ముఖేష్ అంబానీ (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : టెలికాం మార్కెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ జియో పెట్టుబడుల్లో కూడా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో రూ.20వేల కోట్లను పెట్టుబడులుగా పెట్టిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, మరో రూ.10వేల కోట్లను వచ్చే మూడేళ్లలో పెట్టుబడులుగా పెట్టనున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలో డిజిటల్ సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ఈ పెట్టుబడులను ఉపయోగించనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, చైర్మన్ ముఖేష్ అంబానీ బుధవారం తెలిపారు. ఈ పెట్టుబడులతో జియో ఇక్కడ వచ్చే కొన్నేళ్లలో దాదాపు లక్ష ఉద్యోగ అవకాశాలను సృష్టించనునందని పేర్కొన్నారు.
గౌరవనీయులైన ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి హామి ఇస్తున్నాను, ఉత్తరప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడవడానికి జియో డిజిటల్ విప్లవం ద్వారా తమ వంతు సహకారం అందిస్తామని యూపీ పెట్టుబడిదారుల సదస్సులో అంబానీ తెలిపారు. రూ.20వేల కోట్లకు పైగా పెట్టుబడులతో ఉత్తరప్రదేశ్‌లో అతిపెద్ద పెట్టుబడిదారిలో ఒకటిగా జియో ఉందని చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు. రెండేళ్ల కంటే తక్కవ వ్యవధిలోనే దేశవ్యాప్తంగా రిలయన్స్ వరల్డ్ క్లాస్ డిజిటల్ సదుపాయాలను అభివృద్ధి చేసిందని తెలిపారు.
ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరలకు హై క్వాలిటీ డేటా సర్వీసులను జియో అందిస్తుందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 2 కోట్ల మంది సిటిజన్లకు ఈ సేవలు అందుతున్నాయని చెప్పారు. రైతులకు, చిన్న మధ్య తరహా వ్యాపారాలకు, అతిపెద్ద వ్యాపారస్తులకు, ఆసుపత్రులకు, స్కూళ్లకు, కాలేజీలకు, యూనివర్సిటీలకు ప్రయోజనాలను అందించడానికి తర్వాతి తరం డిజిటల్ కమ్యూనికేషన్ సర్వీసులను పునర్నిర్మాణం చేపట్టామని అంబానీ తెలిపారు. అన్ని వ్యాపారాల అంతిమ లక్ష్యం '' సర్వే భవంతు సుఖినహ ... సర్వే సంతు నిరామయా!'' అని విశ్వసిస్తున్నట్టు అంబానీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment