ఏసీబీ ఎదుట హాజరైన సీఎం అభ్యర్థి
పణజి: త్వరలో జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఖరారైన ఎల్విస్ గోమ్స్ సోమవారం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ల్యాండ్ కన్వర్షన్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఆయనకు మద్దతుగా ఆప్ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ కుట్రపూరితంగా ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.
53 ఏళ్ల ఎల్విస్ గోమ్స్ దక్షిణ గోవాలోని కన్ కోలిన్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తనపై విచారణకు ఆదేశించడాన్ని ఆయన తప్పుబట్టారు.