
యలమంచిలి రూరల్: విశాఖ జిల్లాలో హాకీ క్రీడకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే పట్టణం యలమంచిలి.. ఈ ప్రాంతానికి చెందిన క్రీడాకారిణి జాతీయ జట్టుకు ఎంపికై పుట్టిన ఊరు ఖ్యాతిని ఇనుమడింపజేసింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన మడగల భవాని భారత మహిళల హాకీ టీంకు ఎంపికైంది. త్వరలో ప్రారంభం కానున్న ఐర్లాండ్ టూర్‌లో పాల్గొననుంది.
బాబూరావు, వరలక్ష్మి దంపతుల ముద్దుల కుమార్తె భవాని యలమంచిలి క్రీడామైదానంలో సాధన చేసి అంచలంచెలుగా ఎదిగింది. మండలస్థాయి.. ఆపై జిల్లాస్థాయిలో రాణించిన ఆమె ఏపీ తరపున సబ్ జూనియర్ హాకీ క్రీడలో పాల్గొని 2019లో ఢిల్లీ అకాడమీకి ఎంపికయింది. అక్కడ కూడా రాణించి ఇప్పుడు ఏకంగా ఇండియా హాకీ టీంలో స్థానం సంపాదించిందని పట్టణ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు కొటారు నరేష్, ఏపీ అసోసియేషన్ కార్యదర్శి హర్షవర్ధన్ తెలిపారు.
వెటరన్స్ అడుగుజాడల్లో..
మా ఇంటి ముందు క్రీడా మైదానంలో చాలామంది హాకీ ఆడేవారు. వారిని చూసి నాకూ ఆసక్తి కలిగింది. 11 ఏళ్ల వయసులో హాకీ స్టిక్ పట్టాను. అప్పట్లో సరిగా ఆడలేకపోయేదాన్ని. హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు కొటారు నరేష్ వద్ద ప్రత్యేక శిక్షణ పొందా. ఆయన శిక్షణలో ఈ స్థాయికి చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది.
– మడగల భవాని
Comments
Please login to add a commentAdd a comment