బీకేసీ దాకా..ఎలివేటెడ్ రోడ్
సాక్షి, ముంబై : చూనాబట్టీ-బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) వరకు ఎలవేటెడ్ రోడ్ను నిర్మాణానికి ఎమ్మెమ్మార్డీఏ కృషి చేస్తోంది. ఈ రోడ్డు నిర్మాణంతో బీకేసీ-సైన్ మార్గంలో కొంత మేరకు వాహనాల రద్దీ తగ్గనుంది. 1.6 కి.మీ దూరం వరకు నిర్మించనున్న ఎలెవేటెడ్ మార్గాన్ని బీకేసీలోని జీ-బ్లాక్ నుంచి ప్రారంభిం చనున్నారు. ఈ ఎలెవేటెడ్ మార్గం మిఠీనది మీదు గా, రెండు రైల్వే లైన్ల మీదుగా వెళ్లి సోమయ్య ఫుట్బాల్ గ్రౌండ్ వద్ద ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవేతో అనుసంధానం కానుంది. ఈ లింక్రోడ్ నిర్మాణంతో తూర్పు శివారు ప్రాంతాల నుంచి వచ్చే వారితోపాటు ఠాణే, నవీ ముంబై ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది.
తగ్గనున్న దూరభారం
ఇప్పటిదాకా ఈ ప్రాంతాల నుంచి బీకేసీ వెళ్లడానికి నిరంతరం రద్దీగా ఉండే సైన్-ధారావీ లింక్ రోడ్డును ఆశ్రయించించాల్సి వస్తుంది. ప్రస్తుతం సైన్ నుంచి బీకేసీ వరకు సమయం 20 నిమిషాలు పట్టగా, రద్దీ సమయంలో 45 నిమిషాల సమయం పడుతోంది. ప్రయాణికులు, వాహనదారులకు వ్యయప్రయాస తప్పలేదు. ఈ లింక్ రోడ్డు నిర్మాణం పూర్తయితే ప్రయాణ సమయం మరింత ఆదా కానుంది. మూడు కి.మీ. వరకు ప్రయాణ దూరం తగ్గనుందని ఎమ్మెమ్మార్డీఏ తెలిపింది. ఇప్పటికే జోగేశ్వరి విక్రోలి లింక్రోడ్ (జీవీఎల్ఆర్) , శాంతక్రూజ్-చెంబూర్ లింక్ రోడ్లు (ఎస్సీఎల్ఆర్) ఉన్నాయి. ఈ లింక్ రోడ్డు మూడో లింక్ రోడ్డుగా నమోదు కానుంది.
అన్ని విభాగాల ఆమోదం పొందుతాం
కాగా, ఈ నిర్మాణానికి సెంట్రల్ రైల్వే మహారాష్ట్ర కోస్టల్జోన్ మేనేజ్మెంట్ అథారటీ (ఎంసీజెడ్ఎంఏ) ఎమ్మెమ్మార్డీఏ ఆమోదం పొందాల్సి ఉంది. ఈ లింక్రోడ్డు కుర్లాలోని సెంట్రల్, హర్బర్ రైల్వే లైన్ మీదుగా వెళ్లడంతో ఇందుకు సెంట్రల్ రైల్వే ఆమోదం తెలిపింది. ఇంకా మీఠీ నది మీది నుంచి కూడా ఈ లింక్ రోడ్డు నిర్మాణం చేపట్టడంతో ఎంసీజెడ్ఎంఏ అనుమతి పొందాల్సి ఉంది. నిర్మాణ పనులు ప్రారంభించక ముందే అన్ని విభాగాల ఆమోదం పొందుతామని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారటీ (ఎమ్మెమ్మార్డీఏ) అధికారి తెలిపారు. వర్షా కాలం పూర్తి కాగానే ఈ పనులు ప్రారంభించడానికి అన్ని చర్యలు పూర్తి చేయనున్నట్లు చెప్పారు.