దేవాలయాలకు రూ.2 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని దేవాలయాలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఐదు నెలల బకాయిలకు సంబంధించి ప్రభుత్వం శుక్రవారం రూ.2 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు దేవాదాయశాఖ కమిషనర్ ఫైలుపై సంతకం చేశారు. 1,571 దేవాలయాలకు నెలకు రూ.2,500 చొప్పున ఈ నిధులను ఐదు నెలల కాలానికి సంబంధించి అందజేయనున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ధూపదీపనైవేద్య పథకాన్ని కొనసాగించే విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. జూన్ నుంచి నిధులు ఆగిపోయాయి. దీంతో 1,571 దేవాలయాల అర్చకులు దాతల నుంచి విరాళాలు వసూలు చేసి దేవుడికి కైంకర్యాలు కొనసాగిస్తూ వచ్చారు.
రానురాను దీపం వెలిగించటం కూడా భారంగా మారిన విషయం ఇటీవల సీఎం దృష్టికి వెళ్లింది. శాసనసభలో కూడా ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తేవటంతో ధూపదీపనైవేద్య పథకాన్ని కొనసాగిస్తున్నట్టు సీఎం ప్రకటించి నిధుల విడుదలకు హామీ ఇచ్చారు. ఈమేరకు బకాయిలు చెల్లింపునకు మార్గం సుగమమైంది.