
సాక్షి, పోలవరం : ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్లుగా పోలవరం ప్రాజెక్టు పరిస్థితి తయారైంది. ప్రాజెక్టు నిర్మాణ పనులకు బ్రేక్ పడింది. నిర్మాణ సంస్థ తీరు కారణంగా పోలవరం పనులు మరోసారి ఆగిపోయాయి. రెండు మూడు నెలలుగా ట్రాన్స్ ట్రాయ్ జీతాలు ఇవ్వడం లేదంటూ విధులు బహిష్కరించి నిన్నటి నుంచి కార్మికులు, ఉద్యోగులు నిరసనకు దిగారు. నేడు పూర్తి స్థాయిలో పనులు ఆపివేశారు. దీంతో కాంక్రీటు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఇంత జరుగుతున్నప్పటికీ ఇరిగేషన్ అధికారులు మాత్రం స్పందించడం లేదు.
దివాలా దిశగా పయనిస్తున్న ట్రాన్స్‌ట్రాయ్ రుణాలు చెల్లించకపోవడంతో దేనా బ్యాంకు అధికారులు షాకిచ్చిన విషయం తెలిసిందే. ఆ సంస్థకు చెందిన వాహనాలను, సాంకేతిక యంత్రాలను సీజ్ చేశారు. గతంలో ఇచ్చిన నోటీసులకు సంస్థ స్పందించపోవడంతో దేనా బ్యాంకు ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇది జరిగి నాలుగు రోజులు కాకమునుపే ఇప్పుడు పోలవరం పనులకు మళ్లీ బ్రేక్ పడింది. 200 మందికి పైగా డ్రైవర్లు, ఆపరేటర్లు, సూపర్ వైజర్లు, సాంకేతిక సిబ్బంది విధులను బహిష్కరించి నిరసనకు దిగారు. పోలవరం వెళ్లే రోడ్డులో రాళ్లు, టైర్లు పెట్టి వారు తమ ఆందోళనను తెలుపుతున్నారు. వీరంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన వారే. కాగా, ఇంత జరుగుతున్నా కూడా ట్రాన్స్‌స్టాయ్‌కు వత్తాసు పలుకుతున్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి స్పందన లేకుండా పోతోందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment