emergency brake
-
హిమాచల్ డిప్యూటీ సీఎంకు త్రుటిలో తప్పిన ప్రమాదం
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ముకేశ్ అగ్నిహోత్రి, ఢిల్లీ డీజీపీ ప్రతుల్ వర్మ సహా 30 మంది ప్రయాణికులున్న విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. వీరు ప్రయాణిస్తున్న విమానం జుబ్బర్హట్టి ఎయిర్‌పోర్టులోని రన్‌వేపై ల్యాండవ్వకుండా ముందుకు దూసుకెళ్లింది. పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో చిట్టచివరి అంచున ఉన్న స్టడ్స్‌ను ఢీకొట్టి నిలిచిపోయింది. దాదాపు అరగంట తర్వాత ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందికి దించారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. అన్ని తనిఖీల తర్వాతే ఢిల్లీలో విమానం టేకాఫ్ తీసుకుందని చెప్పారు. సిమ్లాకు 15 కిలోమీటర్ల దూరంలో కొండప్రాంతంలో ఉన్న జుబ్బర్హట్టి ఎయిర్ స్ట్రిప్ పొడవు 1,230 మీటర్లు మాత్రమే. పైపెచ్చు ఏటవాలుగా ఉంటుందని చెబుతున్నారు. కాగా, తాజా ఘటనకు దారితీసిన కారణాలపై పౌర విమానయాన శాఖ దర్యాప్తు చేపట్టింది. విమానంలో సాంకేతిక లోపాలపై ఇంజనీరింగ్ సిబ్బంది తనిఖీ చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. -
లోకో పైలట్ సమయస్ఫూర్తి, 10 సింహాలకు తప్పిన ముప్పు
గూడ్సు రైలు డ్రైవర్ సమయస్ఫూర్తి పది సింహాల ప్రాణాలను కాపాడింది. రైల్వే ట్రాక్‌పై ఉన్నపది సింహాలను చూసిన ఇంజన్ డ్రైవర్ వెంటనే అలర్ట్ అయ్యాడు. ఎమర్జెన్సీ బ్రేకులను వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా పిపవవ్ పోర్టు సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో రైలు డ్రైవర్ ముఖేష్ కుమార్ మీనాపై ప్రశంసల వెల్లువ కురుస్తోంది. పిపవవ్ పోర్టు స్టేషన్ నుంచి సైడింగ్ (ప్రధాన కారిడార్‌కు పక్కన చిన్న ట్రాకు)లోకి గూడ్సు రైలును తీసుకువెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు పశ్చిమ రైల్వే భావ్‌నగర్ డివిజన్ ఒక ప్రకటనలో తెలిపింది. రైలు ట్రాక్‌పై విశ్రాంతి తీసుకుంటున్న సింహాలను చూసిన వెంటనే ముఖేష్ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతోపాటు, సింహాలు అక్కడినుంచి లేచి వెళ్లిపోయేంత వరకు వేచి చూశారు.ఈ సంఘటనపై స్పందించిన పశ్చిమ రైల్వే సింహాలు, ఇతర వన్యప్రాణుల భద్రత కోసం భావ్‌నగర్ డివిజన్ అన్ని విధాలుగా కృషి చేస్తోందని ఒక ప్రకటనలో తెలిపింది. రైల్వే ట్రాకుపై నడచి వెళ్లే వన్యప్రాణుల పట్ల లోకో పైలట్లు అప్రమత్తంగా ఉంటారని తెలిపింది. పిపావవ్ పోర్టును ఉత్తర గుజరాత్‌తో కలిపే ఈ రైలు మార్గంలో గత కొన్నేళ్లుగా అనేక సింహాలు చనిపోయాయి. దీంతో రాష్ట్ర అటవీ శాఖ కొన్ని చోట్ల ట్రాక్‌పై కంచెలనుఏర్పాటు చేసింది. అలాగే సింహాలను ఇలాంటి ప్రమాదాలనుంచి కాపాడాలంటూ దాఖలైన పిటీషన్‌ను విచారించిన గుజరాత్ హైకోర్టు, పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం , రైల్వేలను కోరింది. కాగా 2020 జూన్ నాటి సర్వే ప్రకారం గుజరాత్ లో 674 సింహాలు ఉన్నాయి. -
మెట్రో రైలు ముందు దూకిన మహిళ
న్యూఢిల్లీ: సాధారణంగా ఎవరైనా రైలు వస్తుందంటే పట్టాలు దాటే వారంతా పరుగులు పెడతారు. చటుక్కున ప్లాట్ ఫాం చేరుకొని ప్రాణాలు రక్షించుకుంటారు. కానీ, వేగంగా రైలు దూసుకొచ్చే సమయంలో ఉద్దేశపూర్వకంగా దానిముందుకు దూకేస్తే.. అదృష్టవశాత్తు అలా దూకిన వ్యక్తికి ఎలాంటి ప్రాణహానీ జరగకుంటే.. ఢిల్లీలో అచ్చం ఇలాగే జరిగింది. సోమవారం సాయంత్రం గోవింద్ పురి మెట్రో స్టేషన్ లో మెట్రో రైలు దూసుకొస్తుండగా అనూహ్యంగా ఓ మహిళ దానికి ఎదురుగా ప్లాట్ ఫాంపై నుంచి దూకింది. అది చూసిన డ్రైవర్ ఒక్కసారిగా అత్యవసర బ్రేక్ అప్లై చేయడంతో ఆమె ఎలాంటి హానీ జరగకుండా బయటపడింది. అయితే, ఆ మహిళ ఎవరు, ఎందుకు అలా చేసిందనే వివరాలు ఇంకా తెలియరాలేదు.