ఓటమి ప్రభావం ఆర్థిక సంస్కరణలపై ఉండదు: జైట్లీ
న్యూఢిల్లీ: ఎన్డీయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి ఆర్థిక సంస్కరణలపై ఎలాంటి ప్రభావం చూపబోదని కేంద్ర ఆర్థిక శాఖమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ‘ఎన్నికల ఓటమి ఆర్థిక సంస్కరణల అమలుకు ఎదురుదెబ్బగా పరిణమిస్తుందని భావించడం లేదు. ప్రభుత్వపు నిర్మాణాత్మక సంస్కరణల ప్రక్రియ కొనసాగుతుంది’ అని చెప్పారు. జీఎస్టీ అమలుకు బిహార్ మద్దతునిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఇప్పటికే తమ ప్రభుత్వం బిహార్‌కు ఆర్థిక ప్యాకేజ్‌ను ప్రకటించిందని పేర్కొన్నారు.
రాష్ట్రాల అభివృద్ధికి తామెప్పుడూ చేయూతనందిస్తామని తెలిపారు. ప్రభుత్వం జీఎస్టీ రూపకల్పనకు సంబంధించిన సలహాల స్వీకరణకు తలుపులు తెరచే ఉంద ని చెప్పారు. జీఎస్టీ రేటు సాధ్యమైనంత తక్కువ స్థాయిలోనే ఉంటుందన్నారు. మోదీ తన బీజేపీ సభ్యులను నియంత్రణలో ఉంచుకోవాలని, లేని పక్షంలో ప్రజల విశ్వసనీయతను కోల్పోయే ప్రమాదం ఉందన్న మూడీస్ విశ్లేషణతో జైట్లీ ఏకీభవించలేదు. ప్రపంచంలోనే భారత్ సహనమున్న, స్వేచ్ఛాయుత సమాజమని, ఎక్కడో ఏదో ఒక ఘటన జరిగితే దాని ఆధారంగా భారత్‌ను అసహన దేశంగా చూడటం తగదన్నారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశంలో పాలనా సంస్కృతిని మార్చిందన్నారు. భవిష్యత్తులో తలెత్తే రాజకీయ సమస్యలపై అవగాహన ఉందని, వాటిని పరిష్కరించుకుంటూ ముందకు వెళ్తామని తెలిపారు.