
అందుబాటులోకి వచ్చిన అతిపెద్ద ఎలివేటెడ్ రోడ్డు ప్రాజెక్టు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద ఎలివేటెడ్ రోడ్ హిందన్ రోడ్ ప్రాజెక్టును యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ శుక్రవారం ప్రారంభించారు. మీరట్ మీదుగా ఢిల్లీ నుంచి హరిద్వార్‌కు ఈ రోడ్డు ద్వారా ప్రయాణీకులు అత్యంత వేగంగా చేరుకోవడం సాధ్యమవుతుంది. రూ 1147 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయాణీకులకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గడంతో పాటు ప్రయాణ సమయం సైతం ఆదా కానుంది. షెడ్యూల్ ప్రకారం 2017లోనే ఈ ప్రాజెక్టు ప్రజలకు అందుబాటులోకి రావాల్సి ఉండగా, నిర్మాణ పనుల్లో జాప్యంతో ఆలస్యమైంది.
10.3 కిమీ పొడవైన ఈ ప్రాజెక్టు చుట్టూ రాజకీయాలూ అలుముకున్నాయి. ప్రాజెక్టును చేపట్టిన ఘనత తమదేనని, 90 శాతం పనులు తమ హయాంలోనే సాగాయని ఎస్‌పీ చెబుతుండగా, ప్రాజెక్టును పూర్తిచేసి ప్రారంభించడం ద్వారా క్రెడిట్ కోసం బీజేపీ పాకులాడుతోంది.