సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులు, పీఎంవో వ్యవహారాలపై ఏపీ శాసనమండలిలో సీఎం చంద్రబాబు నాయుడు, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. ప్రాజెక్టు పునరావాస బాధ్యతలు ఏపీ తీసుకుంటుందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎలా అన్నారని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. పోలవరంపై కుట్ర జరుగుతందని, తాను రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతుంటే కొందరు తనపై యుద్ధం చేస్తామంటున్నారని తెలిపారు. కొందరు తనను బోనులో నిలబెడతామంటున్నారని, కానీ తాను ఎక్కడా టెక్నికల్‌గా.. లీగల్‌గా తప్పు చేయలేదనని చంద్రబాబు చెప్పారు.
తాను అవినీతి చేయలేదని, తన కుమారుడు మంత్రి నారా లోకేశ్ విషయంలో కూడా జోక్యం చేసుకోవద్దని చెప్పానన్నారు. హోదా ఎవరికీ ఇవ్వడం సాధ్యం కాదని బీజేపీ అబద్ధం చెప్పడం వల్లే ప్యాకేజీకి ఒప్పుకున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిని పీఎంవోలో ఎందుకు అనుమతిస్తారని ప్రశ్నించిన చంద్రబాబు.. ఇచ్చేవాడికి తీసుకునేవాడు లోకువ అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రసంగానికి బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అడ్డుతగులుతూ.. ఎంపీలు ఎవరైనా ప్రధానిని కలవొచ్చునన్నారు.
సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని అడ్డుకున్న ఎమ్మెల్సీ మాధవ్ ఆయన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. పోలవరం పునరావాస బాధ్యత కేంద్రానిదేని గుర్తించాలన్న మాధవ్.. పోలవరం విషయంలో కేంద్రం చిత్తశుద్ధితో ఉందని చంద్రబాబుకు స్పష్టతనిచ్చారు. బీజేపీపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రస్తుతం దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక లేదని తెలిపారు. దీనిపై చర్చకు సిద్ధమన్న ఎమ్మెల్సీ మాధవ్.. సీఎం అంగీకరించిన ప్యాకేజీ నిధులు ఏపీకి ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. కేంద్రం నుంచి మాధవ్ నిధులు (90:10 నిష్పత్తిలో) తెస్తామంటే అన్ని పార్టీలను తాను ఒప్పిస్తానని, పారిశ్రామిక రాయితీలు కూడా తీసుకురావాలని చంద్రబాబు అడిగారు. 90:10 నిష్పత్తిలో నిధులు ఇచ్చి తీరుతామని అందుకే స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టమని కేంద్రం చెప్పిందని మాధవ్ గుర్తుచేశారు. ఎఫ్ఆర్‌బీఎం లిమిట్ పెంచుతామంటే ఏపీ ప్రభుత్వమే వద్దన్న విషయాన్ని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment