సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో మట్టి పనులు చేయకుండానే చేసినట్లు చూపి.. రూ.112.47 కోట్లు కాజేయడంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించేందుకు రంగం సిద్ధం చేసిందని తెలియడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రమత్తమయ్యారు. కేంద్రం విచారణకు ఆదేశించేలోగా అక్రమాలను కప్పిపుచ్చడానికి పావులు కదుపుతున్నారు. అక్రమంగా కాజేసిన సొమ్ములో ఇప్పటికే రూ.10.57 కోట్లను ఏలూరు పీఏవో(పే అంట్ అకౌంట్స్ విభాగం) ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్‌ట్రాయ్‌కి బిల్లులు చెల్లించే క్రమంలో వసూలు చేసింది. ట్రాన్స్‌ట్రాయ్‌కి బ్యాంకు గ్యారెంటీలను వెనక్కి ఇచ్చి.. వాటి ద్వారా మిగతా రూ.101.89 కోట్లను వసూలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రూ.101.89 కోట్ల బ్యాంకు గ్యారంటీలను ట్రాన్స్‌ట్రాయ్‌కి వెనక్కి ఇచ్చేస్తూ సాక్షాత్తూ సీఎం చంద్రబాబే ఫైల్‌పై రెండు రోజుల క్రితం సంతకం చేయడాన్ని బట్టి చూస్తే కాజేసిన సొమ్ము ఏ బాబు జేబులోకి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.
గుట్టుచప్పుడు కాకుండా రికవరీ చేసే యత్నం
పోలవరం ప్రాజెక్టులో మట్టి పనులు చేయకుండానే చేసినట్లు చూపి బిల్లుల రూపంలో ముఖ్యనేత ప్రజాధనాన్ని దోచుకోవడాన్ని మార్చి 24న ‘మట్టిలో రూ.150.93 కోట్లు మింగేశారు’ శీర్షికన ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. అక్రమాలను సాక్ష్యాధారాలతో సహా బహిర్గతం చేసింది. ఈ కథనంపై స్పందించిన ఆడిటింగ్.. పే అండ్ అకౌంట్స్ విభాగం(పీఏవో) క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసింది. పనులు చేయకుండానే చేసినట్లుగా రికార్డులు సృష్టించి.. రూ.112.47 కోట్లు కాజేశారని ఆడిట్, పీఏవో విభాగాలు నిర్ధారించాయి. కాజేసిన సొమ్మును గుట్టు చప్పుడు కాకుండా రికవరీ చేసి, అక్రమాలను కప్పెట్టాలని పీఏవో విభాగం అధికారులపై ముఖ్యనేత ఒత్తిడి తెచ్చారు. అందుకు తలొగ్గిన అధికారులు కాంట్రాక్టర్‌కు 37వ బిల్లును చెల్లించేటపుడు రూ.10.57 కోట్లు మినహాయించుకున్నారు. మిగతా రూ.101.89 కోట్లను రికవరీ చేయాల్సి ఉంది. ఈలోగా పోలవరం ప్రాజెక్టు పనులను ట్రాన్స్‌ట్రాయ్ నుంచి తప్పించి నామినేషన్ విధానంలో ఇతర కాంట్రాక్టర్లకు అప్పగించారు. దాంతో ట్రాన్స్‌ట్రాయ్ ఎలాంటి పనులు చేయడం లేదు.
