employement oppurtunities
-
నిరంతర జాబ్ మేళాలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలు వచ్చే వరకు జాబ్ మేళాలు నిరంతరం నిర్వహిస్తామని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, పార్టీ అనుబంధ విభాగాల కో–ఆర్డినేటర్ వి.విజయసాయిరెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ మెగా జాబ్‌మేళాల్లో భాగంగా ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నిరుద్యోగుల కోసం మే 7, 8 తేదీల్లో గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న జాబ్ మేళా పోస్టర్‌ను పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు తిరుపతి, విశాఖ, గుంటూరులో మెగా జాబ్ మేళాలు నిర్వహించి 15 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పామన్నారు. తిరుపతి, విశాఖపట్నం జిల్లాల్లో నిర్వహించిన జాబ్ మేళాలకు అపూర్వ స్పందన లభించిందని, 30,473 మందికి ఇప్పటికే ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. చెప్పిన దానికంటే అధికంగా ఉద్యోగాలు కల్పించడంతో ఓర్వలేని ప్రతిపక్షాలు జాబ్ మేళాలపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. జాబ్‌మేళాలో 148 కార్పొరేట్ సంస్థలు జాబ్ మేళాల్లో ఉద్యోగాలు పొందిన వారికి విద్యార్హతల ఆధారంగా రూ.15 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనంతో కార్పొరేట్ సంస్థలు నియామక పత్రాలను అందజేశాయని తెలిపారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించే జాబ్ మేళా కోసం వెబ్సైట్ ద్వారా ఇప్పటికే 77 వేల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోగా 148 కార్పొరేట్ సంస్థలు పేర్లను నమోదు చేసుకున్నాయని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన ద్వారా తలసరి ఆదాయం, పరిశ్రమల ఉత్పాదకత పెరిగి తద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి చెందుతుందన్నారు. ఇది రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జలవనరులు, పౌర సరఫరా, సాంఘిక సంక్షేమ శాఖల మంత్రులు అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
ఆ రంగంలో మూడు కోట్ల ఉద్యోగాలు - టాటా గ్రూప్ చైర్మన్
భవిష్యత్తులో డిజిటల్ రంగం కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు టాటా గ్రూపు చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్. విద్యా, వైద్యం, వ్యాపారం ఇలా అన్ని రంగంల్లో డిజిటల్ కీలక పాత్ర పోషిస్తుందని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సెమికండర్లు, 5జీ ఎక్విప్మెంట్ తయారీలోకి టాటా అడుగుపెడుతుందని ప్రకటించారు. ఈ సందర్భంగా డిజిటల్ రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలపై జాతీయ మీడియాకు ఆయన వివరించిన అంశాల్లో ప్రధానమైనవి ఇలా ఉన్నాయి. ఈ నాలుగే కీలకం కరోనా తర్వాత పరిస్థితులూ పూర్తిగా మారిపోయాయి. జీవన విధానం మారిపోయింది, పని చేఏ తీరులో మార్పులు వచ్చాయి. వ్యాపారం కూడా రూపు మార్చుకుంటోంది. రాబోయే రోజుల్లో డిజిటలీకరణ, కొత్త రకం సప్లై చైయిన్, పర్యవరణానికి హానీ చేయకుండా అభివృద్ధి చెందడం ముఖ్యమైన అంశాలుగా మారబోతున్నాయి. వీటన్నింటీలో ఆరోగ్యం కాపాడుకోవడం ఓ అంతర్భాగంగా ఉంటుంది. ఈ నాలుగు అంశాల్లో వ్యాపార విస్తరణపై టాటా గ్రూపు దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం టాటా గ్రూపు ఆధీనంలో ఉన్న అన్ని వ్యాపారాల్లో ఈ నాలుగు థీమ్‌లకు అనుగుణంగా భవిష్యత్ ప్రణాళికలు ఉంటాయి. టేకోవర్లు డిజిటలీకరణ అని సింపుల్‌గా చెప్పుకున్నాం. కానీ ప్రయాణాలు, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్, ఎడ్యుకేషన్ ఇలా అన్నింటా డిజిటలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది చాలా పెద్ద పని. ఈ రంగంలో విస్తరించేందుకు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలి. అవసరాలను బట్టి కొన్ని సంస్థలను కొనాల్సి రావచ్చు. సెమికండక్టర్ల తయారీలో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సెమి కండక్టర్ల కొరత ఉంది. భవిష్యత్తులో వీటికి మరింత డిమాండ్ ఉంటుంది. వ్యూహాత్మకంగా టాటా గ్రూపు సెమికండక్టర్ల తయారీ పరిశ్రమలోకి అడడుగుపెడుతోంది. ఇప్పటి వరకు సెమికండక్టర్ల తయారీకి చాలా దేశాలు చైనాపై ఆధారపడేవి. ప్రపంచ వ్యాప్తంగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చాలా దేశాలు చైనాకు ప్రత్యామ్నయం చూస్తున్నాయి. ఈ అవకాశాన్ని ఇండియా వినియోగించుకోవాలి. అందుకే సెమికండక్టర్లు, 5జీ టెక్నాలజీ ఎక్విప్మెంట్ తయారీపై దృష్టి పెట్టాం. 