కేసు వాయిదా!
సాక్షి, చెన్నై: సీఎం జయలలిత, ఆమె నెచ్చెలి శశికళపై దాఖలైన ఆదాయ పన్ను ఎగవేత కేసు విచారణ మళ్లీ వాయిదా పడింది. ఈ కేసు విచారణకు మరింత సమయం కావాలంటూ ఎగ్మూర్ కోర్టు సుప్రీం కోర్టుకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను ఈనెల 18కి న్యాయమూర్తి వాయిదా వేశారు. అన్నాడీఎంకే అధినేత్రి, రాష్ట్ర మ్యుమంత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళపై దాఖలైన ఆదాయ పన్ను ఎగవేత కేసు విచారణ మళ్లీ వాయిదా పడింది. వీరు 1991-92,-93 సంవత్సరానికి గాను ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయలేదు. అలాగే 1993-94కు గాను జయలలిత, శశికళలు వ్యక్తిగతంగా తమ ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయలేదు. దీన్నిగుర్తించిన డీఎంకే సర్కారు కేసులు నమోదు చేసింది. ఏళ్ల తరబడి చెన్నై ఎగ్మూర్ ప్రధాన మేజిస్టేట్ కోర్టు ఆవరణలోని ఆర్థిక నేరాల విచారణ కోర్టులో సాగుతూ వస్తోంది. వాయిదాల మీద వాయిదాలతో సాగుతూ వస్తున్న ఈ విచారణ ఇటీవల మలుపు తిరిగింది. ఆదాయ పన్ను శాఖతో సామరస్య పూర్వంగా సమస్యను పరిష్కరించుకుంటామని జయలలిత, శశికళ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఇందుకు గాను అవకాశాన్ని ఎగ్మూర్ కోర్టు న్యాయమూర్తి దక్షిణా మూర్తి ఇచ్చారు.
మళ్లీ వాయిదా
సామరస్య పూర్వ పరిష్కారంతో ఈ విచారణ ఇక ముగిసినట్టేనని సర్వత్రా భావించారు. అయితే గురువారం ఈ కేసు విచారణకు రాగా, మరింత సమయం కావాలంటూ జయలలిత, శశికళ తరపు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. ఇందుకు ఆదాయపన్ను శాఖ తరపు న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. వాయిదాల మీద వాయిదాలతో మరింత జాప్యం చేస్తున్నారని న్యాయమూర్తికి వివరించారు. మరింత సమయం ఇవ్వకూడదని పట్టుబట్టారు. ఈ కేసును ముగించాలంటూ సుప్రీంకోర్టు విధించిన గడువు శనివారంతో ముగియనున్నదని వివరించారు. చివరకు న్యాయమూర్తి దక్షిణా మూర్తి జోక్యం చేసుకుని, మరింత సమయం కావాలంటూ సుప్రీం కోర్టు లేఖ రాసి ఉన్నట్టు, రెండు నెలలు సమయం కోరి ఉన్నామని, ఇందుకు సంబంధించిన ఆదేశాలు రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ దృష్ట్యా, తదుపరి విచారణ ఈ నెల 18న జరుగుతుందని, ఆ రోజు జరిగే విచారణకు జయలలిత, శశికళ నేరుగా కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని ప్రకటిస్తూ వాయిదా వేశారు.