elamanchili
-
పారిశ్రామికవాడలో సాధికార నినాదం
సాక్షి, అనకాపల్లి: పారిశ్రామికవాడలో సామాజిక సాధికారత నినాదం మార్మోగింది. సోమవారం అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు విజయ యాత్ర చేశారు. ఈ యాత్రకు వేలాదిగా తరలివచ్చిన ఈ వర్గాల ప్రజలు సీఎం వైఎస్ జగన్ పాలనలో తమకు లభించిన ప్రాధాన్యతను, రాజ్యాధికారం పొందిన వైనాన్ని ప్రజలకు వివరిస్తూ నియోజకవర్గం మొత్తం కలియదిరిగారు. ఈ యాత్రతో యలమంచిలి–అచ్యుతాపురం రహదారి జనంతో కిక్కిరిసిపోయింది. జగన్ నామస్మరణతో ఊరూవాడా మార్మోగాయి. అచ్యుతాపురంలో సభ జరిగిన క్రీడా మైదానం నిండిపోవడంతో పాటు యలమంచిలి రోడ్డు, పూడిమడక రోడ్డు జనంతో నిండిపోయాయి. సాయంత్రం చల్లబడి చిన్న పాటి చినుకులు పడడంతో ఆహ్లాదకర వాతావరణంలో సభ జరిగింది. మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో సామాజిక సాధికారత సాధించిన వైనాన్ని వివరించినప్పుడు ప్రజలు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. పేదల బతుకులు మార్చిన సీఎం జగన్ : మంత్రి ధర్మాన సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో ప్రతి పేదవాడికీ మేలు చేస్తూ వారి బతుకులను మారుస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. రామరాజ్యాన్ని మించి జగనన్న రాజ్యాన్ని తీసుకొచ్చారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అనేక సంక్షేమ పథకాలు అందించారని తెలిపారు. ఈ వర్గాలకు చట్టసభల్లో అవకాశం కల్పించారని, కేబినెట్లో 17 కీలక మంత్రి పదవులు ఇచ్చి దేశ చరిత్రలోనే ఏ సీఎం చేయని విధంగా సామాజిక న్యాయం చేశారని అన్నారు. బడుగుల కుటుంబాలన్నీ ఆర్థికంగా బలపడ్డాయని, ఇది కాదా సామాజిక న్యాయం అని ప్రశ్నించారు. సంక్షేమ పథకాల పేరిట డబ్బు వృథా చేస్తున్నారని అన్న ప్రతిపక్షనేత చంద్రబాబు ఇప్పుడు అంతకు రెట్టింపు పథకాలు ఇస్తానంటున్నాడని, ఆయన మాయమాటలను నమ్మకుండా అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో పేదోడు ఎదిగాడు: ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు సీఎం జగన్ పాలనలో బడుగు, బలహీన వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో సామాజిక సాధికారత తీసుకొచ్చారన్నారు. సీఎం జగన్ బడుగు బలహీనర్గాలకు చెందిన నలుగురికి ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించారన్నారు. రాజ్యసభకు నలుగురు బీసీలను పంపించారన్నారు. అనేక మందిని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేశారని, నామినేటెడ్ పదవుల్లోనూ ఈ వర్గాలకే పెద్ద పీట వేశారని చెప్పారు. చంద్రబాబు పాలనలో సామాజిక న్యాయమనే పదమే రాలేదని చెప్పారు. మహిళా సాధికారత మరువరానిది: ఎంపీ సత్యవతి అనకాపల్లి ఎంపీ సత్యవతి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ సంక్షేమ రాజ్యాన్ని స్థాపించారని, విద్య, వైద్యంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారని చెప్పారు. మహిళా సాధికారత తీసుకొచ్చారని చెప్పారు. సంక్షేమ పథకాల లబ్ధిని మహిళల ఖాతాల్లోనే జమ చేస్తున్నారన్నారు. జెట్టీల నిర్మాణంతో మత్స్యకారులకు మహర్దశ: ఎమ్మెల్యే రమణమూర్తిరాజు యలమంచిలి ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు (కన్నబాబురాజు) మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమమే సీఎం వైఎస్ జగన్ లక్ష్యమని చెప్పారు. మత్స్యకారుల కోసం రాష్ట్రంలో కొత్తగా 8 జెట్టీలు నిర్మిస్తున్నారని, వాటిలో రూ.397 కోట్లతో నిర్మిస్తున్న అచ్యుతాపురం జెట్టీ కూడా ఒకటన్నారు. దాదాపు 950 పడవలు వేటకు వెళ్లేలా జెట్టీ ఉంటుందని, జిల్లాలోని మత్స్యకారులంతా వేటాడుకున్నా సరిపోయేంత పెద్దగా ఉంటుందన్నారు. పనులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు. ఆనాడు వైఎస్సార్ తీసుకొచ్చిన పారిశ్రామిక సెజ్ కారణంగా ఈ ప్రాంతవాసులు ఆర్థికంగా బలోపేతమయ్యారని, 2 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభించాయని చెప్పారు. ఇప్పుడు వైఎస్ జగన్ సెజ్లను బలోపేతం చేసి, కొత్త పరిశ్రమలు తెస్తున్నారని, వీటి ద్వారా లక్షలాది ఉద్యోగాలు కొత్తగా వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నవరత్నాల వైస్ చైర్మన్ నారాయణమూర్తి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
బైకు ప్రమాదంలో యువతి మృతి
