ఇల్యా కబాకోవ్‌కు చిన్నప్పుడు ఎవరో చెప్పారు... తదేకంగా చూస్తే ఒకే దృశ్యం అనేక విధాలుగా కనిపిస్తుంది అని. ఆర్టిస్ట్ అయ్యాక అతనికి ఈ వాస్తవం అనుభవంలోకి వచ్చింది. కొత్త కాంతి ఒకటి హృదయంలో ప్రసరించింది. రష్యాలో ఉన్నప్పుడైనా, అమెరికాలో స్థిరపడినప్పుడైనా అనేకానేక దృశ్యాలతో ఇల్యా కుంచె ప్రకాశించని రోజే లేదు. ఆ రాగ రంజితంలోని ఒక హృదయ వర్ణం... ఆయన భార్య ఎమీలియా.
భావాల సమన్వయంతో చేసే ఏ సృజనాత్మక కళ అయినా రాణిస్తుందని చెప్పడానికి కళా చరిత్ర నిండా కోకొల్లలుగా ఉదాహరణలు ఉన్నాయి. ఇల్యా కబాకోవ్ తన భార్య ఎమీలియా కబాకోవ్‌తో కలిసి వేసిన పెయింటింగ్స్ ఆ ఉదాహరణలలో సరికొత్త చేర్పుగా నిలుస్తాయి. కొందరైతే వారి కళాకృతులను చూసి ‘రెండు ఆత్మల సంగమం’ అని హృదయ మనోహరంగా అంటారు.
సోవియెట్‌లో పుట్టి పెరిగిన ఇల్యా, ఎమీలియాలు న్యూయార్క్ సిటీలో ఆర్టిస్ట్‌లుగా పేరు తెచ్చుకున్నారు. ఇల్యా మంచి పెయింటర్. ‘టోటల్ ఇన్‌స్టలేషన్’ కాన్సెప్ట్‌కు మకుటం లేని మహారాజు. ఇల్యా దంపతులపై ‘ఇల్యా అండ్ ఎమీలీయా కబాకోవ్: ఎంటర్ హియర్’ పేరుతో కొత్త డాక్యుమెంటరీ కూడా తయారయింది. అభిమానులకు తెలియని ఆ కళాకారుల అపరిచిత ప్రపంచాన్ని ఇది ఆవిష్కరిస్తుంది.
గతంలో కబాకోవ్‌లపై ఒక పుస్తకం కూడా వచ్చింది. అందులో కళాత్మక అంశాలతో పాటు వారి మాతృభూమికి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. బహుశా ఈ అనుభవమే గ్రంథరచయిత వాలక్‌ను ప్రస్తుత డాక్యుమెంటరీ వైపు పురిగొలిపి ఉంటుంది. డాక్యుమెంటరీలో ఇల్యా దంపతుల సన్నిహిత బంధువుల ఇంటర్వ్యూలతో పాటు కళావిమర్శకుల లోతైన విశ్లేషణలు కూడా ఉన్నాయి.
కబాకోవ్ వర్క్‌లోని అనేకానేక లేయర్‌లను ఈ డాక్యుమెంటరీ పరిచయం చేస్తుంది. డాక్యుమెంటరీ చూస్తున్నంతసేపు ఇద్దరు కళాకారుల వ్యక్తిగత జీవితాలు తెలుసుకున్నట్లు కాకుండా కళాచరిత్రలో కొన్ని పుటలు చదివినట్లు అనిపిస్తుంది. కెమెరావర్క్, నేపథ్య సంగీతం, ఇంటర్వ్యూ సూపర్ ఇంపోజిషన్‌లతో డాక్యుమెంటరీ చూడముచ్చటగా, వినసొంపుగా ఉంది.
సాక్షి ఫ్యామిలీకి సంబంధించి మీ సలహాలను, సూచనలను పంపండి. ఫోన్: టోల్ ఫ్రీ నంబర్: 1800 425 9899 (ఉ.7.00-రా.8.00వరకు) పోస్ట్: సాక్షి ఫ్యామిలీ, 6-3-249/1, సాక్షి టవర్స్, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-500034
మెయిల్: sakshi.features@gmail.com
హృదయరాగం
Published Thu, Dec 12 2013 10:42 PM | Last Updated on Fri, Mar 22 2019 1:41 PM
Advertisement
Advertisement