తీవ్ర తర్జనభర్జనల అనంతరం ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడలను కూడా ఏడాదిపాటు వాయిదా వేస్తూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిర్ణయం కూడా తీసుకుంది. ఈ మెగా ఈవెంట్‌కు మరో 15 నెలల సమయం ఉంది. అయితే అప్పుడు కూడా ఈ క్రీడల నిర్వహణ సాధ్యమేనా అంటూ వైద్య నిపుణులు కొత్త సందేహాలు తెరపైకి తీసుకొచ్చారు. కరోనాకు తగిన చికిత్స సిద్ధమయ్యే వరకు ఒలింపిక్ వంటి మెగా ఈవెంట్ల నిర్వహణ సరైంది కాదని వారు చెబుతున్నారు.
టోక్యో: కొత్త షెడ్యూల్ ప్రకారం టోక్యో ఒలింపిక్స్ క్రీడలు 2021 జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరగాల్సి ఉన్నాయి. అవసరమైతే ఐఓసీ మళ్లీ ఒలింపిక్ తేదీలను మార్చేందుకు సిద్ధంగా ఉండాలని అమెరికాకు చెందిన ఇమోరీ యూనివర్సిటీ వైద్య నిపుణుడు జాక్ బిన్నీ అభిప్రాయపడ్డారు. ‘స్టేడియాల్లో భారీ సంఖ్యలో ప్రేక్షకులు రావాలని కోరుకుంటూ క్రీడల నిర్వహణ గురించి మనం ఆలోచిస్తున్నాం. అయితే కనీసం కరోనాకు తగిన వ్యాక్సిన్ వచ్చే వరకైనా ఇలాంటివి జరగకుండా ఉంటే బాగుంటుంది. మైదానంలో వచ్చే ఒక్కో వ్యక్తితో కరోనా వ్యాపించే ప్రమాదం పెరుగుతూనే ఉంటుంది.
ఇప్పటికే ప్రకటించిన తేదీలు చూస్తే నిర్వాహకులు అతిగా ఆశిస్తున్నట్లే అనిపిస్తోంది. ఎందుకంటే వైరస్‌కు వ్యాక్సిన్ రావడానికి కనీసం ఏడాదిన్నర పట్టవచ్చు. అంటే 2021 చివరి వరకు ఇది సాధ్యం కాదు. ఒక స్టేడియంలో 50 వేల నుంచి లక్ష మంది వరకు ప్రేక్షకులను కూర్చోబెట్టడం అంటే అంతకంతకూ ప్రమాదం పెరిగిపోతున్నట్లే లెక్క’ అని ఆయన అన్నారు. ఒలింపిక్ వేదిక చుట్టుపక్కల తిరిగే అభిమానులకు ఇన్‌ఫెక్షన్ సోకితే అక్కడ మాత్రమే కాకుండా తిరుగు ప్రయాణంలో తమ తమ దేశాలకు కూడా వైరస్‌ను మోసుకెళ్లే ప్రమాదం ఉందని బిన్నీ చెబుతున్నారు.
కెనడాలోని మనిటోబా యూనివర్సిటీలో అంటువ్యాధుల నిరోధక విభాగానికి చెందిన ప్రొఫెసర్ జాసన్ కిండ్రాచుక్ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో సార్స్, ఎబోలా వంటి వ్యాధులు ప్రబలిన సమయంలో ఆయన తన సేవలందించారు. ‘సంవత్సరంలోపు కోవిడ్–19కు వైరస్ వస్తుందని ఆశిస్తున్నాం. అయితే ఆ సమయానికి ఒలింపిక్స్ దగ్గరకు వచ్చేస్తాయి. సరిగ్గా ప్రారంభానికి ముందు మీరు అందరికీ వ్యాక్సిన్ ఇచ్చి కూడా లాభం ఉండదు. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడానికి కాస్త ముందుగా ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది’ అని ఆయన సూచించారు.
జపాన్‌లో సాధారణ స్థితి వచ్చేందుకు కనీసం సంవత్సరం పడుతుందని, తన అంచనా ప్రకారం వచ్చే ఏడాది ఒలింపిక్స్ ఏ రకంగానూ సాధ్యం కాదని అదే దేశానికి చెందిన మరో ప్రొఫెసర్ డాక్టర్ కెంటారో వ్యాఖ్యానించడం గమనార్హం. ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ గ్లోబల్ హెల్త్ విభాగ అధిపతి దేవీ శ్రీధర్ కూడా దీనితో ఏకీభవించారు. ‘ఒకసారి వ్యాక్సిన్ వస్తేనే ఒలింపిక్స్ నిర్వహణపై మనం నమ్మకం పెట్టుకోవచ్చు. చౌకగా, అందరికీ అందుబాటులో వ్యాక్సిన్ వస్తే తిరుగుండదు. వైజ్ఞానికపరంగా దీని నిరోధం గురించి స్పష్టత రాకపోతే ఆటల గురించి మరచిపోవచ్చు’ అని శ్రీధర్ విశ్లేషించారు.
మా ప్రణాళికలు మాకున్నాయి...
తాజా విమర్శలపై టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు స్పందించారు. ‘ప్రస్తుత స్థితిలో కొందరు చేస్తున్న ఊహాగానాలపై మేమేమీ చెప్పలేం. అయితే కోవిడ్–19 వ్యాప్తి నిరోధం గురించి మా వద్ద తగిన ప్రణాళికలు ఉన్నాయి. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ కలిసి పనిచేస్తున్నాం. ఈవెంట్‌తో సంబంధం ఉన్న అందరితో చర్చిస్తూ తాజా స్థితిని సమీక్షించి తగిన నిర్ణయాలు తీసుకుంటాం. అయితే క్రీడలను మళ్లీ వాయిదా వేసే ఆలోచనే లేదు. షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్స్ సమర్థ నిర్వహణకు ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఒలింపిక్స్ జరగడానికి కనీసం నాలుగు నుంచి ఆరు వారాల ముందుగా టోక్యోకు వచ్చి రెండు వారాల క్వారంటైన్ తర్వాత అథ్లెట్లు ఒలింపిక్ గ్రామంలోకి అడుగుపెడితే సరిపోతుందని కూడా ఒక ప్రతిపాదన వచ్చింది’ అని నిర్వహణ కమిటీ అధికార ప్రతినిధి మాసా టకాయా స్పష్టం చేశారు.
అప్పుడైనా జరుగుతాయా?
Published Tue, Apr 21 2020 12:39 AM | Last Updated on Tue, Apr 21 2020 4:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment