పడగెత్తిన ఎల్నినో!
ఈసారి రుతుపవనాల రాక ఆలస్యం..
వర్షాలూ అంతంతే: స్కైమెట్ అంచనా
► వర్షపాతం సాధారణం కంటే తక్కువే
► ఎల్నినో పరిస్థితులకు 50 శాతం అవకాశం
► మండిపోనున్న ఎండలు.. రానున్న 2 నెలలూ భగభగలే
► చుక్కలు చూపనున్న మే.. 45 డిగ్రీల దాకా నమోదయ్యే చాన్స్
► ఎండలకు రాష్ట్రంలో 8 మంది మృతి
సాక్షి, హైదరాబాద్
మేలో దంచికొట్టాల్సిన ఎండలు ఏప్రిల్లోనే ఠారెత్తిస్తున్నాయి.. నెల రోజుల ముందుగానే మండిపోతున్నాయి.. ఈసారి రికార్డు స్థాయిలో హీటెక్కిస్తాయన్న సంకేతాలూ వెలువడుతున్నాయి.. మరి వానల సంగతేంటి? మంచి వర్షాలే ఉంటాయని అంతా చెబుతున్నా వాతావరణ నిపుణుల తాజా అంచనాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఈసారి ఎల్నినో ముప్పు పొంచి ఉందని, ఫలితంగా ‘చల్లని’కబురు లేటుగా అందుతుందని పేర్కొంటున్నారు. అంతేకాదు జూన్–సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని స్పష్టంచేస్తున్నారు. వాతావరణ పరిశోధన సంస్థ స్కైమెట్తోపాటు నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ తాజా అధ్యయనంలో ఇదే విషయం తేలింది. పసిఫిక్ మహాసముద్రం ఉపరితలం వేడెక్కి సముద్రం మీదుగా వీచే పవనాలు గతి తప్పడంతో వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకుంటాయి. దీన్నే ఎల్నినోగా వ్యవహరిస్తారు. దీని ప్రభావంతో వేసవిలో ఎండలు మండి పోవడం, అకాల వర్షాలు, రుతుపవనాల్లో జాప్యం వంటి విపరిణామాలు చోటుచేసుకుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఖరీఫ్ పంటలకు ఇబ్బందేనా?
రుతుపవనాలు సాధారణంగా జూన్ 1న కేరళ తీరాన్ని తాకి క్రమంగా దేశమంతా విస్తరిస్తాయి. ఈ సమయంలో మంచి వర్షాలు కురిస్తేనే ఖరీఫ్ సాగు జోరుగా సాగుతుంది. రుతుపవనాల రాక ఆలస్యమైనా, తగినన్ని వర్షాలు లేకపోయినా పంటల సాగు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈసారి రుతుపవనాలు ఆలస్యంగా రావడంతోపాటు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందన్న స్కైమెట్ అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ‘‘ఎల్నినో ఏర్పడితేనే వర్షాలు కురవవని చెప్పలేం. పరిస్థితులు ఎల్నినో ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నా కరువు ఏర్పడుతుంది. 2014లో ఇదే జరిగింది. ఆ ఏడాది ఎల్నిలో లేదు కానీ వర్షాలు చాలా తక్కువగా కురిసి కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈసారి ఎల్నినో ఏర్పాటుకు 50 శాతం పరిస్థితులకు అనుకూలంగా ఉన్నాయి. దీంతో జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో తక్కువ వర్షాలు పడొచ్చు’’అని స్కైమెట్ అధినేత జతిన్ సింగ్ పేర్కొన్నారు.
ఎండ ప్రచండమే..
రాష్ట్రంలో ఏప్రిల్ రెండో వారంలోనే 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. మరో 60–70 రోజులపాటు పగటి ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్లో సాధారణంగా మే నెలలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. గతంలో ఏప్రిల్లో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఒకటి లేదా రెండురోజులు మాత్రమే నమోదైన దాఖలాలున్నాయి. కానీ ఈసారి అందుకు భిన్నంగా ఇప్పట్నుంచే ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్లో 1973 ఏప్రిల్ 30న అత్యధికంగా 43.3 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రత నమోదవడం ఇప్పటివరకు రికార్డు. ఈసారి ఈ రికార్డు బద్దలయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. మే నెలలో గరిష్టంగా 44–45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
రామగుండం, నిజామాబాద్లలో 42.4 డిగ్రీలు
ఆదివారం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ 40 డిగ్రీలకు మించి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండం, నిజామాబాద్లలో 42.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. ఆదిలాబాద్లో 42, మహబూబ్నగర్లో 41.5, మెదక్లో 41.6, భద్రాచలంలో 41.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం, హైదరాబాద్, హన్మకొండ, నల్లగొండల్లో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం కొన్నిచోట్ల సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, మరికొన్నిచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
వడదెబ్బతో 8 మంది మృతి
సాక్షి, నెట్వర్క్: ఎండ వేడిమికి తాళలేక ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 8 మంది చనిపోయారు. వనపర్తి జిల్లాలో ముగ్గురు, నల్లగొండ జిల్లాల్లో ముగ్గురు మహబూబ్నగర్ జిల్లాలో ఒకరు, నాగర్కర్నూల్ జిల్లాలో ఒకరు మరణించారు.
గత పదేళ్లుగా ఏప్రిల్ నెలలో గ్రేటర్ హైదరాబాద్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలివీ..
సంవత్సరం తేదీ ఉష్ణోగ్రత
2016 14 43
2015 30 40.6
2014 29 40.3
2013 30 40.6
2012 30 40.5
2011 29 40.4
2010 16 42.7
2009 30 41.9
2008 30 41.6
2007 30 41.1
ఇప్పటివరకు రికార్డు..1973 ఏప్రిల్ 30: 43.3 డిగ్రీలు
వర్షాలపై స్కైమెట్ అంచనా ఇదీ..
పరిస్థితి శాతం
అధిక వర్షపాతానికి అవకాశం – 0
సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం – 10
సాధారణ వర్షపాతం – 50
సాధారణం కంటే తక్కువ వర్షపాతం – 25
కరువు పరిస్థితులు – 15