దేవుళ్లపై దండయాత్ర! | Attack on the temples | Sakshi
Sakshi News home page

దేవుళ్లపై దండయాత్ర!

Published Sat, Jul 2 2016 8:03 AM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM

దేవుళ్లపై దండయాత్ర! - Sakshi

దేవుళ్లపై దండయాత్ర!

పీఠాధిపతుల ప్రధాన డిమాండ్లు..
చంద్రబాబు ప్రభుత్వ మహాపచారం..
విజయవాడలో 30 ఆలయాల కూల్చివేత

 
కూల్చివేసిన గోశాలను అదే ప్రదేశంలో పునర్నిర్మించాలి
కృష్ణుడి ఆలయాన్ని పునరుద్ధరించాలి.
కూల్చివేసిన ఆలయాల నిర్మాణానికి భూమి కేటాయించి, నిధులు విడుదల చేయాలి.
ఇతర దేవాలయాల కూల్చివేతను తక్షణమే ఆపాలి.
 
సాక్షి, అమరావతి: అమరావతి భూములను, సదావర్తి సత్రం మాన్యాలను కైంకర్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇపుడు ఏకంగా ఆలయాల విధ్వంసానికి నడుం బిగించింది. కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్న కనీస స్పృహ లేకుండా ఇష్టానుసారంగా ఆలయాలను కూల్చివేస్తోంది. కృష్ణాపుష్కరాలంటూనే కృష్ణానదీతీరంలోని ఆలయాలను విచక్షణారహితంగా కూల్చివేస్తున్నారు. విజయవాడ నగరంలో ఏకంగా 30 ఆలయాలను కూల్చివేశారు. మరో 11 ఆలయాలను కూల్చివేయడానికి సిద్ధమౌతున్నారు.  కృష్ణానదిలో స్నానమాచరించి తీరంలోని ఆలయాలను సందర్శించుకోవడం భక్తులకు ఆనవాయితీ. అలాంటివేవీ పట్టించుకోకుండా విచక్షణారహితంగా పవిత్రమైన ఆలయాలను కూల్చివేయడం మహాపచారమని మఠాధిపతులు, పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి అరిష్టం దాపురిస్తుందని  వారు ఆందోళన పడుతున్నారు.

 అనేక ఆలయాలు ధ్వంసం...
 సీతమ్మవారి పాదాల సమీపంలో ఇటీవల కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ఆంజనేయస్వామి ఆలయాన్ని కూల్చివేశారు. ఆంజనేయుడి విగ్రహాన్ని ఏదో పాత సామగ్రిని మూటగట్టినట్లు ఓ వాహనంపై కట్టిపడేసి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉంచారు. అత్యంత పురాతనమైన సీతమ్మవారి పాదాలు, రాష్ట్రంలో రెండోదిగా పేరొందిన శనీశ్వర ఆలయం, రాహు-కేతు దేవాలయం, కృష్ణా నదీ తీరంలోని భూగర్భ వినాయక ఆలయం, సాయిబాబా మందిరం, భవానీపురంలోని స్వయంభూ అమ్మవారి ఆలయాలను తొలగించారు. అర్జునవీధి లో దశాబ్దాలుగా ఆవులను సంరక్షిస్తూ వచ్చిన గోశా ల, అందులోని కృష్ణుడి ఆలయం, బావాజీ మఠంలను ధ్వంసం చేశారు. విజయేశ్వరస్వామి, వరసిద్ధి వినాయకుడి ఆలయాలతోపాటు మరో 10 గుళ్లను కూడా కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 ప్రత్యామ్నాయం లేదా?
 ఆలయాలు తొలగించకుండా పుష్కర పనులు చేసేందుకు ఉన్న ప్రత్యామ్నాయ అవకాశాలను ప్రభుత్వం పరిశీలించనే లేదు. అర్ధరాత్రి పొక్లెయినర్లతో వచ్చి ఆలయాలను కూల్చివేశారు. విగ్రహాలను శాస్త్రోక్తంగా తొలగిస్తామన్న అర్చకుల విజ్ఞప్తినీ పట్టించుకోలేదు. టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని పర్యవేక్షణలో కలెక్టర్ అహ్మద్ బాబు ఆధ్వర్యంలో ఆలయాల తొలగింపు కొనసాగింది. ఈ తీరుపై ప్రతిపక్ష వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు మాత్రం ప్రభుత్వ చర్యలను సమర్థించారు. ‘ఆలయాలు కూల్చివేస్తాం.. ఎవరు అడ్డువస్తారో చూస్తాం’అని ఎంపీ నాని పేర్కొన్నారు.

 భారీ ర్యాలీకి రంగం సిద్ధం
  ఆలయాల కూల్చివేతపై కృష్ణా తీరంలో ఉన్న శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఇప్పటికే వివిధ మఠాధిపతులు, హైందవ సంస్థల ప్రతినిధులతో చర్చించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 4వ తేదీన విజయవాడలో పీఠాధిపతులు, మఠాధిపతులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని, ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు 300 మంది పీఠాధిపతులు, వేలాది మంది హైందవ సంస్థల ప్రతినిధులు, భక్తులు ఈ ర్యాలీలో పాల్గొంటారని తెలుస్తోంది.  

