ఆర్థిక భృతి దరఖాస్తు గడువు పెంపు
- ఈనెల 21 వరకు పొడిగించిన ప్రభుత్వం
- గడువులోగా దరఖాస్తు చేసిన ఒంటరి మహిళలకే జూన్ 2న ఆర్థిక భృతి
- ఇప్పటి వరకు అందిన దరఖాస్తులు 1.20 లక్షలే
సాక్షి, హైదరాబాద్: ఒంటరి మహిళల ఆర్థిక భృతి పథకానికి దరఖాస్తు గడువును ఈనెల 21 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఆర్థిక భృతి పథకానికి సంబంధించి దరఖాస్తులను స్వీకరించేందుకు ఈనెల 8 నుంచి 13 వరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యాలయాలు, గ్రామ సభల ద్వారా, పట్టణ ప్రాంతాల్లో వార్డు కార్యాలయాలు, మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. అయితే గడువులోగా ప్రభుత్వం ఊహించిన మేరకు దరఖాస్తులు రాకపోవడంతో, దరఖాస్తు చేసుకోని వారికి మరో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో గడువును 21 వరకు పొడిగించారు.
ఏ ఆదరువు లేని ఒంటరి మహిళలకు ఏప్రిల్ 1 నుంచి ప్రతి నెల రూ.వెయ్యి చొప్పున ఆర్థిక భృతిని అందజేస్తామని గత శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఏప్రిల్, మే నెలలకు సంబంధించి ఆర్థిక భృతి మొత్తాన్ని (రూ.2 వేలను) రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఈనెల 21లోగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే జూన్ 2న ఆర్థిక భృతిని చెల్లించనున్నారు. గడువు దాటాక వచ్చిన దరఖాస్తులకు జూన్ నెల నుంచి ఆర్థిక భృతిని వర్తింపజేయాలని నిర్ణయించారు.
అందిన దరఖాస్తులు 1.20 లక్షలే
రాష్ట్రంలో ఒంటరి మహిళల ఆర్థిక భృతికి 2 నుంచి 3 లక్షల వరకు దరఖాస్తులు అందవచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే అందుకు భిన్నంగా శనివారం వరకు 1,20,484 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భర్త వదిలేసిన మహిళలు, భర్తకు దూరంగా ఉంటున్న మహిళలు.. ఇప్పటికే వితంతు కేటగిరీలో ఆసరా పింఛన్ పొందుతున్నారని, ఈ కారణంగానే ఒంటరి మహిళల కేటగిరీలో దరఖాస్తుల సంఖ్య బాగా తగ్గిందని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు.
సెర్ప్ అధికారులకు అందిన మొత్తం దరఖాస్తుల్లో ఒక్క నిజామాబాద్ జిల్లా నుంచే అత్యధికంగా 10,313 మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం. అలాగే ఆసరా పెన్షనరు ఉన్న కుటుంబంలోని బీడీ కార్మికులకు కూడా ఆర్థిక భృతిని ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం, బీడీ కార్మికుల నుంచి సుమారు 80 వేల నుంచి 1 లక్ష దరఖాస్తులు రావచ్చని అంచనా వేసింది. అయితే చాలా తక్కువగా కేవలం 15,603 దరఖాస్తులు మాత్రమే అందాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా నుంచి 5,227, కామారెడ్డి జిల్లా నుంచి 3,567 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 31 జిల్లాల్లో 15 జిల్లాల నుంచి ఒక్క దరఖాస్తు కూడా అందకపోవడం గమనార్హం.