gollapalli village
-
ఉపాధి, ఆదాయ అవకాశాలు కల్పించాలి
మంత్రి మహేందర్‌రెడ్డికి గొల్లపల్లి గ్రామస్తుల వినతి శంషాబాద్ రూరల్: విమానాశ్రయం ఏర్పాటుతో వేల ఎకరాల భూములు కోల్పోయిన గొల్లపల్లి వాసులకు ఉపాధి, పంచాయతీకి ఆదాయ వనరులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు మంత్రి మహేందర్‌రెడ్డికి విన్నవించారు. మంత్రిని ఆదివారం ఆయన నివాసంలో కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. భూములు కోల్పోయిన గ్రామస్తులు ఉపాధి లేక అవస్థలు పడుతున్నారని, పంచాయతీకి ఆదాయం లేక అభివృద్ధి జరగడంలేదని తెలిపారు. విమానాశ్రయం ఏర్పాటు సమయంలో గ్రామంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చెప్పిన నిర్వాహకులు ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీకి పన్ను రూపంలో పైసా కూడా చెల్లించడం లేదన్నారు. జీఎంఆర్ సంస్థ నిర్వహిస్తున్న పాఠశాలలో గ్రామ విద్యార్థులకు ఫీజు రాయితీ కల్పించాలని డిమాండ్ చేశారు. విమానాశ్రయం ఏర్పాటు చేసి 8 ఏళ్లు పూర్తి అయినా గ్రామంలో ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని, గ్రామానికి తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ సిద్దులు, ఉపసర్పంచ్ నర్సింహా, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు శేఖర్, నాయకులు ప్రవీణ్, నవీన్, యాదయ్య, శశిధర్, శ్రీధర్, మోహన్, శ్రీను, భిక్షపతి, గణేష్, నర్సింగ్, పర్వతం, నర్సింహా ఉన్నారు. -
పచ్చని కాపురంలో మద్యం చిచ్చు
భర్త తాగుడు మానలేదని భార్య ఆత్మహత్య పుట్లూరు : ఓ పచ్చని సంసారంలో మద్యం మహమ్మారి చిచ్చుపెట్టింది. తన భర్త మద్యం తాగడం మానడం లేదన్న బెంగతో ఓ మహిళ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పుట్లూరు మండలం గొల్లపల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గొల్లపల్లికి చెందిన గురుప్రసాద్, వెంకటరమణమ్మ(32)కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరి కాపురం సజావుగా సాగుతున్న తరుణంలో రెండేళ్ల క్రితం నుంచి గురుప్రసాద్ మద్యానికి బానిసయ్యాడు. వెంకటరమణమ్మ భర్తకు ఎన్నిసార్లు చెప్పిచూసినా వినలేదు. చివరికి వారి కుటుంబంలో కలతలు రేగాయి. ఇదే విషయమై వారిద్దరి మధ్య ఎన్నోసార్లు గొడవ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి భర్త మద్యం తాగి రావడంతో వెంకటరమణమ్మ అతడ్ని మందలించింది. ఎన్నిసార్లు చెప్పినా మద్యం సేవించడం మానలేదన్న మనస్థాపంతో మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని తాడిపత్రి ప్రభుత్వాస్పపత్రికి తరలించినట్లు ఎస్ఐ ప్రదీప్‌కుమార్ తెలిపారు. వెంకటరమణమ్మకు గురుహేమంత్ (4), గురునిషితా (3) అనే కుమారుడు, కుమార్తె ఉన్నారు.