కేంద్రం చర్యలపై లీకులు
పోలవరం ప్రధాన జలాశయం పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలంటూ ఏలూరు పీఏవోకు ప్రాజెక్టు అధికారులు ప్రతిపాదనలు పంపారు. రూ.101.89 కోట్లు రికవరీ చేసేవరకూ బిల్లులు చెల్లించే ప్రశ్నే లేదని తేల్చిచెబుతూ జూలై 10న పోలవరం అధికారులకు ఏలూరు పీఏవో కె.సోమయ్య లేఖ రాశారు. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన యూసీలను(యుటిలైజేషన్ సర్టిఫికెట్లు) నిశితంగా పరిశీలించి, ఆడిటింగ్ చేసింది. మట్టి పనులు చేయకుండానే చేసినట్లు చూపి బిల్లులు చేసుకోవడం.. అందులో కొంత సొమ్మును ఏలూరు పీఏవో అధికారులు రికవరీ చేయడం.. ఇంకా రికవరీ చేయాల్సిన మొత్తం భారీగా ఉండటాన్ని పీపీఏ గుర్తించింది. ఇదే అంశంపై కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌కు జూలై 16న పీపీఏ సమగ్రంగా నివేదిక ఇచ్చింది. పనులు చేయకుండా భారీ ఎత్తున నిధులు కాజేయడంపై నివ్వెరపోయిన యూపీ సింగ్.. ఈ అంశాన్ని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ దోపిడీ పర్వంపై దర్యాప్తునకు కేంద్రం సిద్ధమవుతోందన్న విషయం కేంద్రంలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న అధికారి దృష్టికి వెళ్లింది. వెంటనే సదరు అధికారి ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుకు తెలియజేసి, అప్రమత్తం చేసినట్లు సమాచారం. నిధుల స్వాహాపై విచారణకు ఆదేశిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసేలోగా, అక్రమాలను సరిదిద్దుకోవాలంటూ ఆ అధికారి సీఎం చంద్రబాబుకు సూచించినట్లు తెలిసింది.
లీకువీరుడు సూచన మేరకు..
పోలవరం మట్టి పనుల్లో సాగించిన అక్రమాలను కప్పిపుచ్చుకుని, దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు కేంద్రంలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న లీకువీరుడి సూచనల మేరకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ట్రాన్స్‌ట్రాయ్ ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోయిన నేపథ్యంలో ఆ సంస్థ నుంచి రికవరీ చేయడం సాధ్యం కాదని భావించిన చంద్రబాబు మదిలో మెరుపులాంటి ఆలోచన వచ్చింది. పోలవరం హెడ్ వర్క్స్‌ను దక్కించుకుని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సమయంలో బ్యాంకు గ్యారంటీగా చూపిన నిధులను ఆ సంస్థకు వెనక్కి ఇచ్చి.. వాటినే రికవరీ చేస్తూ ఏలూరు పీఏవో వద్ద జమా చేసేలా వ్యూహం రచించారు. ఇందులో భాగంగా ట్రాన్స్‌ట్రాయ్‌కి బ్యాంకు గ్యారంటీలను వాపసు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పోలవరం సీఈ శ్రీధర్ గత నెల 3న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేలా చక్రం తిప్పారు. ఆ ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేయాలంటూ జలవనరుల శాఖ అధికారులపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు.
ట్రాన్స్‌ట్రాయ్‌తో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలోని 47(1) నిబంధన ప్రకారం.. ప్రాజెక్టు పనులు పూర్తయ్యే వరకూ బ్యాంకు గ్యారంటీలను వెనక్కి ఇవ్వడం కుదరదని అధికారులు తేల్చిచెప్పారు. బ్యాంకు గ్యారంటీలను వెనక్కి ఇవ్వాలంటే ఆ నిబంధనను సడలించాలని, అది తమ పరిధిలో లేదని స్పష్టం చేశారు. దాంతో ఆ ఫైల్‌ను ఆర్థిక శాఖకు పంపాలంటూ చంద్రబాబు ఆదేశించారు. ఆ మేరకు జలవనరుల శాఖ పంపిన ఫైల్‌ను ఆర్థిక శాఖ తోసిపుచ్చింది. ఆ నిబంధనను సడలించే అధికారం తమ పరిధిలో లేదని పేర్కొంది. దాంతో సీఎం చంద్రబాబు ఆ నిబంధనను సడలిస్తూ, ట్రాన్స్‌ట్రాయ్‌కి రూ.101.89 కోట్ల బ్యాంకు గ్యారంటీని వెనక్కి ఇచ్చే ఫైల్‌పై రెండురోజుల క్రితం సంతకం చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఒకట్రెండు రోజుల్లో వెలువడనున్నాయి. ఆ ఉత్తర్వులు వెలువడిన వెంటనే బ్యాంకు గ్యారంటీలను వెనక్కి ఇచ్చి, వాటిని ఏలూరు పీఏవో విభాగంలో జమా చేసేలా మాస్టర్ ప్లాన్ వేశారు.
