Electronic bus
-
5 నుంచి రోడ్డెక్కనున్న ‘విద్యుత్’ బస్సులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో నూటికి నూరు శాతం విద్యుత్‌తో నడిచే ఎలక్ట్రిక్ బస్సులు మరో రెండు రోజుల్లో రోడ్డెక్కనున్నాయి. ఏమాత్రం కాలుష్యం వెదజల్లకపోవడం ఈ బస్సుల ప్రత్యేకత. ఈ బస్సులను గ్రేటర్ పరిధిలో ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదట మియాపూర్ డిపో నుంచి 20 బస్సులను, ఆ తరువాత కంటోన్మెంట్ డిపో నుంచి మరో 20 బస్సులను ప్రవేశపెట్టనుంది. ఈ నెల 5న ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేపట్టింది. ఎలక్ట్రిక్ బస్సులు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించనున్నాయి. ఈ మేరకు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్, సిద్ధార్ధ, డీవైడీ సంస్థలతో కూడిన కన్సార్షియంతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం 12 సంవత్సరాలపాటు అమల్లో ఉంటుంది. ఒప్పందం మేరకు బస్సుల నిర్వహణ పూర్తిగా కన్సార్షియం పరిధిలో ఉంటుంది. ఈ బస్సులను కన్సార్షియం డ్రైవర్లే నడుపుతారు. విద్యుత్ చార్జింగ్ మాత్రం ఆర్టీసీ డిపోల నుంచి అందజేస్తారు. ఈ బస్సులకు కిలోమీటర్‌కు రూ. 36 చొప్పున ఆర్టీసీ చెల్లించనుంది. జేఎన్టీయూ, కూకట్పల్లి, హరిత ప్లాజా, మైత్రీవనం, మెహదీపట్నం, పీవీ ఎక్స్‌ప్రెస్ వే, ఆరాంఘర్ తదితర ప్రాంతాల మీదుగా ఈ బస్సులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తాయి. కంటోన్మెంట్ డిపో నుంచి నడిచే బస్సులు సికింద్రాబాద్, జూబ్లీ బస్‌స్టేషన్, సంగీత్ చౌరస్తా, తార్నాక, ఉప్పల్, చాంద్రాయణగుట్ట తదితర ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్తాయి. ఒకసారి చార్జింగ్ చేస్తే తిరిగే దూరం: 250-300 కి.మీ. ఒక కిలోమీటర్‌కు ఆర్టీసీ చెల్లించనున్న మొత్తం: రూ. 36 వీడిన పీటముడి.... హైదరాబాద్‌లో బ్యాటరీ ఆధారిత ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు ప్రభుత్వం గత సంవత్సరమే ప్రణాళికలు రూపొందించింది. విశ్వనగర ప్రమాణాలకు అనుగుణంగా అత్యాధునిక సదుపాయంగల రవాణా సదుపాయాలను ప్రతిపాదించారు. అద్దె ప్రాతిపదికన బస్సులు నడిపేందుకు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ముందుకు వచ్చింది. గతేడాది సెప్టెంబర్‌లోనే 5 బస్సులను విడుదల చేశారు. కానీ అప్పటికి ఇంకా ఆర్టీసీతో ఒప్పందం కుదుర్చుకోలేదు. కన్సార్షియంలోని వివిధ సంస్థల మధ్య అవగాహన కుదరకపోవడం వల్ల ఆర్టీసీతో ఒప్పందం వాయిదా పడింది. దీంతో నగరంలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రాజెక్టుపై పీటముడి ఏర్పడింది. అప్పటి వరకు వివిధ డిపోల నుంచి ఈ బస్సులను నడిపేందుకు కార్యాచరణ సిద్ధం చేసిన ఆర్టీసీ సైతం గందరగోళంలో పడిపోయింది. చివరకు కన్సార్షియంలోని మూడు భాగస్వామ్య సంస్థలైన సిద్ధార్ధ, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్, చైనాకు చెందిన డీవైడీ సంస్థలు పరస్పర అవగాహనకు రావడంతో ఆర్టీసీతో ఒప్పందానికి మార్గం సుగమమైంది. ఈ బస్సులపై కన్సార్షియంతోపాటు ఆర్టీసీ యాజమాన్యానికీ హక్కు ఉంటుంది. రవ్వంత కాలుష్యానికి సైతం అవకాశం లేకుండా విద్యుత్‌తో నడిచే ఈ బస్సులను ఒకసారి చార్జింగ్ చేస్తే 250 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల వరకు రాకపోకలు సాగిస్తాయి. ఇప్పుడు ఉన్న మెట్రో లగ్జరీ బస్సుల స్థానంలో ఈ అత్యాధునిక బస్సులను నడుపుతారు. పూర్తయిన డ్రైవర్ల శిక్షణ... ఎలక్ట్రిక్ బస్సులను