పొరుగుదేశ పౌరులూపొగిడేలా...
నేడు డాక్టర్స్ డే
డాక్టర్ ఈసీ వినయకుమార్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అండ్
సీనియర్ కన్సల్టెంట్ ఆఫ్ ఈఎన్టీ, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్
‘‘నా 30 ఏళ్ల వైద్యవృత్తిలో ఎన్నెన్నో అనుభవాలూ, మరెన్నో జ్ఞాపకాలు. సాధారణంగా చేసే వైద్యం ఒకవిధమైన వృత్తిగత తృప్తినిస్తే... సేవాదృక్పథంతో చేసే చికిత్స మరింత వ్యక్తిగత సంతృప్తినిస్తుంది. ఈ తరహా సంతృప్తిని నాకు ఇచ్చింది అపోలో హాస్పిటల్ యాజమాన్యం సహాయంతో నా మిత్రులందరితో కలిసి మేం ప్రారంభించిన సొసైటీ టు ఎయిడ్ ద హియరింగ్ ఇంపెయిర్డ్ (సాహీ).
వినికిడి సమస్య కారణంగా భాష తెలుసుకోలేక, చెవిటిదనంతో పాటూ మూగదనాన్ని కూడా తోడుతెచ్చుకునే చిన్నారులను ఒకే వైద్యంతో అటు వినికిడి వచ్చేలా, ఇటు మాట తెచ్చేలా చేసే చికిత్సా, సహాయం నాకు అందించే సంతృప్తిని మాటల్లో చెప్పలేను. సాహి ద్వారా ఖర్చులు భరించలేని దాదాపు 10,000 మందికి వినికిడినీ, మాటనూ తెప్పించగలిగినందుకు ఎంతో ఆనందం, వాళ్లు చూపించే కృతజ్ఞతలకు మరెంతో సంతోషం. అన్నిటికంటే ముఖ్యంగా ఒక సంఘటన అటు వృత్తిగతంగానూ, ఇటు వ్యక్తిగతంగానూ నాకెంతో సంతృప్తినిచ్చింది.
పాకిస్థాన్ నుంచి రెండేళ్ల చిన్నారిని వాళ్ల నాన్న మామీద నమ్మకంతో ఇక్కడకు తెచ్చారు. ఆ పాపకు ఆపరేషన్ చేసి వినికిడి, మాటలూ వచ్చేలా చేశాం. అప్పుడా తండ్రి చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తొస్తుంటాయి. ‘‘భారతదేశానికి భయపడుతూ వచ్చాను. శత్రుదేశానికి వెళ్తున్నావంటూ నా స్నేహితులు హెచ్చరిస్తూ పంపారు. మనల్ని బద్ధ్దశత్రువులుగా పరిగణించే అక్కడి ప్రజలు నిన్నెలా చూస్తారో అంటూ భయపెట్టారు. కానీ ఎంతో భయంతో వచ్చిన నన్ను ఇక్కడి ప్రజలు ఆదరించారు.
నా కుటుంబ సభ్యులకు ఆదరణ, భరోసా ఇచ్చారు. వెద్యులు మంచి చికిత్స అందించారు. ఆర్థికతోడ్పాటూ ఇచ్చారు. నా అపోహలన్నీ తొలగిపోయాయి. భారతీయులు ఎంతటి ప్రేమాస్పదులో అర్థమైంది. ఇక్కడి వారి ప్రేమను గురించి మాదేశంలో ప్రజలందరికీ ఎలుగెత్తి చెబుతా. మీలాంటి వైద్యులను కలవడం నాకు ఆ అల్లాహ్ చూపిన మార్గం’’ అంటూ వెళ్లాడు ఆ తండ్రి. అప్పుడనిపించింది నాకు... క్రీడలూ క్రీడాకారులే కాదు... వైద్యచికిత్స, డాక్టర్లు కూడా సౌహార్దరాయబారులే, సౌశీల్య హృదయధారులే అని.