ఒక్కొక్కరికి రూ.6 వేల ఆఫర్
హన్మకొండ, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల వేళ పోలింగ్ రోజు వరకూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు... ఇప్పుడు ఉద్యోగుల ఓట్లపై గురి పెట్టారు. ఒక్క ఓటు అటో.. ఇటో పడితే ఫలితాలు తారుమారవుతాయనే గుబులుతో ఉన్న ప్రధాన పార్టీల నాయకులు ఆఖరి ప్రయత్నంగా పోస్టల్ బ్యాలెట్‌పై దృష్టి సారించారు. బాక్స్‌లో పడే ప్రతి ఓటుకూ పడరాని పాట్లు పడుతున్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తమ ఖాతాలో వేసుకునేందుకు తంటాలు పడుతున్నారు.
హోరాహోరీగా ఎన్నికల పోరు సాగినట్లు ఇదివరకే అంచనాకు వచ్చిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉద్యోగుల ఇంటికి క్యూ కడుతున్నారు. ఈ ఓట్లు తమకు అనుకూలంగా మారుతాయనే ఆశతో గంపగుత్తగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కొంటున్నారు. కౌంటింగ్ ముందు రోజు వరకు.. అంటే ఈనెల 15వ తేదీ వరకు ఉద్యోగులు ఓటు వేసి దాఖలు చేసే అవకాశముండడంతో అభ్యర్థులు ప్రలోభ పర్వాన్ని వేగిరం చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 10,892 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోగా...ఎన్నికల కమిషన్ వీరందరికీ అనుమతి ఇచ్చింది. ఆయా సెగ్మెంట్లలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయికి పైగా ఉన్నారుు. డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, ములుగు నియోజకవర్గాల్లో వెయ్యి మందికిపైగా పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు ఉన్నారు.
ముఖాముఖి పోటీలో ప్రాధాన్యం
నియోజకవర్గాల వారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తక్కువే అయినప్పటికీ... లెక్కింపులో ఇవే కీలకంగా మారనున్నాయి. అభ్యర్థుల మధ్య పోటాపోటీ ఉన్నప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లే జయాపజయాలను నిర్ణయించనున్నాయి. కౌంటింగ్ మొదలయ్యే రోజున తొలుత రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్‌పై పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వేసి ముందుగానే లెక్కిస్తారు. దీంతో వీటిని ఎక్కువగా తమకే దక్కించుకునేలా అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. సెగ్మెంట్లలో ఎన్నికల విధులకు వెళ్లిన ఉద్యోగుల వివరాలు సేకరించి... పేరుపేరునా వారికి ఫోన్ చేస్తున్నారు. ఎన్నికలు పూర్తి అయినా... ఉద్యోగుల ఇంటి వద్ద అభ్యర్థులు క్యూ కడుతున్నారు. గంపగుత్తగా పోస్టల్ బ్యాలెట్లను వేయించుకునేందుకు పాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలకు డిమాండ్ పెరిగింది. ప్రధానంగా విద్య, పోలీస్ శాఖలో ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఆయా సంఘాల నేతలతో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు గానీ... వారి తరఫున నాయకులు గానీ బేరం మాట్లాడుకుంటున్నారు.
ఒక్క ఓటుకు రూ. 6 వేలు
తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత గతంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఈ సెగ్మెంట్లో ఆయనపై బలమైన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దీంతో సదరు నేత గత ఎన్నికల్లో అనుసరించిన మార్గాన్నే ఎంచుకున్నారు. ఈ సెగ్మెంట్లో ఒక్కో పోస్టల్ బ్యాలెట్ ఓటుకు రూ. 6 వేలు చెల్లిస్తున్నట్లు తెలిసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కొనుగోలు కోసం హైదరాబాద్ ప్రధాన రహదారిలో ఒక ఆఫీస్‌ను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. సాధారణంగా ఎన్నికలు పూర్తి కాగానే... ప్రచారం కోసం తీసుకున్న కార్యాలయాలన్నీ తీసేస్తారు.
కానీ... పోస్టల్ బ్యాలెట్ ఓట్ల బేరసారాల కోసం ఇక్కడ ఓ ఆఫీస్‌ను నడుపుతున్నారు. దీని కోసం ప్రత్యేకంగా తన వర్గంలోని ఓ ముఖ్య నేతను ఉద్యోగులతో బేరసారాలు నడిపేందుకే మేనేజరుగా నియమించినట్లు సమాచారం. ఇటీవల ఎన్నికల బందోబస్తు నిర్వహించిన ఉద్యోగులు... 70 ఓట్లను ఒక్క ఓటుకు రూ. 6 వేల చొప్పున అమ్ముకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా పోటాపోటీగా ఉన్న నర్సంపేట, వరంగల్ తూర్పు, డోర్నకల్, ములుగు, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, పాలకుర్తి సెగ్మెంట్లలో ఒక్క పోస్టల్ బ్యాలెట్ ఓటుకు రూ. 5 వేలకు తక్కువ కాకుండా కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది.
ఇంకా దాస్తున్నారు..
కొందరు ఉద్యోగులు ఓటు వేయకుండా దాచి పెట్టుకుంటున్నారు. సమయం దగ్గర పడే కొద్దీ... వీటికి మంచి డిమాండ్ వస్తుందనే ఆశతో వారు ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్లు తమ దగ్గర ఉన్నాయంటూ ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ కీలక నేత ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ సెగ్మెంట్లో పోస్టల్ బ్యాలెట్ తీసుకున్న ఉద్యోగులు ఇంకా ఒక్కటి కూడా సమర్పించలేదు. దీన్ని బట్టి వాటికి ఉన్న డిమాండ్ తేటతెల్లమవుతోంది. ఆయన తరఫున స్థానికంగా ఓ సీనియర్ నేత వాటిని ఎక్కువ ధరకు సేకరించి... వాటిపై సంతకాలు తీసుకుని ఓట్లు తానే వేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.