నడిపే డ్రైవర్లకు ఆర్టీసీ ప్రత్యేక శిక్షణనిచ్చింది. బస్సులు నడిపేటప్పుడు మెళకువలు పాటించడంతోపాటు టికెట్ ఇష్యూ మిషన్ల వినియోగం, ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యహరించడం వంటి అంశాలపై శిక్షణనిచ్చారు. ప్రస్తుతం మియాపూర్ డిపో నుంచి ప్రారంభం కానున్న ఈ బస్సుల కోసం ఆ డిపోలో ఒక విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌తోపాటు 12 చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ డిపోలో కొత్త ట్రాన్స్ఫార్మర్ అందుబాటులోకి వచ్చినప్పటికీ ఇంకా చార్జింగ్ పాయింట్ల ఏర్పాటు పూర్తి కాలేదు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే విద్యుత్ కనెక్షన్ ఇచ్చి ఆ డిపో నుంచి మరో 20 బస్సులను నడుపుతారు. -
ఎలక్ట్రిక్ బస్సులు తొలుత ఇక్కడేనా?
సాక్షి, బిజినెస్ బ్యూరో: చిన్న, చిన్న సమస్యలు తొలగిపోతే పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సుల్ని నడుపుతున్న తొలి రాష్ట్రమనే గౌరవం తెలంగాణకే దక్కనుంది. ఎందుకంటే దేశంలో ‘ఎలక్ట్రిక్ మొబిలిటీని వేగంగా అందిపుచ్చుకునే పథకం(ఎఫ్‌ఏఈఎం)’అర్హత పొందిన 10 రాష్ట్రాల్లో ప్రస్తుతానికి పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇన్ఫ్రాను సమకూర్చుకున్నది తెలంగాణ ఒక్కటే. ఇక్కడ మాత్రమే పూర్తిస్థాయిలో బస్సులు, చార్జింగ్ వ్యవస్థ, దానికి కావాల్సిన విద్యుత్ సదుపాయాలు సిద్ధమయ్యాయి. అశోక్ లేలాండ్ చేజిక్కించుకున్న గుజరాత్‌లోగానీ, టాటాలు దక్కించుకున్న మరో 4 రాష్ట్రాల్లోకానీ ఈ వ్యవస్థ ఇంకా సిద్ధం కాలేదు. ఎఫ్‌ఏఈఎం పథకంలో భాగంగా హైదరాబాద్, బెంగళూరు, ముంబైలో ఎలక్ట్రిక్ బస్సుల్ని నడిపే అవకాశం ఇక్కడి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ సంస్థకు దక్కింది. ఈ మేరకు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకున్న ఒలెక్ట్రా.. టీఎస్ఆర్టీసీకి ఇప్పటికే 40 బస్సుల్ని సరఫరా చేసింది. వీటి కోసం హైదరాబాద్‌లోని మియాపూర్, జుబ్లీ బస్టాండ్లలో చార్జింగ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లను కూడా ఏర్పాటు చేసింది. మియాపూర్ డిపోలో ఇప్పటికే ట్రయల్ రన్ మొదలుకాగా జుబ్లీ బస్టాండ్‌లో మాత్రం ఇంకా కరెంటు సదుపాయం అందకపోవటంతో ఈ బస్సులు పరుగుకు నోచుకోవటం లేదు. ఒక్కసారి చార్జ్ చేస్తే 300 కి.మీ. టీఎస్ఆర్టీసీకి ఒలెక్ట్రా సరఫరా చేసిన బస్సుల సైజు కాస్త పెద్దది. దీనిలో ఏసీతోపాటు అత్యాధునిక వీడియో రికార్డింగ్, దూరం–సమయాన్ని కలిపి లెక్కించుకుని ఎప్పుడు, ఎక్కడికి వెళ్తుందో చెప్పగల వ్యవస్థ ఉంది. దివ్యాంగుల కోసం వీల్‌చెయిర్ వంటి సౌకర్యాలూ ఉన్నాయి. ఒకసారి చార్జ్ చేస్తే 300 కిలోమీటర్ల వరకూ తిరుగుతాయి. నిజానికి 400 కిలోమీటర్ల వరకూ తిరుగుతాయని, కానీ నగరంలో నెలకొన్న పరిస్థితుల్లో 300 మాత్రమే లెక్క వేస్తున్నామని ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ప్రతినిధితో ఒలెక్ట్రా అధికారి ఒకరు చెప్పారు. కిలోమీటర్‌కు అయ్యే చార్జీ తక్కువ కనక ఈ 40 బస్సుల వల్ల ఏడాదికి రూ.40 కోట్ల వరకూ ఆదా అయ్యే అవకాశముందని ఆర్టీసీ వర్గాలు చెప్పాయి. ఈ బస్సులతోపాటు మినీబస్సులను కూడా ఒలెక్ట్రా తయారు చేస్తోంది. ఒకసారి ఎలక్ట్రిక్ మొబిలిటీ అంటూ నగరంలో మొదలైతే అది కాలుష్య నియంత్రణకు ఉపకరించటంతో పాటు మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలు తిరగడానికి దారులు వేస్తుందన్నది ప్రయాణికుల భావన. -
‘ఈ’ బస్సు చాలా స్పెషల్ !
