ఉపాధి, ఆదాయ అవకాశాలు కల్పించాలి
మంత్రి మహేందర్‌రెడ్డికి గొల్లపల్లి గ్రామస్తుల వినతి
శంషాబాద్ రూరల్: విమానాశ్రయం ఏర్పాటుతో వేల ఎకరాల భూములు కోల్పోయిన గొల్లపల్లి వాసులకు ఉపాధి, పంచాయతీకి ఆదాయ వనరులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు మంత్రి మహేందర్‌రెడ్డికి విన్నవించారు. మంత్రిని ఆదివారం ఆయన నివాసంలో కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. భూములు కోల్పోయిన గ్రామస్తులు ఉపాధి లేక అవస్థలు పడుతున్నారని, పంచాయతీకి ఆదాయం లేక అభివృద్ధి జరగడంలేదని తెలిపారు.
విమానాశ్రయం ఏర్పాటు సమయంలో గ్రామంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చెప్పిన నిర్వాహకులు ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీకి పన్ను రూపంలో పైసా కూడా చెల్లించడం లేదన్నారు. జీఎంఆర్ సంస్థ నిర్వహిస్తున్న పాఠశాలలో గ్రామ విద్యార్థులకు ఫీజు రాయితీ కల్పించాలని డిమాండ్ చేశారు. విమానాశ్రయం ఏర్పాటు చేసి 8 ఏళ్లు పూర్తి అయినా గ్రామంలో ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని, గ్రామానికి తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ సిద్దులు, ఉపసర్పంచ్ నర్సింహా, టీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు శేఖర్, నాయకులు ప్రవీణ్, నవీన్, యాదయ్య, శశిధర్, శ్రీధర్, మోహన్, శ్రీను, భిక్షపతి, గణేష్, నర్సింగ్, పర్వతం, నర్సింహా ఉన్నారు.