మూడు వారాల్లో 108 కిలోలు తగ్గింది!
ఆమె ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళ. పేరు ఇమాన్ అహ్మద్. తన శరీర బరువు తానే మోసుకోలేకపోవడంతో.. దాన్ని తగ్గించుకోవాలని ఎక్కడో ఇరాన్ నుంచి ప్రత్యేకంగా కార్గో విమానంలో బయల్దేరి మరీ ముంబైలోని సైఫీ ఆస్పత్రిలో వాలింది. ఆమె ఇక్కడికొచ్చి మూడు వారాలు అయ్యిందో లేదో.. అప్పుడే 108 కిలోల బరువు తగ్గిపోయింది!! దాంతో ఇప్పుడు 380 కిలోలకు వచ్చింది. గత పాతికేళ్లలో ఆమె బరువు తగ్గడం ఇదే మొదటిసారి. ఇక ఆమె లేచి తనంతట తానుగా నిలబడటమే మిగిలింది. ఇప్పుడు ఆమె శస్త్రచికిత్సకు సిద్ధం అవుతుండంటంతో.. అది కూడా పెద్ద కష్టం కాబోదని ముంబై వైద్యులు అంటున్నారు.
వాస్తవానికి వైద్యుల అంచనా ప్రకారం ఆమె 25 రోజుల్లో 50 కిలోలు తగ్గాలి. అందుకు రోజుకు రెండు కిలోల చొప్పున తగ్గించాలనుకున్నారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆమె ఏకంగా వంద కిలోలకు పైగా తగ్గిపోయిందని ఆస్పత్రి బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ ముఫజల్ లక్డావాలా చెప్పారు. ఆమె శరీర బరువులో దాదాపు వంద కిలోల వరకు నీరే ఉంది. ప్రతిరోజూ ఫిజియోథెరపీ, ద్రవాహారం మాత్రమే తీసుకోవడం ద్వారా ఆమె తన శరీరంలో అదనంగా ఉన్న నీటిని తొలగించుకుని, ఇప్పుడు బేరియాట్రిక్ సర్జరీకి సిద్ధమయ్యారు. త్వరలోనే సర్జరీ చేస్తామని డాక్టర్ ముఫజల్ చెప్పారు.
తాము మందుల ద్వారానే చాలావరకు బరువును తగ్గించాలని అనుకున్నామని, కానీ ఇప్పుడు మందుల వల్ల ఉపయోగం ఏమీ ఉండదని అన్నారు. మిగిలిన లక్ష్యాన్ని సర్జరీ ద్వారా మాత్రమే చేరుకోగలమని వివరించారు. ముందుగా ఆమెకు స్లీవ్ బేరియాట్రిక్ సర్జరీ చేస్తారు. ఆ తర్వాత ఆమెను అలెగ్జాండ్రియాకు పంపి, అక్కడ కొంతకాలం పరిశీలనలో ఉంచి ఆ తర్వాత మళ్లీ ఇక్కడకు తీసుకొచ్చి తదుపరి చికిత్సలు చేస్తారు. ఇమాన్ అహ్మద్‌కు చికిత్స కోసం విరాళాల ద్వారా ముంబై ఆస్పత్రి వర్గాలు రూ. 60 లక్షలు సేకరించాయి.