అధునాతనం: మనదేశంలో ఏదైనా కొత్తగా వస్తే అది ప్రపంచంలో బాగా పాపులర్ అనుకుంటాం. నిజానికి చాలా పెద్ద దేశాల్లోనూ ఈ-బస్సు లాంటివి ఇంకా ఇపుడిపుడే మొదలువుతున్నాయి! బైకు మీద రయ్యిన దూసుకెళ్తుంటాం. కాస్త స్లో చెయ్యగానే పక్క నుంచి సిటీ బస్సు ఓవర్టేక్ చేస్తుంది. సరిగ్గా మనం బస్సు వెనుకభాగంలో ఉంటాం. డ్రైవర్ మరింత వేగం పెంచుతాడు. అప్పుడు ఆ బస్సు గుప్పుమంటూ వదిలే పొగ మన ముఖాన్ని మాడ్చేసి, ఒక్క నిమిషం ఊపిరిసలపకుండా చేస్తుంది... ఇలాంటి బస్సులు ఒకటా రెండా? వేలల్లో ఉంటాయి. అవన్నీ వదిలే పొగకు నగరం ఏమవ్వాలి? వాతావరణం ఎంతగా కాలుష్యం కావాలి? ఇలాగే ఆందోళన చెందిన బెంగళూరు నగర రోడ్డు రవాణా సంస్థ.. ఎలక్ట్రానిక్ బస్సును రోడ్డుపైకి తెచ్చింది. పొగ లేదు.. శబ్దం లేదు.. కుదుపుల్లేవు.. సుఖవంతమైన ప్రయాణం. డీజిల్ పోయక్కర్లేదు. నిర్వహణ ఖర్చు తక్కువ. ఇలా ఎన్నో ప్రత్యేకతలు. రోడ్డు రవాణా వ్యవస్థకు సంబంధించి ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా అందిపుచ్చుకోవడంలో కర్ణాటక ముందుంటుందన్నది తెలిసి విషయమే. దేశంలో ముందుగా వోల్వో బస్సులను ప్రవేశపెట్టిన రాష్ట్రాల్లో అది ఒకటి. సిటీలో ఏసీ బస్సుల్ని నడపడం కూడా కర్ణాటక ముందుగా చేసి చూపించింది. ఇపుడు దేశంలోనే తొలి ఎలక్ట్రానిక్ బస్సును ప్రవేశపెట్టింది. నగరంలో వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థితికి చేరుకుంటున్న నేపథ్యంలో బీఎంటీసీ చేసిన కొత్త ఆలోచన ఇది. చైనాకు చెందిన బీవైడీ అనే ఆటోమొబైల్ సంస్థ మూడు నెలల పాటు ట్రయల్ రన్ కోసం ఈ బస్సును ఉచితంగా ఇచ్చింది. అంతేగాక ఓ వ్యక్తిని ఆ బస్సుతో పాటు పరిశీలనకు నియమించింది. బస్సును మెజెస్టిక్-కడుగొడి మధ్య రోజూ ఆరు ట్రిప్పులు నడుపుతున్నారు. పొగ లేని ఈ బస్సులో ప్రయాణించడానికి బెంగళూరు ప్రజలు సరదా పడుతున్నారు. కొందరు అయితే ప్రయాణ అనుభూతి కోసమే బస్సెక్కుతున్నారట. మరి తొలి ఎలక్ట్రిక్ బస్సు కదా. ఇందులో ఛార్జీ కూడా వోల్వో బస్సు ఛార్జీనే. ట్రయల్న్ ్రవిజయవంతం కావడంతో త్వరలో ఇంకొన్ని బస్సుల్ని దిగుమతి చేసుకుని పూర్తి స్థాయిలో నడపాలని.. భవిష్యత్తులో వాటిని పెంచుతూ పోవాలని బీఎంటీసీ నిర్ణయించింది. బస్సు నడిపే వ్యయం తక్కువే కానీ కొనాలంటే బస్సు బాగా ఖరీదు. ఒక్కోటీ 2.7 కోట్ల రూపాయల విలువైన ఈ బస్సులను కొనడానికి ప్రభుత్వ సాయం కోరుతోంది బీఎంటీసీ. ఈ-బస్సు సంగతులు - వోల్వో బస్సు ధర ఇందులో మూడోవంతే. అయితే వోల్వో నిర్వహణ ఖర్చు కి.