నిర్మించారు. పశ్చిమ ముఖద్వారముంది. ప్రస్తుతం రాజరాజేశ్వరాలయంగా పిలుస్తున్న ఈ గుడిని కాకతీయుల కాలంలో రామనాథ దేవాలయమని పిలిచేవారని శాసనంలో ఉంది. మూడు శివలింగాలు ఉండాల్సిన చోట ప్రస్తుతం పూజలందుకుంటున్న శివలింగమొకటి, భగ్నమైన లింగమొకటి కనిపిస్తున్నాయి. 4 అడుగుల విస్తీర్ణం, లింగంతో రెండున్నర అడుగుల ఎత్తున్న గుండ్రని పానవట్టం మూడు సోపానాలు ఉన్నాయి. పూజలందుకుంటున్న శివలింగం పానవట్టం ఐదుసోపానాలతో ఉంది. దేవాలయ ప్రాంగణంలో వీరభద్రుని శిల్పం ఉంది. గుడిప్రాంగణంలోనే ద్వారానికి బయట ప్రత్యేకమైన అధిష్టాన పీఠం మీద వేంకటేశ్వరుని విగ్రహం ఉంది. దేవాలయప్రాంగణంలో రెండు ఆంజనేయ విగ్రహాలున్నాయి. గుడిలో ఉన్న స్తంభంపై శిలాశాసనం -
కాకతీయల కాలంలోనే ‘ధూపదీప నైవేద్యం’
సాక్షి, హైదరాబాద్: ధూపదీప నైవేద్యం పేరుతో ప్రభుత్వం ఇప్పుడు చిన్న దేవాలయాలకు ఆర్థిక సాయం చేస్తున్నట్లుగానే.. ఆనాడు కాకతీయుల కాలంలో చిన్న చిన్న దేవాలయాలకు సాయం అందేదని వెల్లడైంది. కేవలం ధూపదీప నైవేద్యాలకే కాకుండా ఆలయాలకు నగలు, నగదు, భూమి ఇలా ఎన్నో ఇచ్చేవారు. తాజాగా ఈ విషయాలు తెలిపే కాకతీయుల కాలం నాటి ఓ అరుదైన శాసనం వెలుగు చూసింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి చెరువుగట్టుపై ఆలయ శిథిలాల వద్ద కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కట్టా శ్రీనివాసు.. పొతగాని సత్యనారాయణ, రాధాకృష్ణమూర్తిల సాయంతో శాసనాన్ని గుర్తించారు. 7 అడుగుల 4 ఫల కల రాతిస్తంభంపై శాసనం చెక్కి ఉంది. ఓవైపు ఢమరుకం, త్రిశూలం, మరోవైపు పైన సూర్యచంద్రులు, కింద వరాహం గుర్తులున్నాయి. తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు శ్రీరామోజు హరగోపాల్ విశ్లేషిస్తూ ప్రతాపరుద్రుడి సేనాధిపతి రుద్రసేనాని మనవడు లేదా తర్వాతి తరం పసాయిత గణపతిరెడ్డి వేయించిందని తెలిపారు. ఎలకుర్తితో పాటు ముదిగొండ చాళుక్యులు ఏలిన ప్రాంతాన్ని వీరు పాలించి ఉంటారని అంచనా వేస్తున్నామన్నారు. నేలకొండపల్లి చెరువుగట్టు మీద ఉన్న పోలకమ్మ గుడికి భూమి, పంటను దానం ఇస్తూ వేయించినట్లు గా శాసనంపై ఉంది. ‘బొల్ల సముద్రం (చెరువు) వెనక ఇరు కార్తెల పంట, రెండు మర్తరుల భూమి (దాదాపు 3 ఎకరాలు) శక సం.1162, శార్వది సం వైశాఖ శుద్ధ తదియ గురువారం అనగా క్రీ.శ. 1240 మార్చి 26న ఇచ్చిన దాన శాసనం’ముందుగా సాధారణ తెలుగులో మొదలై తర్వాత శ్లోకాలతో వివరించి ఉంది. -
ప్రకృతి రమణీయం.. చరిత్రకు దర్పణం
