ప్యాసింజర్ ట్రైన్లలో తత్కాల్ రిజర్వేషన్ సదుపాయం!
ఎమర్జెన్సీ రిజర్వేషన్ సౌకర్యాన్ని ప్రయాణికులకు అందించాలనే ఉద్దేశ్యంతో పలు ప్యాసింజర్లలో తత్కాల్ రిజర్వేషన్ స్కీమ్ రైల్వేశాఖ ప్రవేశపెట్టనుంది. ఏసీ ఫస్ట్ క్లాస్ మినహా అన్నిరిజర్వుడ్ క్లాసుల్లో తత్కాల్ స్కీమ్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు రాజధాని, దురంతో, శతాబ్ది ట్రైన్లతోపాటు మెయిల్స్, ఎక్స్ ప్రెస్ ట్రైన్లలోనే తత్కాల్ స్కీమ్ అందుబాటులో ఉంది.
గత ఆర్ధిక సంవత్సరంలో 60 శాతం పైగా ప్రయాణికులు ప్రయాణించిన ప్యాసింజర్ ట్రైన్లలో ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని రైల్వే శాఖ తెలిపింది. అలాంటి పాసింజర్ ట్రైన్లను గుర్తించే పనిని ఆయా జోన్లకే అప్పగించామని రైల్వేశాఖ కు చెందిన సీనియర్ అధికారి తెలిపారు. భోపాల్-ఇండోర్ ప్యాసింజర్, హౌరా-చక్రధర్ ప్యాసింజర్, అగర్తలా-ధరమ్ నగర్, రాజ్ కోట్-వెరివల్ ప్యాసింజర్లలో ఈ స్కీమ్ ను అమలు చేస్తామన్నారు.
రైల్వే శాఖలో నెలకొన్న ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ స్కీమ్ ను అమలు చేయాలనుకుంటున్నామన్నారు. తత్కాల్ ఛార్జీలను సెకెండ్ క్లాస్ బేసిక్ చార్జీపై 10 శాతం, ఇతర క్లాస్ టికెట్ ధరపై 30 శాతం ఉందని.. సెకండ్ క్లాస్ సిట్టింగ్ పై 10 నుంచి 15 రూపాయలు తత్కాల్ చార్జీలను వసూలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.