Employees Retirement
-
కోటిన్నరతో.. కృష్ణా రామా!
సాక్షి, అమరావతి: రూ.కోటిన్నర ఉంటే చాలు.. మన దేశంలో రిటైర్మెంట్ అనంతరం కృష్ణా రామా అని ప్రశాంతంగా జీవనం గడిపేయొచ్చట. అయితే.. ఈ లెక్క భారతీయులకు సంబంధించి కాదండోయ్. అమెరికన్ల కోసం మాత్రమే! ఎందుకంటే.. అమెరికా ఉద్యోగులు, రిటైరైన వారిలో 13 శాతం మంది పదవీ విరమణ అనంతర జీవితాన్ని విదేశాల్లో గడిపే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘ఏగాన్’ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. అమెరికన్లు రిటైర్మెంట్ అనంతరం వివిధ దేశాల్లో సాఫీగా జీవితం గడిపేందుకు ఎంత ఖర్చవుతుందనే గణాంకాలను ఆ సంస్థ విడుదల చేసింది. ► రిటైర్మెంట్ అనంతరం జీవించేందుకు ప్రపంచంలో అత్యధికంగా సింగపూర్‌లో ఎక్కువ వ్యయం (దాదాపు రూ.9.21 కోట్లు) కానుంది. అమెరికాతో పోలిస్తే సింగపూర్‌లోనే 60% అధికంగా రిటైర్డు జీవితానికి ఖర్చవుతుంది. ఆ తరువాత స్థానంలో ఉన్న స్విట్జర్లాండ్‌లో కూడా అమెరికాతో పోలిస్తే శేష జీవిత ఖర్చులు ఎక్కువే. ► రిటైరైన అమెరికా ఉద్యోగులు తరువాత జీవితాన్ని సాఫీగా గడపాలంటే పాకిస్థాన్‌లో రూ.1.30 కోట్లు, భారత్‌లో రూ.1.53 కోట్లకుపైగా వ్యయం అవుతుంది. ► ఓ అమెరికా ఉద్యోగి రిటైరైన తరువాత స్వదేశంలో (అమెరికా) శేష జీవితం గడపాలంటే దాదాపు రూ.5.79 కోట్లు కావాలి. -
విభజన తర్వాతే పదవీ విరమణ వయసు పెంపు
ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు తేల్చి చెప్పిన సర్కారు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచడంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొమ్మిదో, పదో షెడ్యూల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, ఉద్యోగుల విభజన పూర్తయిన తర్వాత.. ఆ సంస్థల బోర్డులు తీర్మానం చేసి పంపితే పదవీ విరమణ వయసు పెంపుపై విధానపరమైన ప్రకటన చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం శనివారం ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెం: 112) జారీ చేశారు. ప్రభుత్వ రంగసంస్థల ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించడం, ఉన్నత న్యాయస్థానం దీనిపై ప్రభుత్వ వైఖరిని స్పష్టీకరించాలని కోరడం తెలిసిన సంగతే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పై నిర్ణ యం తీసుకుంది. కాగా ప్రభుత్వ నిర్ణయా న్ని ఉద్యోగుల జేఏసీ తప్పుపట్టింది. -
సర్వీసు పరిగణన 58 ఏళ్ల వరకే
♦ ఆ తర్వాత చెల్లుబాటు కాదు ♦ ఉత్తర్వులిచ్చిన తెలంగాణ ఆర్థిక శాఖ సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీలో భాగంగా తెలంగాణకు కేటాయించిన ఉద్యోగుల రిటైర్మెంట్, సర్వీసు కాలంపై స్పష్టత ఇస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రభుత్వం అక్కడి ఉద్యోగుల పదవీ కాలాన్ని 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచింది. తెలంగాణ ప్రభుత్వం యథాతథంగా 58 ఏళ్ల పదవీ కాలాన్ని కొనసాగించింది. అయితే 58 ఏళ్లకు పైబడ్డ ఉద్యోగులు ఇప్పటికీ ఏపీలో విధులు నిర్వర్తిస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల తుది కేటాయింపులో వీరు తెలంగాణకు వస్తే సర్వీసు కాలం, రిటైర్మెంట్ తేదీని ఎలా పరిగణించాలనే చిక్కుముడి తలెత్తింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందుకు సంబంధించిన స్పష్టమైన వివరణ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సోమవారం (జీవో నం.47) ఉత్తర్వులు జారీ చేశారు. 58 ఏళ్లకు మించి ఏపీలో పనిచేసిన ఉద్యోగులు తుది పంపిణీలో తెలంగాణకు వచ్చినట్లయితే వారి రిటైర్మెంట్ వయస్సు 58 ఏళ్లు నిండిన తేదీనే పరిగణించాల్సి ఉంటుందని అందులో స్పష్టం చేశారు. ఆ వయస్సు దాటి పని చేసిన కాలాన్ని ‘జస్ట్ సర్వీస్’గా పరిగణిస్తామని అందులో పేర్కొన్నారు. పెన్షన్ ప్రయోజనాలు, ఇంక్రిమెంట్లకు ఈ కాలం చెల్లుబాటు కావని... ఈ అదనపు కాలంలోని లీవులు సైతం పరిగణనలోకి రావని పేర్కొంది.