నల్లమల అడవుల్లో దాగిన విశేషాలెన్నో - కాకతీయకాలం నాటి కోటలు.. 140 మైళ్ల మేర రాతిగోడలు - నిజాం కాలంనాటి కాలాపాని జైలు - ఫరాహాబాద్ వద్ద వేసవి విడిది కేంద్రాలు - ప్రాచుర్యంలోకి రాని ఆలయాలు మరెన్నో.. ఎటుచూసినా పచ్చదనం.. ఆకాశాన్ని ముద్దాడే చెట్లు.. గలగలా పారే జలపాతాలు.. సెలయేళ్లు.. పక్షుల కిలకిలారావాలు.. నల్లమల అటవీప్రాంతంలో ఎటుచూసినా ఆహ్లాదకర వాతావరణమే! ఒక్కమాటలో చెప్పాలంటే ఆ ప్రకృతి అందాలను వర్ణించడానికి మాటలు చాలవు. నల్లమల అంటే ఈ రమణీయ దృశ్యాలే కాదు.. ఇన్నాళ్లూ ఎవరికీ పెద్దగా తెలియని ఎన్నో చారిత్రక ఆనవాళ్లకు నెలవు కూడా! కాకతీయకాలం నాటి పటాలభద్రుని కోట.. 140 మైళ్ల పొడవున నిర్మించిన రాతిగోడలు.. నిజాం కాలంలో నిర్మించిన కాలాపాని జైలు.. ఫరాహాబాద్ వద్ద వేసవి విడిది కేంద్రాలు.. ఇలా ఎన్నెన్నో చారిత్రక ఘట్టాలు అబ్బురపరుస్తాయి. అటు చారిత్రక ప్రదేశాలు, ఇటు ప్రకృతి సోయగాలతో అలరారుతున్న నల్లమలపై ఈవారం ఫోకస్.. – గంగాపురం ప్రతాప్‌రెడ్డి, సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ 430 చెంచు ఆవాసాలు.. నల్లమల అటవీ ప్రాంతంలో చెంచుగూడేలు ప్రధాన ఆకర్షణ. అడవిలో అక్కడక్కడ విసిరేసినట్లుగా చిన్నచిన్న గుడిసెలు కనిపిస్తాయి. నల్లమలలో దాదాపు 430 చెంచు ఆవాసాలున్నాయి. వీటిల్లో అధికారిక లెక్కల ప్రకారం 60 వేల జనాభా ఉంది. వీరంతా కేవలం అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మదనగడ్డలు, సిలగింజలు, తేనె, చింతపండు, థౌప్సీబంక తదితర వాటి మీదే జీవనం గడుపుతున్నారు. గత ఏడేళ్లుగా నల్లమలలో అత్యంత విలువైన యురేనియం నిక్షేపాలను వెలికితీయడం కోసం చెంచులను బయటకు పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వాల యత్నాలను చెంచులు ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నారు. 2010లో డీబీర్స్ అనే సంస్థ వజ్రాలు, యురేనియం నిక్షేపాల కోసం నల్లమలలో సర్వేలు, భూపరీక్షలు నిర్వహించింది. ఇందులో దాదాపు 2 వేల ఎకరాల విస్తీర్ణంలో యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు వెలుగు చూశాయి. టైగర్ జోన్.. అమ్రాబాద్ పులులకు నెలవైన ప్రాంతం నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టు. మొత్తం 9 వేల చ.కి.మీ. అటవీప్రాంతంలో 3,865 చ.కి.మీ. ప్రాం తాన్ని అభయారణ్యంగా గుర్తించారు. వేటగాళ్ల బారి న పడి పులుల సంఖ్య తగ్గిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి 1983లో అభయారణ్యం గా ప్రకటించింది. అప్పటి నుంచి నిషేధిత ప్రాం తంగా పేర్కొంటూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అత్యంత దట్టమైన అడవి కావడంతో చెంచులనే పర్యవేక్షకులుగా అటవీశాఖ నియమించింది. టైగర్ ట్రాకర్స్, స్ట్రైక్‌ఫోర్స్‌గా పిలవబడే వీరికి ప్రతినెల రూ.9 వేల పారితోషికం అందజేస్తున్నారు. వెలుగుచూడని ఆలయాలు ఎన్నో.. దట్టమైన