3 కోట్ల ఉద్యోగాలు కరోనా కారణంగా సమాజంలో అసమానతలు పెరిగాయి. ఇవి సమసిపోవాలంటే విద్యా, వైద్య రంగంలో త్వరితగతిన మార్పులు జరగాల్సి ఉంది. ఈ రంగంలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ఉద్యోగ అవకాశాలను సృష్టించవచ్చు. ముఖ్యంగా స్కిల్ తక్కువగా ఉన్న వారికి ఉద్యోగాలను కల్పించే వెసులుబాటు కలుగుతుంది. హైబ్రిడ్‌తో ఇంటి నుంచి, ఆఫీసు నుంచి పని చేసే హైబ్రిడ్ విధానం మరింత విస్త్రృతమైతే పదో తరగతి వరకు చదివిన గృహిణులకు కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. మా అంచనా ప్రకారం హైబ్రిడ్ పద్దతి సక్సెస్ అయితే 12 కోట్ల మంది మహిళలు ఇంటి నుంచే వివిధ ఉద్యోగాలు చేయగలుతారు. దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకి 440 బిలియన్ డాలర్లు సమకూరుతాయి. -
లక్ష ఉద్యోగాలిస్తాం : ముఖేష్ అంబానీ
న్యూఢిల్లీ : టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ జియో పెట్టుబడుల్లో కూడా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో రూ.20వేల కోట్లను పెట్టుబడులుగా పెట్టిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, మరో రూ.10వేల కోట్లను వచ్చే మూడేళ్లలో పెట్టుబడులుగా పెట్టనున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలో డిజిటల్ సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ఈ పెట్టుబడులను ఉపయోగించనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, చైర్మన్ ముఖేష్ అంబానీ బుధవారం తెలిపారు. ఈ పెట్టుబడులతో జియో ఇక్కడ వచ్చే కొన్నేళ్లలో దాదాపు లక్ష ఉద్యోగ అవకాశాలను సృష్టించనునందని పేర్కొన్నారు. గౌరవనీయులైన ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి హామి ఇస్తున్నాను, ఉత్తరప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడవడానికి జియో డిజిటల్ విప్లవం ద్వారా తమ వంతు సహకారం అందిస్తామని యూపీ పెట్టుబడిదారుల సదస్సులో అంబానీ తెలిపారు. రూ.20వేల కోట్లకు పైగా పెట్టుబడులతో ఉత్తరప్రదేశ్‌లో అతిపెద్ద పెట్టుబడిదారిలో ఒకటిగా జియో ఉందని చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు. రెండేళ్ల కంటే తక్కవ వ్యవధిలోనే దేశవ్యాప్తంగా రిలయన్స్ వరల్డ్ క్లాస్ డిజిటల్ సదుపాయాలను అభివృద్ధి చేసిందని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరలకు హై క్వాలిటీ డేటా సర్వీసులను జియో అందిస్తుందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 2 కోట్ల మంది సిటిజన్లకు ఈ సేవలు అందుతున్నాయని చెప్పారు. రైతులకు, చిన్న మధ్య తరహా వ్యాపారాలకు, అతిపెద్ద వ్యాపారస్తులకు, ఆసుపత్రులకు, స్కూళ్లకు, కాలేజీలకు, యూనివర్సిటీలకు ప్రయోజనాలను అందించడానికి తర్వాతి తరం డిజిటల్ కమ్యూనికేషన్ సర్వీసులను పునర్నిర్మాణం చేపట్టామని అంబానీ తెలిపారు. అన్ని వ్యాపారాల అంతిమ లక్ష్యం '' సర్వే భవంతు సుఖినహ ... సర్వే సంతు నిరామయా!'' అని విశ్వసిస్తున్నట్టు అంబానీ చెప్పారు. -
ఉపాధి, ఆదాయ అవకాశాలు కల్పించాలి
మంత్రి మహేందర్‌రెడ్డికి గొల్లపల్లి గ్రామస్తుల వినతి శంషాబాద్ రూరల్: విమానాశ్రయం ఏర్పాటుతో వేల ఎకరాల భూములు కోల్పోయిన గొల్లపల్లి వాసులకు ఉపాధి, పంచాయతీకి ఆదాయ వనరులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు మంత్రి మహేందర్‌రెడ్డికి విన్నవించారు. మంత్రిని ఆదివారం ఆయన నివాసంలో కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. భూములు కోల్పోయిన గ్రామస్తులు ఉపాధి లేక అవస్థలు పడుతున్నారని, పంచాయతీకి ఆదాయం లేక అభివృద్ధి జరగడంలేదని తెలిపారు. విమానాశ్రయం ఏర్పాటు సమయంలో గ్రామంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చెప్పిన నిర్వాహకులు ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీకి పన్ను రూపంలో పైసా కూడా చెల్లించడం లేదన్నారు. జీఎంఆర్ సంస్థ నిర్వహిస్తున్న పాఠశాలలో గ్రామ విద్యార్థులకు ఫీజు రాయితీ కల్పించాలని డిమాండ్ చేశారు. విమానాశ్రయం ఏర్పాటు చేసి 8 ఏళ్లు పూర్తి అయినా గ్రామంలో ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని, గ్రామానికి తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ సిద్దులు, ఉపసర్పంచ్ నర్సింహా, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు శేఖర్, నాయకులు ప్రవీణ్, నవీన్, యాదయ్య, శశిధర్, శ్రీధర్, మోహన్, శ్రీను, భిక్షపతి, గణేష్, నర్సింగ్, పర్వతం, నర్సింహా ఉన్నారు.