employees bandh
-
మళ్లీ నిజాం షుగర్స్ రక్షణ ఉద్యమం
బోధన్: మూతపడిన ఎన్డీఎస్ఎల్ (నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్) లిక్విడేషన్కు తాజాగా ఎన్సీఎల్టీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, రక్షణ కోసం మళ్లీ రాజకీయ పార్టీలు ఉద్యమ బాట పట్టాయి. తెలంగాణ ఆవిర్భావనంతరం 2014 లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో , మలి దశ తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని పూర్వవైభవం తెస్తామని ఇచ్చిన హామీని ప్రస్తావిస్తున్నాయి. ఇచ్చిన మాటకు కట్టుబడి ఫ్యాక్టరీ స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా షుగర్ ఫ్యాక్టరీ అమ్మేందుకు రంగం సిద్ధమవుతున్న పరిస్థితిపై ప్రతిపక్ష పార్టీలు నిరసన గళం ఎత్తాయి. స్వరాష్ట్ర పాలనలో ఫ్యాక్టరీకి పూర్వవైభవం వస్తోందని ఆశిస్తే, నడిచే ఫ్యాక్టరీ మూతపడిందని, వందలాది మంది కార్మికలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని, పండించిన చెరుకు పంటను ప్రైవేట్ చక్కెర ఫ్యాక్టరీలకు తరలించేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారని, ఫ్యాక్టరీ మూతపడి మూడున్నరేళ్లు గడిచినా ప్రభుత్వం పునరుద్ధరణవిషయంలో కాలయాపన చేస్తోందని, నిర్లక్ష్యం వహిస్తోందని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే శివసేన, బీజేపీలు ధర్నా, రాస్తారోకోలు చేపట్టాయి. కాంగ్రెస్, వామపక్ష, విప్లవ కమ్యూనిస్టు పార్టీలు, కార్మిక సంఘాలు షుగర్ ఫ్యాక్టరీ లిక్విడేషన్ ఉత్తర్వులు రద్దు చేయించాలని డిమాండ్ చేస్తున్నాయి. నిజాంషుగర్స్ రక్షణ కమిటీ ఉద్యమ కార్యాచరణను రూపకల్పన చేస్తోంది. గురువారం బోధన్ ఆర్డీవో ఆఫీసు ఎదుట రక్షణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టాలని నిర్ణయించింది. -
పోలవరం పనులకు బ్రేక్
సాక్షి, పోలవరం : ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్లుగా పోలవరం ప్రాజెక్టు పరిస్థితి తయారైంది. ప్రాజెక్టు నిర్మాణ పనులకు బ్రేక్ పడింది. నిర్మాణ సంస్థ తీరు కారణంగా పోలవరం పనులు మరోసారి ఆగిపోయాయి. రెండు మూడు నెలలుగా ట్రాన్స్ ట్రాయ్ జీతాలు ఇవ్వడం లేదంటూ విధులు బహిష్కరించి నిన్నటి నుంచి కార్మికులు, ఉద్యోగులు నిరసనకు దిగారు. నేడు పూర్తి స్థాయిలో పనులు ఆపివేశారు. దీంతో కాంక్రీటు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఇంత జరుగుతున్నప్పటికీ ఇరిగేషన్ అధికారులు మాత్రం స్పందించడం లేదు. దివాలా దిశగా పయనిస్తున్న ట్రాన్స్ట్రాయ్ రుణాలు చెల్లించకపోవడంతో దేనా బ్యాంకు అధికారులు షాకిచ్చిన విషయం తెలిసిందే. ఆ సంస్థకు చెందిన వాహనాలను, సాంకేతిక యంత్రాలను సీజ్ చేశారు. గతంలో ఇచ్చిన నోటీసులకు సంస్థ స్పందించపోవడంతో దేనా బ్యాంకు ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇది జరిగి నాలుగు రోజులు కాకమునుపే ఇప్పుడు పోలవరం పనులకు మళ్లీ బ్రేక్ పడింది. 200 మందికి పైగా డ్రైవర్లు, ఆపరేటర్లు, సూపర్ వైజర్లు, సాంకేతిక సిబ్బంది విధులను బహిష్కరించి నిరసనకు దిగారు. పోలవరం వెళ్లే రోడ్డులో రాళ్లు, టైర్లు పెట్టి వారు తమ ఆందోళనను తెలుపుతున్నారు. వీరంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన వారే. కాగా, ఇంత జరుగుతున్నా కూడా ట్రాన్స్స్టాయ్కు వత్తాసు పలుకుతున్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి స్పందన లేకుండా పోతోందని అంటున్నారు. -
శ్రీహరి కోటలో ఉద్యోగుల బంద్
శ్రీహరికోట : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఉద్యోగులు మంగళవారం బంద్ పాటించారు. స్టేషన్ మొదటి గేటు వద్ద బైఠాయించిన యూనియన్ నాయకులు లోపలికి ఎవరూ వెళ్లకుండా అడ్డుకున్నారు. సీపీఎం, సీపీఐ నాయకులు ఈ బంద్కు నేతృత్వం వహించారు. దీంతో స్టేషన్ వద్ద కొనసాగే పనులకు తీవ్ర అంతరాయం కలిగింది.