సాక్షి, హైదరాబాద్: రాజులకు మేలు కలగాలని దేవాలయాలకు మాణ్యం దానం చేయటం కాకతీయుల కాలంలో ప్రాచుర్యంలో ఉండేది. దీన్ని మరోసారి రూఢీ చేస్తూ ఓ శాసనం వెలుగుచూసింది. రుద్రదేవుని హయాంలో దేవాలయానికి భూమిని దానం చేసిన సందర్భంలో వేయించిన అరుదైన శాసనం గుంటూరు జిల్లాలో కనిపించింది. గుంటూరు పట్టణం సమీపంలోని పుట్టాలగూడెం శివార్లలో ఉన్న పురాతన శిథిల ఆలయం సమీపంలో చెట్ల పొదల్లో పడి ఉన్న శాసనాన్ని ఇటీవల విశ్రాంత పురావస్తు అధికారి ఈమని శివనాగిరెడ్డి, సిద్దిపేటకు చెందిన ఔత్సాహిక చరిత్ర పరిశోధకులు అహోబిలం కరుణాకర్‌లు విడివిడిగా గుర్తించారు.
శాసనంలోని వివరాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం ప్రతినిధి శ్రీరామోజు హరగోపాల్ వెల్లడించారు. ‘శక సంవత్సరం 1210, విరోధినామ సం. పౌష్య శుద్ధ విదియనాడు, మకర సంక్రాంతి పుణ్యకాలమపుడు కాకతీయ మహారాజు రుద్రదేవుని మహా గజ సాహిణి దాదిదాసణి రుద్రదేవ మహారాజుకు ధర్మంగా.. ’అంటూ ఈ శాసనం సాగింది. శాసనంలో నాటి వరి వంగడాల పేర్లు కూడా ఉండటం విశేషం. రుద్రదేవుని ఆస్థానంలో గజ సైన్యంలోని ఓ విభాగానికి పెద్దగా ఉన్న సాహిణి గన్నమ నాయకుని పుత్రుడు ఈ శాసనాన్ని వేయించినట్లు పేర్కొన్నారు. ఇక్కడి పాటిగడ్డలో శాతవాహన కాలం నాటి టెర్రకోట మట్టిపూసలు, నగిషీలు చెక్కిన కుండ పెంకులు, పలుపు పూత మట్టి పెళ్లెం ముక్క, కొమ్ము చెంబు ముక్కలు లాంటివి కూడా లభించాయని తెలిపారు. నిజానికి ఆ శాసనం చెక్కిన రాయి బౌద్ధ సంప్రదాయంలోని ఆయక స్తంభమని, దానిపైనే శాసనం చెక్కినట్లు గుర్తించామని వెల్లడించారు.
రాజుకు మంచి జరగాలంటూ దేవుడికి భూ దానం
Published Sun, Jan 5 2020 1:50 AM | Last Updated on Sun, Jan 5 2020 1:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment