Emory University
-
ఆసియన్ అమెరికన్లకి బైడెన్ అండ
అట్లాంటా: ఆసియన్ అమెరికన్లపై జరుగుతున్న హింసాత్మక దాడులు మనసుని కలిచి వేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడులపై అమెరికన్లు అందరూ మౌనం వీడాలని పిలుపునిచ్చారు. అట్లాంటాలోని ఆసియా మసాజ్ పార్లర్లపై శ్వేతజాతీయుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మరణించడంతో అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌లు అట్లాంటా పర్యటనకు వచ్చారు. ఎమొరి యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న బైడన్ జాతి వివక్ష దాడులైనా, విదేశీయులంటే భయంతో కూడిన దాడులైనా ప్రజలందరూ మాట్లాడాలని, ప్రతిస్పందించాలని అన్నారు. ‘‘మౌనం వహించడం అన్నది అత్యంత సంక్లిష్టమైనది. మనం అలా ఉండకూడదు’’అని హితవు పలికారు. అంతకు ముందు ఆసియన్ అమెరికన్ ప్రజాప్రతినిధులతో బైడెన్, కమలా హ్యారిస్‌లు సమావేశమై చర్చించారు. ఆసియన్ అమెరికన్లకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఆసియన్ అమెరికన్లలో నెలకొన్న భయభ్రాంతుల్ని చూస్తుంటే గుండె కరిగి నీరైపోతోందన్న బైడెన్ అమెరికా పౌరులందరూ విద్వేషాలు వీడాలని అన్నారు. కరోనా సంక్షోభం వచ్చాక ఆసియన్లపై ఓ విధమైన కసితో అమెరికా వ్యాప్తంగా దాడులు అధికమైపోతున్న విషయం తెలిసిందే. ‘‘ఆసియన్లపై దాడి చేస్తున్నారు. నిందిస్తున్నారు. వేధిస్తున్నారు. బలిపశువుల్ని చేస్తున్నారు. మాటలతో తూట్లు పొడుస్తున్నారు. భౌతిక దాడులకు దిగుతున్నారు. వాళ్లని ఏకంగా చంపేస్తున్నారు’’అని బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే తీసుకురానున్న కోవిడ్–19 హేట్ క్రైమ్స్ యాక్ట్‌కి తాను మద్దతునిస్తున్నట్టుగా బైడెన్ ప్రకటించారు. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే విద్వేషపూరిత నేరాలు జరిగినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం మరింత చురుగ్గా పనిచేసే వీలు కలుగుతుందని వివరించారు. చూస్తూ ఊరుకోం: కమలా హ్యారిస్ అట్లాంటాలో కాల్పుల ఘటనపై విచారణ కొనసాగుతోందని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తెలిపారు. జాతి వివక్ష, విదేశీయులంటే భయం అమెరికాలో ఎప్పట్నుంచో ఉన్నాయని అన్నారు. తాను, అధ్యక్షుడు ఈ దాడుల్ని చూస్తూ మౌనంగా ఊరుకోమని హెచ్చరించారు. విద్వేషపూరిత నేరాలు, హింసాత్మక దాడులు, వివక్ష ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో ఉన్నా తాము వ్యతిరేకిస్తామన్నారు. ఈ దేశంలో ఉన్న ప్రతీ ఒక్కరినీ అమెరికన్లుగానే గుర్తించాలని, మనలో ఒకరిగా చూడాలని కమలా హ్యారిస్ హితవు పలికారు. -
అప్పుడైనా జరుగుతాయా?
తీవ్ర తర్జనభర్జనల అనంతరం ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడలను కూడా ఏడాదిపాటు వాయిదా వేస్తూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిర్ణయం కూడా తీసుకుంది. ఈ మెగా ఈవెంట్‌కు మరో 15 నెలల సమయం ఉంది. అయితే అప్పుడు కూడా ఈ క్రీడల నిర్వహణ సాధ్యమేనా అంటూ వైద్య నిపుణులు కొత్త సందేహాలు తెరపైకి తీసుకొచ్చారు. కరోనాకు తగిన చికిత్స సిద్ధమయ్యే వరకు ఒలింపిక్ వంటి మెగా ఈవెంట్ల నిర్వహణ సరైంది కాదని వారు చెబుతున్నారు. టోక్యో: కొత్త షెడ్యూల్ ప్రకారం టోక్యో ఒలింపిక్స్ క్రీడలు 2021 జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరగాల్సి ఉన్నాయి. అవసరమైతే ఐఓసీ మళ్లీ ఒలింపిక్ తేదీలను మార్చేందుకు సిద్ధంగా ఉండాలని అమెరికాకు చెందిన ఇమోరీ యూనివర్సిటీ వైద్య నిపుణుడు జాక్ బిన్నీ అభిప్రాయపడ్డారు. ‘స్టేడియాల్లో భారీ సంఖ్యలో ప్రేక్షకులు రావాలని కోరుకుంటూ క్రీడల నిర్వహణ గురించి మనం ఆలోచిస్తున్నాం. అయితే కనీసం కరోనాకు తగిన వ్యాక్సిన్ వచ్చే వరకైనా ఇలాంటివి జరగకుండా ఉంటే బాగుంటుంది. మైదానంలో వచ్చే ఒక్కో వ్యక్తితో కరోనా వ్యాపించే ప్రమాదం పెరుగుతూనే ఉంటుంది. ఇప్పటికే ప్రకటించిన తేదీలు చూస్తే నిర్వాహకులు అతిగా ఆశిస్తున్నట్లే అనిపిస్తోంది. ఎందుకంటే వైరస్‌కు వ్యాక్సిన్ రావడానికి కనీసం ఏడాదిన్నర పట్టవచ్చు. అంటే 2021 చివరి వరకు ఇది సాధ్యం కాదు. ఒక స్టేడియంలో 50 వేల నుంచి లక్ష మంది వరకు ప్రేక్షకులను కూర్చోబెట్టడం అంటే అంతకంతకూ ప్రమాదం పెరిగిపోతున్నట్లే లెక్క’ అని ఆయన అన్నారు. ఒలింపిక్ వేదిక చుట్టుపక్కల తిరిగే అభిమానులకు ఇన్ఫెక్షన్ సోకితే అక్కడ మాత్రమే కాకుండా తిరుగు ప్రయాణంలో తమ తమ దేశాలకు కూడా వైరస్‌ను మోసుకెళ్లే ప్రమాదం ఉందని బిన్నీ చెబుతున్నారు. కెనడాలోని మనిటోబా యూనివర్సిటీలో అంటువ్యాధుల నిరోధక విభాగానికి చెందిన ప్రొఫెసర్ జాసన్ కిండ్రాచుక్ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో సార్స్, ఎబోలా వంటి వ్యాధులు ప్రబలిన సమయంలో ఆయన తన సేవలందించారు. ‘సంవత్సరంలోపు కోవిడ్–19కు వైరస్ వస్తుందని ఆశిస్తున్నాం. అయితే ఆ సమయానికి ఒలింపిక్స్ దగ్గరకు వచ్చేస్తాయి. సరిగ్గా ప్రారంభానికి ముందు మీరు అందరికీ వ్యాక్సిన్ ఇచ్చి కూడా లాభం ఉండదు. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడానికి కాస్త ముందుగా ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది’ అని ఆయన సూచించారు. జపాన్‌లో సాధారణ స్థితి వచ్చేందుకు కనీసం సంవత్సరం పడుతుందని, తన అంచనా ప్రకారం వచ్చే ఏడాది ఒలింపిక్స్ ఏ రకంగానూ సాధ్యం కాదని అదే దేశానికి చెందిన మరో ప్రొఫెసర్ డాక్టర్ కెంటారో వ్యాఖ్యానించడం గమనార్హం. ఎడిన్బర్గ్ యూనివర్సిటీ గ్లోబల్ హెల్త్ విభాగ అధిపతి దేవీ శ్రీధర్ కూడా దీనితో ఏకీభవించారు. ‘ఒకసారి వ్యాక్సిన్ వస్తేనే ఒలింపిక్స్ నిర్వహణపై మనం నమ్మకం పెట్టుకోవచ్చు. చౌకగా, అందరికీ అందుబాటులో వ్యాక్సిన్ వస్తే తిరుగుండదు. వైజ్ఞానికపరంగా దీని నిరోధం గురించి స్పష్టత రాకపోతే ఆటల గురించి మరచిపోవచ్చు’ అని శ్రీధర్ విశ్లేషించారు. మా ప్రణాళికలు మాకున్నాయి... తాజా విమర్శలపై టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు స్పందించారు. ‘ప్రస్తుత స్థితిలో కొందరు చేస్తున్న ఊహాగానాలపై మేమేమీ చెప్పలేం. అయితే కోవిడ్–19 వ్యాప్తి నిరోధం గురించి మా వద్ద తగిన ప్రణాళికలు ఉన్నాయి. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ కలిసి పనిచేస్తున్నాం. ఈవెంట్‌తో సంబంధం ఉన్న అందరితో చర్చిస్తూ తాజా స్థితిని సమీక్షించి తగిన నిర్ణయాలు తీసుకుంటాం. అయితే క్రీడలను మళ్లీ వాయిదా వేసే ఆలోచనే లేదు. షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్స్ సమర్థ నిర్వహణకు ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఒలింపిక్స్ జరగడానికి కనీసం నాలుగు నుంచి ఆరు వారాల ముందుగా టోక్యోకు వచ్చి రెండు వారాల క్వారంటైన్ తర్వాత అథ్లెట్లు ఒలింపిక్ గ్రామంలోకి అడుగుపెడితే సరిపోతుందని కూడా ఒక ప్రతిపాదన వచ్చింది’ అని నిర్వహణ కమిటీ అధికార ప్రతినిధి మాసా టకాయా స్పష్టం చేశారు. -
మార్చుకోదగ్గ అలవాట్లతో గుండెను రక్షించుకోవచ్చు!
కొత్త పరిశోధన కేవలం ఐదంటే ఐదు... అంశాల్లో మార్పులు చేసుకోవడం ద్వారా గుండెజబ్బుల నుంచి, గుండెపోటు నుంచి గుండెను పూర్తిగా రక్షించుకోవచ్చని అట్లాంటాలోని ఎమోరీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకురాలు డాక్టర్ శివానీ పటేల్ పేర్కొంటున్నారు. 1) పొగతాగే అలవాటు, 2) ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండే ఆహారానికి దూరంగా ఉండటం 3) హై బ్లడ్ ప్రెషర్ రాకుండా చూసుకునేందుకు ఎప్పుడూ ఒత్తిడికి గురికాకుండా ఉండటం, 4) టైప్-2 డయాబెటిస్‌ను నివారించే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం, 5) స్థూలకాయం రాకుండా, బరువు పెరగకుండా చూసుకోవడం. ఈ ఐదు అంశాలనూ పాటించడం అన్నది మన చేతుల్లో ఉన్న విషయమే. ఈ ఐదు అంశాలను పాటిస్తూ సాధ్యమైనంతవరకు వాటిని మన ఆరోగ్యాన్ని కాపాడేవిధంగా మార్పులు చేసుకుంటే గుండె సురక్షితంగా ఉంటుందంటున్నారు డాక్టర్ శివానీ. ఈ అధ్యయనం కోసం ఆమె 45 నుంచి 79 ఏళ్ల వయసున్న దాదాపు ఐదు లక్షల మందిని పరిశీలించారు. వారి జీవనశైలిని ఆరోగ్యకరంగా ఉండేలా మార్పులు చేయడం వల్ల 54 శాతంమందిలో గుండె జబ్బులను నివారించగలిగినట్లు ఆమె పేర్కొంటున్నారు. తన పరిశోధన ఫలితాలను ‘యానల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్’ అనే జర్నల్‌లో పొందుపరచినట్లు ఆమె వెల్లడించారు.