అడవిలో ఏ మూలన చూసినా శివాలయాలే దర్శనమిస్తాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే ప్రాచుర్యం పొందాయి. అందులో కొన్ని ఉమామహేశ్వరం, సలేశ్వరం, మల్లెల తీర్థం, లొద్దిమడుగు. ఈ ప్రాంతాలకు చేరుకోవాలంటే సాహసయాత్ర చేయాల్సిందే. ఏడాదిలో చైత్ర పౌర్ణమి సందర్భంగా కేవలం 5 రోజులే సలేశ్వరంలో పూజలు నిర్వహిస్తారు. చాలా ఆలయాలు దట్టమైన అడవిలో నెలకొనడంతో ప్రాచుర్యంలోకి రాలేదు. భైరవుని గుడి, కదిలివనం, అంతర్గంగ, అమరేశ్వరాలయం, కేదారేశ్వరాలయం, వంకేశ్వర శివాలయం, నాగేశ్వరం, రాయలగండి చెన్నకేశవాలయం తదితర దేవాలయాలు ఇక్కడ కొలువై ఉన్నా.. ఆలనాపాలనా లేక శిథిలావస్థకు చేరాయి. కాకతీయుల కాలంలో నిర్మించిన పటాలభద్రుని కోటలోని శివాలయం కనుమరుగవుతోంది. కాలగర్భంలో కాకతీయుల కోటలు.. కాకతీయుల పాలన అనగానే టక్కున గుర్తొచ్చేది వరంగల్ ప్రాంతం. కానీ దక్షిణ తెలంగాణ ముఖ్యంగా పాలమూరు ప్రాంతంలో కూడా వారి పాలన ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ముఖ్యంగా నల్లమలలో కాకతీయుల నాటి కాలంలో నిర్మించిన కోటలు అందుకు సజీవసాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. 13వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడి పాలనలో కొన్ని కోటలు నిర్మించారు. వాటిలో ప్రధానమైన పటాలభద్రుడి కోట కాలగర్భంలో కలిసిపోతోంది. అంతేకాదు శత్రుదుర్భేద్యంగా ఉండేందుకు అతి పొడవైన రాతిగోడ కూడా నిర్మించారు. నల్లమల అటవీ ప్రాంతంలో 140 మైళ్ల మేర పొడవు, 6 అడుగుల వెడల్పుతో నిర్మించిన రాతిగోడపై అప్పట్లో గుర్రాలతో కాపలా కాసేవారని చరిత్రకారులు పేర్కొంటున్నారు. అలాగే ఈ కోట సమీపంలో నిర్మించిన కోనేరు, ఆలయాలు శిథిలమైపోయాయి. అత్యంత దట్టమైన అటవీప్రాంతం కావడంతో ఎవరూ అటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేకపోతున్నారు. పర్యాటక సంపదపై నిర్లక్ష్యం నల్లమలలోని ప్రకృతి రమణీయమైన ప్రాంతాలను వీక్షించడానికి అనువైన పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. నల్లమల, కృష్ణానదీ తీర ప్రాంతాల్లో ఎకో టూరిజం పేరిట నిధులు విడుదల చేసినా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఏపీలోని కర్నూలు జిల్లా పరిధిలో ఒక రోజంతా అడవిలో గడిపేలా చర్యలు చేపట్టారు. బైరుట్లీ, పచ్చర్ల వద్ద 14 కాటేజీలను అందుబాటులోకి తెచ్చారు. ఒక రోజంతా అడవిలో గడపడంతో పాటు ప్రకృతి అందాలను వీక్షించేందుకు ప్రత్యేక సఫారీ వాహనంలో తిప్పుతారు. అలాంటి విధానాన్ని తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.92 కోట్ల నిధులు మంజూరు చేసినా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి.