Emilia
-
విజేత హామిల్టన్
ఇమోలా: మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ తాజా ఎఫ్1 సీజన్లో మరో రేసు విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన 63 ల్యాప్‌ల ఎమిలియా రొమానో గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును రెండో స్థానం నుంచి ఆరంభించిన హామిల్టన్... గంటా 28 నిమిషాల 32.430 సెకన్లలో అందరికంటే ముందుగా పూర్తి చేసి విజేతగా నిలిచాడు. సీజన్లో హామిల్టన్‌కిది తొమ్మిదో విజయం కాగా... ఓవరాల్‌గా 93వది. రేసును ఆరంభించడంలో విఫలమైన హామిల్టన్ తొలి ల్యాప్‌లో ఒక స్థానం దిగజారి మూడో స్థానానికి పడిపోయాడు. అయితే 21వ ల్యాప్‌లో సహచర మెర్సిడెస్ డ్రైవర్ వాల్తెరి బొటాస్ టైర్లు మార్చుకోవడానికి పిట్స్లోకి రావడంతో లీడ్‌లోకి వచ్చిన హామిల్టన్... తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ వెళ్లాడు. అదే సమయంలో హామిల్టన్‌కు ‘వర్చువల్ సేఫ్టీ కారు’ రూపంలో అదృష్టం కూడా తోడవ్వడంతో ఇక వెనుదిరిగి చూడలేదు. 33వ ల్యాపులో ఒకాన్ (రెనౌ) కారులో సమస్య తలెత్తడంతో... అతడు తన కారును ట్రాక్ పక్కన నిలిపేశాడు. దాంతో ఆ కారును తొలగించే వరకు ఎటువంటి ప్రమాదం జరగకుండా... ఎఫ్1 స్టీవర్డ్స్ ‘వర్చువల్ సేఫ్టీ కారు’ను డెప్లాయ్ చేశారు. అదే సమయంలో తన కారు టైర్లను మార్చుకున్న హామిల్టన్ తొలి స్థానాన్ని తిరిగి దక్కించుకున్నాడు. ఈ ఆధిక్యాన్ని చివరి వరకు కాపాడుకున్న అతడు విజేతగా నిలిచాడు. బొటాస్ రెండో స్థానంలో... రికియార్డో (రెనౌ) మూడో స్థానంలో నిలిచారు. 51వ ల్యాప్‌లో టైరు పంక్చర్ కావడంతో మ్యాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) రేసు నుంచి వైదొలిగాడు. సీజన్లో 13 రేసులు ముగిశాక హామిల్టన్ 282 పాయింట్లతో డ్రైవర్ చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో ఉండగా... బొటాస్ 197 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. తాజా విజయంతో వరుసగా ఏడో ఏడాది (2014, 15, 16, 17, 18, 19, 20) కన్స్ట్రక్టర్ (జట్టు) చాంపియన్‌షిప్ టైటిల్‌ను నెగ్గి ఈ రికార్డును సాధించిన తొలి ఎఫ్1 టీమ్‌గా నిలిచింది. -
బొటాస్‌కు పోల్
ఇమోలా (ఇటలీ): వరుసగా ఏడో ఏడాది కన్స్ట్రక్టర్ (జట్టు) చాంపియన్‌షిప్ టైటిల్‌పై కన్నేసిన ఫార్ములా వన్ (ఎఫ్1) జట్టు మెర్సిడెస్ అదరగొట్టింది. 14 ఏళ్ల తర్వాత ఎఫ్1 సీజన్లో పునరాగమనం చేసిన ఇమోలా రేసు ట్రాక్‌పై ఆ జట్టు డ్రైవర్లు వాల్తెరి బొటాస్, లూయిస్ హామిల్టన్ సత్తా చాటారు. ఇమిలియా రొమాగ్న గ్రాండ్ ప్రి పేరుతో జరుగనున్న ఈ రేసులో భాగంగా శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో బొటాస్ పోల్ పొజిషన్ సాధించాడు. అతడు అందరికంటే వేగంగా ల్యాప్‌ను నిమిషం 13.609 సెకన్లలో పూర్తి చేశాడు. దాంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి మొదలు పెట్టే అవకాశాన్ని దక్కించుకున్నాడు. సహచరుడు హామిల్టన్ 0.097 సెకన్లు వెనుకగా ల్యాప్‌ను పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. నేడు జరిగే రేసును లూయిస్ హామిల్టన్ లేదా వాల్తెరి బొటాస్లలో కనీసం ఒకరైనా ‘టాప్–4’తో ముగిస్తే.. ఎఫ్1 చరిత్రలో వరుసగా ఏడోసారి కన్స్ట్రక్టర్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను నెగ్గిన తొలి జట్టుగా మెర్సిడెస్ నిలుస్తుంది. 