అందరివాడిని...!
అందుబాటులో ఉంటా...
రాజన్న, నాన్న కలలు నెరవేరుస్తా
ఉపాధి కల్పన, సుజల స్రవంతి ప్రాజెక్టులకు ప్రాధాన్యం
ఎంపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ ఇంటర్వ్యూ
గాజువాక, న్యూస్‌లైన్ : ‘నేను ఇక్కడే పుట్టి...ఇక్కడే పెరిగాను. నున్న ఇక్కడి ప్రజలు చేయి పట్టుకొని నడిపించారు. నాన్న గురునాథరావుపై ఉన్న అభిమానాన్ని ప్రేమగా మార్చి నాపై చూపించారు. నన్ను తమ భుజాలపై ఎత్తుకొని ఆడించారు. అందుకే... వారికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటా. వారి సంతోషాల్లో భాగస్వామినవుతా...’ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న 28 ఏళ్ల యువకుడు గుడివాడ అమర్నాథ్ చెప్పిన మాటలివి. ఎన్నికల ప్రచారంలో భాగంగా దాదాపు అన్ని గ్రామాల్లోను పర్యటించిన ఆయన న్యూస్‌లైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. అవి ఆయన మాటల్లోనే...
యువతకు ఉపాధి కల్పనే ధ్యేయం...
అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో యువతకు ఈ ప్రాంతంలోనే ఉపాధి కల్పించడం నా ధ్యేయం. ఇక్కడ 18-25 ఏళ్ల యువతే ఎక్కువ. అంతా ఉన్నత విద్యావంతులే. తమను పెంచి, పెద్ద చేసిన తల్లిదండ్రులను వదిలి వెళ్లలేక, ఇక్కడ ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. జగన్ అన్నయ్య ప్రకటించిన ఎన్నికల ప్రణాళికలో ఈ విషయంపై చాలా స్పష్టంగా చెప్పారు. ఎక్కడైనా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చూస్తాను. త్వరలో విశాఖ ఆర్థిక రాజధానిగా మారనుంది. కొత్తగా ఏర్పడే పరిశ్రమలకు పదేళ్లపాటు పన్నుల రాయితీలతోపాటు అనేక సౌకర్యాలు కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గమే అనుకూలంగా ఉంటుంది. మరింత ఎక్కువమందికి ఉపాధి లభిస్తుంది.
ఐటీ హబ్ సాధిస్తా...
హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి ఐటి హబ్ మాదిరిగా అనకాపల్లి పార్లమెంట్‌ను కూడా ఐటి హబ్‌గా మారుస్తా. తెలంగాణకు శేరిలింగంపల్లి గుండెకాయవంటింది. అలాంటిది ఇక్కడ కూడా సాధిస్తాం. ఈ హబ్‌లోను, ఫార్మా సెజ్‌లోను స్థానిక యువకులందిరికీ ఉపాధి కల్పించాలనేది నా ఆశయం. రూరల్ బీపీవోలను ఏర్పాటు చేసి ఐటీ అభివృద్ధి చేయాలన్నది నా లక్ష్యం.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సాధిస్తా...
జగన్ అన్నయ్య రైతులకు అండగా ఉంటారు. వైఎస్ కలల ప్రాజెక్టు అయిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తి చేసేందుకు రూ.1000 కోట్లు కావాలి. ఇక్కడి ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆ నిధులను తెస్తాం. ఈ ప్రాజెక్టుద్వారా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అందులో రెండున్నర లక్షల ఎకరాలు విశాఖ జిల్లాలోనే ఉంది. సుజల స్రవంతి పూర్తై రైవాడ నీరు మొత్తం రైతులకు ఇవ్వొచ్చు. రైవాడద్వారా ఆరువేల ఎకరాలకు నీరు అందుతుంది. ఒక్కో పార్లమెంట్ సభ్యుడికి ఏడాదికి రూ.5కోట్లు అభివృద్ధి నిధులు కేటాయిస్తారు. ఇందులో ప్రతి ఏలా రూ.కోటి నిధులు దళిత ప్రాంతాల అభివృద్ధికి కేటాయిస్తాను.
రాజకీయమే నా వ్యాపకం...
నాకు రాజకీయం వ్యాపకం. నా ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు అది వ్యాపారం. ప్రతిరోజు ప్రజలను కలవడంతోనే నా దినచర్య ప్రారంభమవుతుంది. నిత్యం ప్రజలమధ్య, ప్రజలతోనే ఉంటాను. వారి (ప్రత్యర్థుల) మాదిరిగా నాకు ఏ వ్యాపారాలు లేవు.