ఒక తప్పును దిద్దుకునే క్రమంలో మరో తప్పు
పోలవరం హెడ్ వర్క్స్‌ను రూ.4,054 కోట్లతో పూర్తి చేసేందుకు 2013 మార్చి 2న రాష్ట్ర ప్రభుత్వంతో ట్రాన్స్‌ట్రాయ్ ఒప్పందం చేసుకుంది. అదే సమయంలో ఆ సంస్థకు ప్రభుత్వం రూ.314.86 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్సుగా చెల్లించింది. నిబంధనల ప్రకారం బ్యాంక్ గ్యారంటీ రూపంలో ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ ప్రభుత్వం వద్ద రూ.52 కోట్లను డిపాజిట్ చేసింది. పనులు పూర్తయిన తర్వాత బ్యాంకు గ్యారంటీని ప్రభుత్వం వడ్డీతో సహా కాంట్రాక్టర్‌కు చెల్లిస్తుంది. పనులు ప్రారంభమైన తర్వాత చెల్లించే తొలి బిల్లు నుంచే 10 శాతం చొప్పున మొబిలైజేషన్ అడ్వాన్స్‌ను వడ్డీతోసహా వసూలయ్యే వరకూ ప్రతి బిల్లులోనూ ప్రభుత్వం మినహాయించుకోవాలి. ట్రాన్స్‌ట్రాయ్ నుంచి మొబిలైజేషన్ అడ్వాన్స్‌ను వసూలు చేయకపోగా కేబినెట్‌లో తీర్మానం చేసి మరీ 2017 ఫిబ్రవరి 6న రూ.95 కోట్లను మళ్లీ మొబిలైజేషన్ అడ్వాన్స్‌గా ఇచ్చేశారు. దాంతో మొబిలైజేషన్ అడ్వాన్స్ రూ.409.86 కోట్లకు చేరుకుంది.
2013 మార్చి 2 నుంచి ఇప్పటివరకూ రూ.314.86 కోట్లపై.. 2017 ఫిబ్రవరి 6 నుంచి రూ.95 కోట్లపై ఇప్పటిదాకా వడ్డీ రూ.200 కోట్లు అయ్యింది. అసలు, వడ్డీ కలిపి రూ.609 కోట్ల మేర ట్రాన్స్‌ట్రాయ్ సర్కార్కు బకాయిపడింది. మొబిలైజేషన్ అడ్వాన్స్‌ను కాంట్రాక్టర్ నుంచి వసూలు చేయకుండా ఎప్పటికప్పుడు సడలింపును ఇస్తూ కేబినెట్‌లో తీర్మానం చేస్తున్నారు. తాజాగా ఇచ్చిన సడలింపు గడువు ఈ నెల 30తో ముగియనుంది. హెడ్ వర్క్స్‌లో పనులన్నీ ఇతర కాంట్రాక్టర్లకు అప్పగించారు. కాంట్రాక్టర్లు చేసిన పనులకు గాను వారికే బిల్లులు చెల్లిస్తున్నారు. ట్రాన్స్‌ట్రాయ్ పనులు చేయకపోవడంతో ఆ సంస్థకు బిల్లులు చెల్లించే అవకాశం లేదు. దాంతో ట్రాన్స్‌ట్రాయ్ నుంచి మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఎలా వసూలు చేయాలో తెలియక అధికారులు అందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థకు బ్యాంకు గ్యారంటీ, వడ్డీలను కలిపి రూ.101.89 కోట్లు వెనక్కి ఇచ్చేస్తే మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఎలా వసూలు చేస్తామని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఒక తప్పును దిద్దుకునే క్రమంలో ప్రభుత్వం మరో తప్పు చేస్తోందని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment