ఉద్యోగుల ఆరోగ్యానికి మరింత భద్రత
సాక్షి, అమరావతి: ఉద్యోగుల ఆరోగ్య భద్రతలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మేలు చేసేలా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్)ను తీర్చిదిద్దారు. నిధులు కూడా ఎక్కువ కేటాయిస్తున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో ఉద్యోగుల హెల్త్ స్కీమ్‌పై ఖర్చు చేసిన మొత్తంకంటే ఈ నాలుగేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎక్కువ వెచ్చించింది. చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో ఈహెచ్ఎస్ కింద రూ.748.81 కోట్లు మాత్రమే వ్యయం చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఈ స్కీం కింద రూ.1,094.69 కోట్లు ఖర్చు చేసింది. మరో పక్క ఈహెచ్ఎస్ ఉన్నప్పటికీ ఉద్యోగుల అభ్యర్థన మేరకు మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు పొడిగించింది.
అవాంతరాల్లేకుండా ఈహెచ్ఎస్
ఈహెచ్ఎస్కు ఎటువంటి అవాంతరాల్లేకుండా, ఆస్పత్రులకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగకుండా చర్యలు చేపట్టింది. ఈహెచ్‌స్‌కు సంబంధించి ఉద్యోగులు, ప్రభుత్వ కంట్రిబ్యూషన్‌ను ఏ నెలకు ఆ నెల ఎంప్లాయీస్ హెల్త్ స్కీము ట్రస్టుకు జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల నుంచి ఇది అమల్లోకి వస్తోంది. ఇందుకు ఆర్థిక శాఖ ఆమోదం కూడా తెలిపింది. అంటే ఈ నెల ఉద్యోగులు, ప్రభుత్వ వాటా వచ్చే నెలలో నేరుగా ట్రస్టుకు జమ అవుతుంది. తద్వారా ఆస్పత్రులకు ఈహెచ్ఎస్ చెల్లింపులు సకాలంలో జరుగుతాయి. దీనివల్ల ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల వైద్యానికి ఎటువంటి అవాంతరాలు ఉండవు. ఉద్యోగులకు మెడికల్ రీయింబర్స్మెంట్ కింద గత రెండేళ్లలో రూ..242 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 28,097 బిల్లులకు రూ.109.84 కోట్లు, 2022–23లో 16,495 బిల్లులకు రూ.132.41 కోట్లు మంజూరు చేసింది.
క్లెయిమ్స్ పరిష్కారంలో జాప్యం ఉండదు: వెంకటరామిరెడ్డి
ఎంప్లాయీస్ హెల్త్ స్కీములో ఉద్యోగులు, ప్రభుత్వ కంట్రిబ్యూషన్లను నెలవారీ ట్రస్టుకు జమ చేయడం వల్ల ఆస్పత్రులకు క్లెయిమ్స్ పరిష్కారంలో ఇకపై జాప్యం ఉండదని, ఇది ఉద్యోగులకు చాలా మేలు చేస్తుందని రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు కె.వెంకటరామి రెడ్డి తెలిపారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను పొడిగించడం కూడా ఉద్యోగులకు మేలు చేకూర్చడమేనని చెప్పారు. హెల్త్ స్కీముల్లో ఎటువంటి ఇబ్బందులున్నా వెంటనే పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు.