ఇదే వ్యూహం.. పాటిస్తే విజయం
సంకల్ప బలమే అసలైన ఆయుధం
కష్టపడి చదివితే ఉద్యోగం మీదే..
కాబోయే వీఆర్వో, వీఆర్ఏలకునేటి ఉద్యోగుల టిప్స్
భర్త ప్రోత్సాహంతో వైకల్యాన్ని జయించా
పుట్టుకతోనే వికలాంగురాలిని. బీకాం, బీఈడీ చదివా. జగ్గయ్యపేటలోని లిటిల్ ఏంజిల్స్ హైస్కూల్లో టీచర్‌గా పనిచేస్తూ 2012లో వీఆర్ఏ పరీక్ష రాశా. అదే పాఠశాలల పనిచేస్తున్న నా భర్త కరుణాకర్ నన్ను ఎంతగానో ప్రోత్సహించి పరీక్షకు సిద్ధంచేశారు. మూడు నెలలపాటు రోజుకు 8 గంటలకు పైగా కష్టపడి చదివా. గ్రామీణ అభివృద్ధి, విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై ఎక్కువగా దృష్టిసారించా. అమ్మ అన్నీ దగ్గరుండి చూసుకోవడంతో రాత్రులు, తెల్లవారు జామునే నిద్రలేచి చదువుకునేదాన్ని. అమ్మ సహకారం, భర్త ప్రోత్సాహం, నా కృషి ఫలించి ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏగా పనిచేస్తున్నా.
- నోముల కనకదుర్గ, జగ్గయ్యపేట
సాక్షి తోడ్పాటుతో ఉద్యోగం
వత్సవాయి మండలం మక్కపేట గ్రామానికి చెందిన నేను ఎమ్మెస్సీ చదివా. మొదటి ప్రయత్నంలోనే వీఆర్వోగా ఎంపికై పెనుగంచిప్రోలు మండలంలో విధులు నిర్వహిస్తున్నా. సాక్షి దినపత్రికలో వచ్చే బిట్లు ప్రతిరోజూ చదివా. గురువారం వచ్చే భవిత మార్గదర్శకత్వంచేసింది. పరీక్షకు నెల రోజుల ముందు నుంచి వచ్చిన మోడల్ పేపర్లు బాగా ఉపయోగపడ్డాయి. దీంతో పరీక్షలో విజయం సాధించి ఉద్యోగం పొందా. గ్రామీణ ప్రజలకు సేవ చేయటంలో ఎంతో తృప్తి కలుగుతోంది.
- గుగులోతు లావణ్య, వీఆర్వో, పెనుగంచిప్రోలు
ఏకాగ్రత అవసరం
ఏకాగ్రతతో అన్ని అంశాలను చదువుకోవాలి. ఆ చదువుకున్నదానిలో ఎంతవరకు అవగాహన చేసుకున్నామన్న అంశాన్ని అభ్యర్థులు గ్రహించాలి. గ్రామీణ వాతావరణంపై ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. పూర్వపు పరీక్షల మోడళ్ల్ పేపర్లను చదివి అర్థం చేసుకోవాలి. రోజుకు 5 నుంచి 6 గంటల సమయం ఏకాగ్రతతో చ దవటం వల్ల టాపర్‌గా నిలిచాను. పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం తథ్యం.
- తేరా వినోద్‌కుమార్, పూర్వపు జిల్లా టాపర్, ఆచవరం వీఆర్వో
అమ్మే స్ఫూర్తి
నేను ఎమ్మెస్సీ, బీఈడీ చేశా. నిత్యం అమ్మ పడే కష్టం నన్ను ప్రభావితంచేసింది. కుటుంబపోషణకు ఆమె ఎంతో కష్టపడింది. నేను కూడా ఎంత కష్టపడైనా ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకున్నా. 2012 వీఆర్వో, వీఆర్ఏ నోటిఫికేషన్ వెలువడటంతో పరీక్షకు సిద్ధమయ్యా. మూడు నెలలపాటు కష్టపడిచదివా. జనరల్ సైన్స్, గ్రామీణాభివృద్ధి, అర్థమేటిక్స్, లాజికల్ స్కిల్స్ అంశాలపై రోజుకు 8 గంటలకు పైగా శ్రమించా. అమ్మ, తమ్ముడు ఎంతో సహకరించారు. ప్రతి అంశాన్ని ప్రతిరోజూ ఎక్కువసార్లు మననం చేసుకున్నా. తొలి ప్రయత్నంలో వీఆర్ఏగా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం జగ్గయ్యపేట మండలంలోని బలుసుపాడు వీఆర్ఏగా పనిచేస్తున్నా. ప్రస్తుతం వీఆర్వో పరీక్షకు సిద్ధమవుతున్నా. ఆత్మవిశ్వాసంతో కష్టపడి చదివితే ఎవరైనా అనుకున్నది సాధించవచ్చు.
- కొంగల బలుసుపాడు వీఆర్ఏ జగ్గయ్యపేట
రోజూ దినపత్రికలు చవివా
నేను బీఎస్సీ చదివాను. 2012 వీఆర్వో, వీఆర్ఏ నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి రోజూ దినపత్రికల్లో ఇచ్చిన ప్రశ్నలను వదలకుండా చదివా. ముఖ్యమైనవి అనుకుంటే వేరే పుస్తకంలో రాసుకున్నా. విజయవాడలోని స్నేహితుని గదిలో ఉండి పరీక్షలకు సిద్ధమయ్యా. మొదటి ప్రయత్నంలోనే వీఆర్ఏగా ఉద్యోగం వచ్చింది. మా అన్నయ్య కూడా వీఆర్ఏగా పని చేస్తున్నారు. ఆయన సూచనలు ఉపయోగపడ్డాయి.
- నెమలి జగన్మోహనరావు, వీఆర్ఏ, ముచ్చింతాల
కరెంట్ అఫైర్స్ కీలకం
టీవీల్లో, దినపత్రికల్లో వచ్చే కరెంట్ అఫైర్స్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాను. నా భర్త గణితంలో పీజీ చేశారు. అర్థమేటిక్స్లో కొన్ని షార్ట్‌కట్స్ చెప్పటంతో పరీక్ష కష్టం అనిపించలేదు. ప్రస్తుతం ఆయన వీఆర్వోకు పరీక్షకు సిద్ధమవుతున్నారు. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని పాఠ్య పుస్తకాలు చదివాను. రోజులో కొంత సమయం కేటాయించుకుని, కరెంట్ ఆఫైర్స్‌ను ఫాలో అవుతూ, ప్రణాళికా బద్ధంగా చదివితే పరీక్ష సులభంగా ఉంటుంది.
-కట్టా రాణి, గుమ్మడిదూర్రు, వీఆర్ఏ
ఎప్పుడూ చదువుతూ ఉండేవాడ్ని
వీఆర్వోగా ఎంపిక కావాలంటే ప్రభుత్వం గ్రామస్థాయిలో అమలుచేసే సంక్షేమ పథకాలపై అభ్యర్థులకు పూర్తిస్థాయి అవగాహన ఉండాలి. మచిలీపట్నం లక్ష్మణరావుపురానికి చెందిన నేను ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తలంపుతో చదివాను. ఒకవైపు ఎల్ఐసీలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తూ గ్రూప్-2కు ప్రిపేర్ అయ్యేవాడ్ని. వీఆర్వో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావటంతో ఎల్ఐసీలో ఉద్యోగాన్ని వదులేసుకున్నా. మూడు నెలల పాటు రోజుకు 15 నుంచి 16 గంటలు చదివాను. తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 6 గంటల వరకు, 6 గంటలకు అన్ని పత్రికలు కొని దానిలో వీఆర్వో పరీక్షకు సంబంధించిన సమాచారం చూసేవాడ్ని. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు లెక్కల పుస్తకాలు పదో తరగతి వరకు సాంఘికశాస్త్ర, సైన్స్ పాఠ్యాంశాలు చదివా. అర్థమేటిక్స్లో మార్కులు సాధించేందుకు ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకాలు, కరెంటు అఫైర్స్ కోసం పత్రికలను ఆశ్రరుుంచా. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వాటి పేర్లు, అమలుతీరు, ప్రజలకు ఎలా ఉపయోగపడతారుు... వంటి అంశాలపై దృష్టిపెట్టాను. ప్రభుత్వ పథకాలు గ్రామస్థాయి ప్రజలకు ఉపయోగపడే విధానాన్ని పూర్తిగా తెలుసుకున్నాను. సమయాన్ని వృథా చేయకుండా చదవడం వల్లే ఇప్పుడు ఉద్యోగం సాధించాను. వీఆర్వో పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించటంతో మెరిట్ జాబితాలో ఎంపికయ్యూను. మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి, గూడూరు మండలాల నుంచి నేను ఒక్కడినే వీఆర్వోగా ఎంపికయ్యూను. ఉద్యోగం సాధించి మా అమ్మ షహజాది కోరిక తీర్చాను. ప్రస్తుతం గ్రూప్-1కి సిద్ధమవుతున్నాను.
- మహ్మద్ షాకీరుల్లా, బందరు మండలం రుద్రవరం వీఆర్వో