2014 నుంచి 2019 వరకు జరిగిన ఆరు ఎఫ్1 సీజన్‌ల్లోనూ మెర్సిడెస్ జట్టే ఈ టైటిల్స్‌ను సొంతం చేసుకోవడం విశేషం. గతంలో ఫెరారీ (1999–2004 మధ్య) ఇలా వరుసగా ఆరుసార్లు టీమ్ విభాగంలో టైటిల్స్‌ను నెగ్గింది. -
హృదయరాగం
ఇల్యా కబాకోవ్కు చిన్నప్పుడు ఎవరో చెప్పారు... తదేకంగా చూస్తే ఒకే దృశ్యం అనేక విధాలుగా కనిపిస్తుంది అని. ఆర్టిస్ట్ అయ్యాక అతనికి ఈ వాస్తవం అనుభవంలోకి వచ్చింది. కొత్త కాంతి ఒకటి హృదయంలో ప్రసరించింది. రష్యాలో ఉన్నప్పుడైనా, అమెరికాలో స్థిరపడినప్పుడైనా అనేకానేక దృశ్యాలతో ఇల్యా కుంచె ప్రకాశించని రోజే లేదు. ఆ రాగ రంజితంలోని ఒక హృదయ వర్ణం... ఆయన భార్య ఎమీలియా. భావాల సమన్వయంతో చేసే ఏ సృజనాత్మక కళ అయినా రాణిస్తుందని చెప్పడానికి కళా చరిత్ర నిండా కోకొల్లలుగా ఉదాహరణలు ఉన్నాయి. ఇల్యా కబాకోవ్ తన భార్య ఎమీలియా కబాకోవ్తో కలిసి వేసిన పెయింటింగ్స్ ఆ ఉదాహరణలలో సరికొత్త చేర్పుగా నిలుస్తాయి. కొందరైతే వారి కళాకృతులను చూసి ‘రెండు ఆత్మల సంగమం’ అని హృదయ మనోహరంగా అంటారు. సోవియెట్‌లో పుట్టి పెరిగిన ఇల్యా, ఎమీలియాలు న్యూయార్క్ సిటీలో ఆర్టిస్ట్‌లుగా పేరు తెచ్చుకున్నారు. ఇల్యా మంచి పెయింటర్. ‘టోటల్ ఇన్స్టలేషన్’ కాన్సెప్ట్‌కు మకుటం లేని మహారాజు. ఇల్యా దంపతులపై ‘ఇల్యా అండ్ ఎమీలీయా కబాకోవ్: ఎంటర్ హియర్’ పేరుతో కొత్త డాక్యుమెంటరీ కూడా తయారయింది. అభిమానులకు తెలియని ఆ కళాకారుల అపరిచిత ప్రపంచాన్ని ఇది ఆవిష్కరిస్తుంది. గతంలో కబాకోవ్లపై ఒక పుస్తకం కూడా వచ్చింది. అందులో కళాత్మక అంశాలతో పాటు వారి మాతృభూమికి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. బహుశా ఈ అనుభవమే గ్రంథరచయిత వాలక్ను ప్రస్తుత డాక్యుమెంటరీ వైపు పురిగొలిపి ఉంటుంది. డాక్యుమెంటరీలో ఇల్యా దంపతుల సన్నిహిత బంధువుల ఇంటర్వ్యూలతో పాటు కళావిమర్శకుల లోతైన విశ్లేషణలు కూడా ఉన్నాయి. కబాకోవ్ వర్క్‌లోని అనేకానేక లేయర్లను ఈ డాక్యుమెంటరీ పరిచయం చేస్తుంది. డాక్యుమెంటరీ చూస్తున్నంతసేపు ఇద్దరు కళాకారుల వ్యక్తిగత జీవితాలు తెలుసుకున్నట్లు కాకుండా కళాచరిత్రలో కొన్ని పుటలు చదివినట్లు అనిపిస్తుంది. కెమెరావర్క్, నేపథ్య సంగీతం, ఇంటర్వ్యూ సూపర్ ఇంపోజిషన్లతో డాక్యుమెంటరీ చూడముచ్చటగా, వినసొంపుగా ఉంది. సాక్షి ఫ్యామిలీకి సంబంధించి మీ సలహాలను, సూచనలను పంపండి. ఫోన్: టోల్ ఫ్రీ నంబర్: 1800 425 9899 (ఉ.7.00-రా.8.00వరకు) పోస్ట్: సాక్షి ఫ్యామిలీ, 6-3-249/1, సాక్షి టవర్స్, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-500034 మెయిల్: sakshi.features@gmail.com