మీ.కు 16 రూపాయలు. ఎలక్ట్రిక్ బస్సు వ్యయం ఏడురూపాయలే. - కాలుష్యం జీరో. పూర్తి ఎయిర్ కండిషన్డ్. - అన్నీ కుషన్ సీట్లే. సామర్థ్యం 41. బస్సు మొత్తం సీసీ కెమెరాలుంటాయి. స్త్రీలకూ రక్షణ. - అగ్నిప్రమాద నివారణ జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. ఒకవేళ జరిగినా ఆర్పే పరికరాలన్నీ ఇన్‌బిల్ట్. - ఆరు గంటలు ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. పొడవు 40 అడుగులు. బరువు 18 టన్నులు. లండన్‌లో మొదలయ్యాయి మనదేశంలో ఏదైనా కొత్తగా వస్తే అది ప్రపంచంలో బాగా పాపులర్ అనుకుంటాం. నిజానికి చాలా పెద్ద దేశాల్లోనూ ఈ-బస్సు లాంటివి ఇంకా ఇపుడిపుడే మొదలువుతున్నాయి! బ్రిటన్‌లోనూ ఇదే ఏడాది ఈ బస్సులు రోడ్డుపైకి వచ్చాయి. లండన్‌లో ఒకేసారి నాలుగు ఈ-బస్సులు ప్రారంభించారు. విశేషం ఏంటంటే అక్కడ ఈ ప్రాజెక్టు చేపట్టింది ఇండియాలో మొదలై ప్రస్తుతం లండన్ హెడ్‌క్వార్టర్‌గా నడుస్తున్న హిందుజా గ్రూప్ ఉప సంస్థ ఆప్టేర్. కాలుష్యం ఎక్కువ కావడం వల్లే లండన్ ప్రభుత్వం వీటిపై దృష్టి సారించింది. మరో రెండేళ్లలో 20 శాతం బస్సులు ఇవే ఉండాలని అక్కడ ప్రయత్నాలు మొదలుపెట్టారు. గుజరాత్‌కు రాబోతున్నాయి బెంగళూరులో ఈ ప్రయోగం సక్సెస్ అయ్యిందని తెలియగానే ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ర్టం వీటిపై దృష్టిసారించింది. దేశంలో పర్యావరణంపై ఎక్కువగా దృష్టిపెట్టిన రాష్ర్టం గుజరాత్. అందుకే ఈ-బస్సులను పైలట్ ప్రాజెక్టుగా గాంధీనగర్-అహ్మదాబాద్‌ల మధ్య ప్రవేశపెట్టడానికి ప్రణాళికలు రచిస్తోంది. గుజరాత్ పవర్ కార్పొరేషన్ ఇందులో ప్రధాన భాగస్వామి. తొలి దశలో 15-20 బస్సులు తేనున్నారు. సోలార్ పవర్ ద్వారా వీటికి ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటుచేస్తారట. ప్రతి 35 కిలోమీటర్లకు ఈ పాయింట్లు ఏర్పాటుచేస్తారు. బ్యాటరీ ఇండికేటర్ సిగ్నల్స్‌ను బట్టి బస్సును మార్గమధ్యలో కూడా ఛార్జి చేసుకోవచ్చు. ఆరు నెలల్లో ఇది అమలు చేస్తారట. మన రాష్ర్టంలో కూడా ముఖ్యంగా నగరాల్లో వీటిని ప్రారంభించి కాస్త కాలుష్యాన్ని తగ్గిస్తే బాగుంటుంది.