 ఆలయాలు కూల్చి పుష్కరాలా?
 పుష్కరాల స్ఫూర్తికే విఘాతం కలిగిస్తూ ప్రభుత్వం ఆలయాలను కూల్చివేస్తోంది. పుష్కర సమయంలో భక్తులు నదిలో పుణ్యస్నానాలు చేయడంతోపాటు ఒడ్డున, సమీపంలో ఉన్న ఆలయాలను కూడా దర్శిస్తారు. అందుకోసం నదీ తీరంలోని ఆలయాలు, ఇతర దర్శనీయ స్థలాల్లో సౌకర్యాలు పెంపొందించి మరింత శోభాయమానంగా తీర్చిదిద్దాలి. కానీ అందుకు విరుద్ధంగా కృష్ణా తీరంలో ఉన్న ఆలయాలను కూల్చివేసి రాష్ర్టప్రభుత్వం తీవ్ర అపచారానికి పాల్పడిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
 ‘సింగపూర్’ భూముల్లోనూ...
 సాక్షి, హైదరాబాద్: స్విస్ చాలెంజ్ విధానంలో రాజధాని ప్రాంతంలో సింగపూర్ సంస్థలకు ఇవ్వనున్న 1,691 ఎకరాల్లో (స్టార్ట్‌అప్ ఏరియా)నూ ప్రభుత్వం ప్రార్థనా మందిరాలు, శ్మశానాలను తొలగించనుంది. గత నెల 24వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ విధానానికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. 1,691 ఎకరాల్లో గల గుడితో పాటు చర్చి, మసీదులు, శ్మశానాలను కూల్చివేయనున్నారు. ఈ కూల్చివేతలను ఎవరూ అడ్డుకోకుండా పోలీసుల రక్షణ కల్పించనున్నారు. ఇందుకు పోలీసు శాఖ కూడా ఆమోదం తెలిపింది. ఈ ప్రాంతంలోకి బయటి వ్యక్తులు ఎవరూ రాకుండా నిషేధం విధించాలని, నిషేధాజ్ఞలను ఎవరూ ఉల్లంఘించకుండా చూడాల్సిన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని సింగపూర్ సంస్థలు పేర్కొన్నాయి.

స్టార్ట్‌అప్ ఏరియాలో అమరావతి భాగస్వామి (ఏడీపీ) తరఫున పనిచేసే ఉద్యోగులు, కన్సల్టెంట్లు, కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లకు ప్రాజెక్టు ఒప్పందం పూర్తి అయ్యే వరకు పోలీసు రక్షణ కల్పించనున్నారు. ఆ ప్రాంతంలోని రహదారులు, పుట్‌పాత్‌లపై ఉన్న వాటిని పూర్తిగా తొలగించనున్నారు. ట్రాఫిక్ బాధ్యతలను పోలీసులు చూస్తారు. కాగా పురాతన, చారిత్రక నిర్మాణాలు ఉన్న ప్రాంతంలోనే ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినవి తప్ప మిగతా వాటిని అక్కడ నుంచి తొలగించేందుకు పురావస్తు, పర్యాటక శాఖలు ఆమోదం తెలిపాయి. దీంతో పోలీసుల పహారా మధ్య ఆ కంపెనీలు రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయనున్నాయి.
 
 ఇది మహాపచారం..
 ప్రతిష్టాత్మక దేవాలయాలపట్ల, సనాతన హైందవ ధర్మంపట్ల ఈ ప్రభుత్వం మహాపచారానికి పాల్పడింది. ఆలయాల తరలింపు ఆగమశాస్త్రోక్తంగా చేయాలి. గోమాత ద్వారా విగ్రహాన్ని కదిలించి పక్కనే ఓ బాల ఆలయాన్ని ధాన్యంలో కలశ ప్రతిష్ఠాపన చేయాలి. అనంతరం మరోచోట శాస్త్రోక్తంగా ఆలయాన్ని నిర్మించి విగ్రహాలను ప్రతిష్ఠించాలి. కానీ ఈ ప్రభుత్వం అర్ధరాత్రి ఆలయాలను కూల్చివేసి విగ్రహాలను పెకలించివేయడం ద్వారా పాతకానికి ఒడిగట్టింది. ఈ మహాపచారం రాజ్య వినాశనానికి దారితీస్తుంది.     
- శివస్వామి, శివక్షేత్రం పీఠాధిపతి,తాళ్లాయపాలెం(గుంటూరు జిల్లా)
 
 ప్రభుత్వ దమననీతితో అరిష్టమే
 ముని, దేవతా ప్రతిష్ఠ ఆలయాలు, స్వయంభూ దేవాలయాలను ఎట్టిపరిస్థితుల్లోనూ తొలగించకూడదు. మానవ ప్రతిష్ఠ ఆలయాలను తరలించాలంటే ఆగమ ధర్మాన్ని పాటించి క్రతువులు నిర్వహించాలి. కానీ ప్రభుత్వం విజయవాడలో స్వయంభూ దేవాలయాన్ని కూలగొట్టింది. ఇది అరిష్టానికి దారితీస్తుంది.
     - సన్నిధానం నర్సింహశర్మ, కవి,పరిశోధకుడు, రాజమండ్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement