క్యాంపు ఆఫీసులో ఫాతిమాకు ఆర్థిక సాయం మంజూరీ లేఖను అందిస్తున్న సీఎం కేసీఆర్
పాతబస్తీ మహిళ పైలట్ కోర్సు పూర్తిచేసేందుకు
రూ. 35.50 లక్షల ఆర్థిక సాయం అందజేసిన ప్రభుత్వం
నిధుల మంజూరీ లేఖను ఫాతిమాకు అందించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: పైలట్ శిక్షణ పొందేందుకు ఆర్థిక సాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆశ్రయించిన పాతబస్తీకి చెందిన సయీదా సల్వా ఫాతిమాకు ప్రభుత్వం ఆపన్నహస్తం అందించింది. సంబంధిత కోర్సు ఫీజు కోసం రూ. 35.50 లక్షల ఆర్థిక సాయం చేసింది. అంబేద్కర్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన ఫాతిమా...పైలట్ కావాలన్న పట్టుదలతో ఆ కోర్సును ఎంపిక చేసుకుంది. అయితే ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం పొందాలంటే మల్టీ ఇంజిన్ రేటింగ్ కోర్సు, పైలట్స్ టైప్ రేటింగ్ ట్రైనింగ్ కోర్సు చేయటం తప్పనిసరి. కానీ ఆమె ఆకాంక్షకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారాయి. ఫాతిమా తండ్రి బేకరీలో, భర్త ప్రైవేటు కంపెనీలో పని చేస్తూ చాలీచాలని ఆదాయం పొందుతున్నారు. దీంతో లక్షల్లో ఫీజు చెల్లించి ఈ కోర్సు పూర్తి చేయటం ఫాతిమాకు అసాధ్యంగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ సాయమే తనకు దిక్కు అని భావించిన ఫాతిమా...గత వారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును కలసి తనకు ఆర్థిక సాయం చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించింది. ఆమె అభ్యర్థనను మానవతా దృక్పథంతో పరిశీలించాలంటూ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్‌లు సీఎంకు విజ్ఞప్తి చేశారు.
దీనిపై సీఎం ఆదేశాలతో విచారణ చేపట్టిన మైనారిటీ విభాగం అధికారులు... ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం పొందేందుకు ఈ కోర్సు తప్పనిసరని, ఫాతిమా కుటుంబ ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉందని ధ్రువీకరించారు. వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్ ఫాతిమా పైలట్ కోర్సుకు అవసరమైన ఫీజును చెల్లించాలని ఆదేశాలు జారీ చేయడంతోపాటు మంగళవారం ఉదయం తన క్యాంప్ ఆఫీసులో రూ. 35.50 లక్షల మంజూరీ లేఖను ఫాతిమాకు అందించారు. తన కోరికను మన్నించి ఆర్థిక సాయం చేసినందుకు సీఎంకు ఫాతిమా కృతజ్ఞతలు తెలిపింది. ఫాతిమా అడ్మిషన్ తీసుకునే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏవియేషన్ అకాడమీకి ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేయనుంది. కొత్త రాష్ట్రంలో పాతబస్తీ నుంచి పైలట్ శిక్షణ పొందుతున్న మొదటి మహిళ ఫాతిమానే కావడం విశేషం.