యలమంచిలి రూరల్ : జాతీయ రహదారిపై పెదపల్లి జంక్షన్ సమీపంతో బైక్ అదుపు తప్పి బోల్తా పడిన సంఘటనలో యువతి మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. కొత్తవలస మండలం యర్రవానిపాలెం గ్రామానికి చెందిన దుంగా రమేష్, లావణ్య(20) తెల్లవారుజామున బయలుదేరి అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకొని తిరుగు ప్రయాణంలో పెదపల్లి వద్ద బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడ్డ వారిని 108 సిబ్బంది, జాతీయ రహదారి సిబ్బంది అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లావణ్య మృతి చెందినట్టు యలమంచిలి టౌన్ ఎస్ఐ నీలకంఠరావు తెలిపారు. రమేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ తరలించారు. -
ఘనంగా రామచంద్రమ్మ జాతర
యలమంచిలి రూరల్: యలమంచిలిలో రామచంద్రమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. అ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భారీ అన్నసమారాధన ఏర్పాటు చేశారు. పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. బాణసంచా కాల్చారు. ఘనంగా యల్లమ్మ తల్లి పండుగ మునగపాక: మండల కేంద్రంలో యల్లమ్మతల్లి అమ్మవారి పండగ ఘనంగా జరిగింది. మావూరి, బూడిద కుటుంబాలకు చెందిన వారంతా రెండేళ్లకొకసారి ఈ పండగ జరుపుకుంటారు. ఈ ఏడాది భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఘనంగా సాయిబాబా సప్తాహం మునగపాక: స్థానిక సాయిబాబా మందిరంలో సప్తాహ కార్యక్రమం గురువారం ఘనంగా ప్రారంభమైంది. సాయినామ స్మరణతో మునగపాక మార్మోగింది. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణంలో సాయి కీర్తనలు ఆలపించారు. ఆలయ చైర్మన్ బొడ్డేడ వీరేంద్ర ఆధ్వర్యంలో కార్యక్రమలం నిర్వహించారు. పూడిమడకలో మహోత్సవాలు ప్రారంభం అచ్యుతాపురం(అనకాపల్లి): పూడిమడక అమ్మవారి మహోత్సవాలు గురువారం మొదలయ్యాయి. జూన్ 2వ తేదీ వరకు గంటాలమ్మతల్లి, దుర్గాలమ్మ తల్లి, సత్తెమ్మతల్లి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్టు స్థానికుడైన పోలవరపు పారునాయుడు తెలిపారు. -
హాకీ జాతీయ జట్టులో యలమంచిలి క్రీడాకారిణి
యలమంచిలి రూరల్: విశాఖ జిల్లాలో హాకీ క్రీడకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే పట్టణం యలమంచిలి.. ఈ ప్రాంతానికి చెందిన క్రీడాకారిణి జాతీయ జట్టుకు ఎంపికై పుట్టిన ఊరు ఖ్యాతిని ఇనుమడింపజేసింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన మడగల భవాని భారత మహిళల హాకీ టీంకు ఎంపికైంది. త్వరలో ప్రారంభం కానున్న ఐర్లాండ్ టూర్లో పాల్గొననుంది. బాబూరావు, వరలక్ష్మి దంపతుల ముద్దుల కుమార్తె భవాని యలమంచిలి క్రీడామైదానంలో సాధన చేసి అంచలంచెలుగా ఎదిగింది. మండలస్థాయి.. ఆపై జిల్లాస్థాయిలో రాణించిన ఆమె ఏపీ తరపున సబ్ జూనియర్ హాకీ క్రీడలో పాల్గొని 2019లో ఢిల్లీ అకాడమీకి ఎంపికయింది. అక్కడ కూడా రాణించి ఇప్పుడు ఏకంగా ఇండియా హాకీ టీంలో స్థానం సంపాదించిందని పట్టణ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు కొటారు నరేష్, ఏపీ అసోసియేషన్ కార్యదర్శి హర్షవర్ధన్ తెలిపారు. వెటరన్స్ అడుగుజాడల్లో.. మా ఇంటి ముందు క్రీడా మైదానంలో చాలామంది హాకీ ఆడేవారు. వారిని చూసి నాకూ ఆసక్తి కలిగింది. 11 ఏళ్ల వయసులో హాకీ స్టిక్ పట్టాను. అప్పట్లో సరిగా ఆడలేకపోయేదాన్ని. హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు కొటారు నరేష్ వద్ద ప్రత్యేక శిక్షణ పొందా. ఆయన శిక్షణలో ఈ స్థాయికి చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది. – మడగల భవాని -
సీఎం జగన్కు కృతజ్ఞతలు: విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని భారతదేశంలో అతిపెద్ద కార్యక్రమంగా నిలిపినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం యలమంచిలిలో ఆయన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'యలమంచిలి నియోజకవర్గంలో 7,200 ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు చేస్తున్న కార్యక్రమాలు అనిర్వచనీయం. ఇలాంటి ముఖ్యమంత్రి మరో 25 సంవత్సరాలు ఉండాలని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలి. సీఎం మహిళా పక్షపాతిగా నిరూపించుకుంటూ వారి ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడుతున్నారు. అవినీతి లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు' అని విజయసాయిరెడ్డి అన్నారు. చదవండి: ('పుత్రరత్నం కోసం ఏ ఉన్మాద చర్యకైనా సిద్ధమే') -
స్కూల్లో విద్యుత్ షాక్... విద్యార్థిని మృతి
ఎలమంచిలి: పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం విలపకుర్రు హైస్కూల్లో విద్యుత్ షాక్కు గురై ఆరో తరగతి విద్యార్థిని మృతి చెందింది. చింతదిబ్బ గ్రామానికి చెందిన విద్యార్థిని మౌనిక సోమవారం ఉదయం స్కూల్ ఆవరణలోని నీటి ట్యాంక్ వద్దకు వెళ్లగా ఎర్త్వైర్ తగలడంతో విద్యుత్ షాక్కు గురైంది. స్థానికులు హుటాహుటిన ఆమెను పాలకొల్లులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.